AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వీడేం డాక్టరండీ బాబూ.. కాలు విరిగిందని ఆస్పత్రికి వస్తే అట్టపెట్టెలతో కట్టుకట్టాడు! వీడియో వైరల్

రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిన ఓ వ్యక్తి లబోదిబో మంటూ ఆసుపత్రికి వస్తే.. అక్కడ ఇచ్చిన వైద్యం చూసి నోరెళ్లబెట్టాడు. విరిగిన కాలుకు అక్కడి వైద్యుడు బ్యాండేజ్‌ కట్టుకు బదులు కార్డ్‌బోర్డ్ ముక్కలను కట్టుగా ఉపయోగించి ప్రాథమిక చికిత్స అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన బిహార్‌లోని బేగుసరాయ్ జిల్లా మంజ్‌హౌల్ సబ్ డివిజనల్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాద బాధితుడికి సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో అతడి విరిగిన కాలును కార్డ్‌బోర్డ్‌తో స్థిరపరిచి (స్ప్లింట్‌గా ఉపయోగించి) మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీహార్‌లోని ప్రభుత్వ వైద్య వ్యవస్థపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

Video: వీడేం డాక్టరండీ బాబూ.. కాలు విరిగిందని ఆస్పత్రికి వస్తే అట్టపెట్టెలతో కట్టుకట్టాడు! వీడియో వైరల్
Cardboard Splint As Emergency First Aid
Srilakshmi C
|

Updated on: Aug 07, 2026 | 7:25 PM

Share

బీహార్, ఆగస్ట్‌ 7:  బీహార్ లోని నౌకోఠి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేశ్వర గ్రామానికి చెందిన కునాల్ కుమార్ అనే వ్యక్తి హర్ సింగ్ బ్రిడ్జి సమీపంలో ఆగస్టు 3వ తేదీ సాయంత్రం జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో ఆయన కాలు విరగడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే మంజ్‌హౌల్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఎముకల వైద్య నిపుణుడు (ఆర్థోపెడిక్ డాక్టర్), డ్రెస్సర్ అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది అందుబాటులో ఉన్న వస్తువులతో ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బేగుసరాయ్ సదర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ సమయంలో బాధితుడి కాలుకు వైద్యుడు కార్డ్‌బోర్డ్ ముక్కలను (అట్టముక్కలు) కట్టి కడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు సదరు ఆస్పత్రి దుస్థితిపై నిప్పులు చెరుగుతున్నారు. మంజ్‌హౌల్ సబ్ డివిజనల్ ఆసుపత్రి నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, రోడ్డు ప్రమాదాల్లో ఎముకలు విరిగిన వారికి పూర్తిస్థాయి చికిత్స అందించే సదుపాయాలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రమాద బాధితులకు అవసరమైన ట్రామా కేర్ సేవలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో లేకపోవడం మరోసారి చర్చకు వచ్చింది.

‘కార్డ్‌బోర్డ్ ఉపయోగించడం తప్పు కాదు’ ఆస్పత్రి వివరణ

ఈ ఘటనపై ఆసుపత్రి ఇన్‌చార్జ్ అభినవ్ ప్రియదర్శి స్పందిస్తూ.. ‘అత్యవసర పరిస్థితుల్లో ఎముక విరిగినప్పుడు తాత్కాలికంగా స్ప్లింట్ ఏర్పాటు చేయడం వైద్యపరంగా సరైన విధానమేనని తెలిపారు. ఎముక విరిగిన తర్వాత రక్తస్రావాన్ని నియంత్రించడానికి, గాయాన్ని స్థిరంగా ఉంచడానికి స్ప్లింట్ ఉపయోగిస్తారు. ఇది వైద్యపరంగా ఇది తప్పు కాదు’ అని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ నిపుణుడు, డ్రెస్సర్ లేకపోవడం వల్ల అందుబాటులో ఉన్న వస్తువులతో ప్రాథమిక చికిత్స చేసి, ఉన్నత వైద్య కేంద్రానికి తరలించాల్సి వచ్చిందని వివరించారు. అయితే ఈ వివరణతో పాటు ఆసుపత్రుల్లో సిబ్బంది కొరతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై బేగుసరాయ్ సివిల్ సర్జన్ డాక్టర్ అశోక్ కుమార్ స్పందించారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోను అధికారులు పరిశీలిస్తున్నారని, ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. బాధితుడికి సరైన వైద్య విధానాల ప్రకారం చికిత్స అందించారా? నిర్లక్ష్యం జరిగిందా? అనే అంశాలను విచారణలో పరిశీలించనున్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. అత్యవసర ప్రాథమిక చికిత్సలో తాత్కాలిక స్ప్లింట్ ఉపయోగించడం సాధారణ వైద్య విధానమే అయినప్పటికీ, ఈ ఆసుపత్రిలో జరిగిన పరిస్థితులపై పూర్తిస్థాయి విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బీహార్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు, నిపుణుల లభ్యతపై మరోసారి చర్చ మొదలైంది. రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ చికిత్స అందించాల్సిన ఆసుపత్రుల్లో సరిపడా వైద్య సిబ్బంది, అవసరమైన సౌకర్యాలు లేకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.

Follow Us