AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiration Story: ఫొటో గ్రాఫర్ కొడుక్కి రూ.1.5 కోట్ల జాబ్ ఆఫర్.. ఈ కుర్రాడి గురించి మీకు చెప్పాలి!

IIIT ధార్వాడ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆదిత్య అరేపల్లి ముందుగా రూ.13 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం ప్రారంభించారు. అయితే భవిష్యత్తులో AI, Machine Learningకు పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించి, ఆ ఉద్యోగాన్ని వదిలి అమెరికాలోని University at Buffaloలో AIలో మాస్టర్స్ చేశారు. అంతే లైఫ్ పూర్తిగా మారిపోయింది..

Inspiration Story: ఫొటో గ్రాఫర్ కొడుక్కి రూ.1.5 కోట్ల జాబ్ ఆఫర్.. ఈ కుర్రాడి గురించి మీకు చెప్పాలి!
IIIT Dharwad Graduate Inspiring Journey
Srilakshmi C
|

Updated on: Aug 10, 2026 | 12:49 PM

Share

హైదరాబాద్, ఆగస్ట్‌ 10: చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహం, ఉన్నత విద్యపై నమ్మకం, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తనను తాను అప్‌డేట్ చేసుకోవాలనే ఆలోచన.. ఇవన్నీ కలిస్తే కెరీర్‌లో ఎంతటి మార్పు తీసుకురావచ్చో చూపించే కథ ఇది. హైదరాబాద్‌కు చెందిన యువ ఇంజినీర్ ఆదిత్య అరేపల్లి ప్రస్తుతం అమెరికాలోని సియాటిల్‌లో Amazon Web Services (AWS)లో ఉద్యోగం సాధించినట్లు సోషల్ మీడియాలో ఓ కథనం వైరల్ అవుతోంది. ఆయనకు ఏడాదికి సుమారు రూ.1.5 కోట్ల ప్యాకేజీ లభిస్తున్నట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు. ఆదిత్య ఓ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కుమారుడు. ఆయన కెరీర్ ప్రయాణాన్ని వివరిస్తూ వికాస్ ఆల్వేస్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌ విస్తృతంగా వైరల్ అయింది. ఆదిత్య సాధించిన విజయంతో పాటు, తన పిల్లల భవిష్యత్తు కోసం తండ్రి చేసిన కృషి కూడా నెటిజన్లను ఆకట్టుకుంది.

ఎవరీ ఆదిత్య అరేపల్లి..?

ఆదిత్య అరేపల్లి 2022లో IIIT Dharwad నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసినట్లు పోస్టులో పేర్కొన్నారు. చదువు పూర్తయిన వెంటనే ఆయనకు Riverbed Technologyలో ఉద్యోగం లభించింది. అక్కడ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన ఆదిత్యకు ప్రారంభంలో ఏడాదికి సుమారు రూ.13 లక్షల వేతనం లభించింది. దాదాపు ఏడాది పాటు కంపెనీలో పనిచేశారు. అయితే టెక్నాలజీ రంగంలో వేగంగా మారుతున్న పరిణామాలను గమనించిన ఆయన తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

AI, Machine Learningలకు భారీ డిమాండ్

ఇటీవలి కాలంలో Artificial Intelligence (AI), Machine Learning (ML) టెక్నాలజీలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. టెక్ పరిశ్రమలో AI ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, కేవలం సంప్రదాయ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలతో సరిపెట్టుకోకుండా మరింత ఉన్నత విద్యను అభ్యసించాలని ఆదిత్య భావించారు. అందుకోసం భారత్‌లో తనకు ఉన్న స్థిరమైన ఉద్యోగాన్ని వదిలి, అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించేందుకు సిద్ధమయ్యారు. ఇది రిస్క్‌తో కూడిన నిర్ణయమే అయినప్పటికీ, తన భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని భావించారు. ఆదిత్య న్యూయార్క్‌లోని University at Buffaloలో Artificial Intelligenceలో మాస్టర్స్ డిగ్రీలో చేరారు. AI రంగంలో లోతైన పరిజ్ఞానం, ప్రత్యేక నైపుణ్యాలు సంపాదించడంపై దృష్టి పెట్టారు. ఉన్నత విద్య పూర్తయ్యాక అమెరికాలో టెక్నాలజీ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకున్నారు. చివరకు సియాటిల్‌లోని Amazon Web Services (AWS)లో ఉద్యోగం సాధించారు. సోషల్ మీడియా పోస్టు ప్రకారం, AWSలో ఆయనకు ఏడాదికి సుమారు రూ.1.5 కోట్ల ప్యాకేజీ లభిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అమెరికా ఉద్యోగాల్లో జీతం, బోనస్, స్టాక్ వంటి అంశాల నిర్మాణం భిన్నంగా ఉండే అవకాశం ఉంది.

తండ్రి త్యాగం.. కొడుకు విజయం

ఆదిత్య విజయానికి ఆయన తండ్రి చేసిన కృషి కూడా ఇందులో ప్రధానంగా నిలిచింది. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ తన పిల్లలకు మంచి విద్య అందించేందుకు ఎంతో కష్టపడ్డానని ఆయన చెప్పినట్లు సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. పిల్లల కోసం తల్లిదండ్రులు తమ వర్తమానాన్ని త్యాగం చేసి, వారి భవిష్యత్తును నిర్మిస్తారు అనే భావన ఈ కథకు మరింత భావోద్వేగాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య ఇప్పుడు తన తండ్రికి అండగా నిలిచే స్థాయికి ఎదిగాడని పోస్టులో పేర్కొనడం నెటిజన్లను ఆకట్టుకుంది. తల్లిదండ్రుల త్యాగాలకు ప్రతిఫలంగా పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగడం ఎంత గొప్ప విషయమో అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఆదిత్య కెరీర్ ప్రయాణం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ముఖ్యంగా భారత్‌లో మంచి ఉద్యోగాన్ని వదిలి AIలో మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లడం సాహసోపేతమైన నిర్ణయమని పలువురు ప్రశంసించారు. AI రంగం భారీగా విస్తరించడానికి ముందే ఆ రంగంలో ఉన్నత విద్యను ఎంచుకోవడం ఆయన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడిందని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. మరో నెటిజన్‌ మాత్రం ఈ కథలో ఆదిత్య తండ్రి చేసిన త్యాగమే తనను ఎక్కువగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. కాగా స్థిరమైన ఉద్యోగంతో సంతృప్తి చెందకుండా భవిష్యత్తులో పెరుగుతున్న AI, Machine Learning రంగాలను ముందుగానే గుర్తించి, ఉన్నత విద్య కోసం రిస్క్ తీసుకోవడం ఆదిత్య అరేపల్లి కెరీర్‌లో కీలక మలుపుగా కనిపిస్తోంది. అదే సమయంలో పిల్లల విద్య కోసం తల్లిదండ్రులు చేసే త్యాగాలు కూడా ఆదిత్య జర్నీ ఓ ఉదాహరణగా నిలుస్తోంది.

Follow Us