ఇక ప్లాస్టిక్‌కు గుడ్‌బై చెప్పొచ్చా? చేపల పొలుసులతో శాస్త్రవేత్తల సంచలన ప్రయోగం!
ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వ్యర్థాలు పెరుగుతున్న వేళ శాస్త్రవేత్తలు కొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు. చేపల వ్యర్థాల నుంచి ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే పదార్థాన్ని రూపొందించారు. ‘సైక్లో ప్లాస్ 2’గా పిలిచే ఈ కొత్త పదార్థం నేలలో కలిసిపోయే ప్రత్యేకతను కలిగి ఉంది. చేపల వ్యర్థాల సమస్యను తగ్గించడంతో పాటు పర్యావరణంపై ప్లాస్టిక్ భారాన్ని తగ్గించే అవకాశం కనిపిస్తోంది.

చేపలను విక్రయానికి సిద్ధం చేసే సమయంలో భారీగా ముళ్లు, పొలుసులు, రెక్కలు వ్యర్థాలుగా మిగులుతాయి. ఇప్పటివరకు వీటిని ఎక్కువగా వ్యర్థాలుగానే చూస్తున్నారు. అయితే పరిశోధకులు చేపల పొలుసుల్లోని విలువైన పదార్థాలను ఉపయోగించి కొత్త రకం షీట్‌ను తయారు చేశారు. ఇది సాధారణ ప్లాస్టిక్‌లా గట్టిగా ఉండటంతో పాటు కొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.
చేపల పొలుసులతో..
చేపలను ప్రాసెస్ చేసే సమయంలో దాదాపు 20% నుంచి 80% వరకు వ్యర్థాలు మిగులుతాయి. వీటిలో ముళ్లు, ఈదే రెక్కలు, పొలుసులు ఉంటాయి. సరైన నిర్వహణ లేకపోతే ఇవి పర్యావరణానికి సమస్యగా మారుతాయి. చేపల పొలుసుల్లో టైప్-1 కొల్లాజెన్, కాల్షియం లవణాలు అధికంగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. వాటి నుంచి కొల్లాజెన్‌ను సేకరించి ‘చిటోసన్’తో కలిపారు. ‘స్క్లెరోటైజేషన్’ పద్ధతిలో నీరు, వేడిని తట్టుకునేలా పలుచని పారదర్శక షీట్‌ను తయారు చేశారు. దీనికే ‘సైక్లో ప్లాస్ 2’ అని పేరు పెట్టారు.
వేడిని తట్టుకోవడంతో పాటు వేగంగా క్షీణత
ఈ పదార్థాన్ని పలు పరీక్షలకు గురిచేయగా సాధారణ ప్లాస్టిక్‌లా గట్టిగా ఉన్నట్లు గుర్తించారు. 140°C నుంచి 150°C వరకు ఉష్ణోగ్రత వద్ద కూడా పారదర్శకతను కొనసాగించింది. సాధారణ LDPE ప్లాస్టిక్‌తో పోలిస్తే వేడికి తక్కువగా సంకోచించినట్లు పరీక్షల్లో వెల్లడైంది.
అయితే దీని ప్రధాన ప్రత్యేకత మట్టిలో కలిసిపోయే గుణం. నేలలో వేసిన రెండో వారం నుంచే క్షీణించడం మొదలై, ఎనిమిదో వారం పూర్తికాకముందే పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. ఈ పదార్థం కలిసిన మట్టిలో పెంచిన మొక్కలపై ప్రతికూల ప్రభావం కనిపించలేదు. పైగా మొక్కలు సాధారణ మట్టితో పోలిస్తే 3% నుంచి 7% వేగంగా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించారు.
షాపింగ్ బ్యాగులు, ప్యాకేజింగ్, కంటైనర్లు, సింగిల్ యూజ్ వస్తువులకు ఇది ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే పచ్చి చేపల వ్యర్థాలతో భారీ స్థాయిలో తయారీ, సముద్రపు నీటిలో మన్నిక వంటి అంశాలపై ఇంకా పరీక్షలు అవసరమని పరిశోధకులు చెబుతున్నారు.
