16 July 2026

Video: హైనా vs చిరుత..  భీకర పోరులో గెలుపు  మీ ఊహకు అందదు..?

Venkata Chari

అటవీ ప్రపంచం ఎన్నో రహస్యాలకు, ఆశ్చర్యాలకు నెలవు. అక్కడ ప్రతి జీవి తన ఉనికిని కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు పోరాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలో రెండు క్రూర మృగాలు ఎదురుపడితే ఆ దృశ్యం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.

ముఖ్యంగా అడవికి వేగపు రాజు అయిన చిరుతపులి, అతి భయంకరమైన దవడలు కలిగిన హైనా.. ఈ రెండూ ముఖాముఖి తలపడితే విజయం ఎవరిని వరిస్తుంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

అడవిలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుగా చిరుతపులికి పేరుంది. ఇది గంటకు సుమారు 58 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో తన ఆహారాన్ని వెంబడిస్తుంది. పొంచి ఉండి, ఒక్క ఉదుటున తన ఎరపై దాడి చేయడం చిరుత ప్రత్యేకత. దాని పదునైన గోర్లు, బలమైన కోరలతో జింకలు, అడవి పందులు, కోతులు వంటి వాటిని సునాయాసంగా వేటాడుతుంది. 

అంతేకాదు, తాను వేటాడిన ఆహారాన్ని ఇతర క్రూర మృగాలు లాక్కోకుండా ఎత్తుగా ఉండే చెట్లపైకి తీసుకెళ్లి దాచుకునే అద్భుత నైపుణ్యం చిరుత సొంతం. ఇది సాధారణంగా ఒంటరిగానే వేటాడుతుంది.

చాలా మంది హైనా అంటే కేవలం చనిపోయిన జంతువుల మాంసాన్ని తినే జీవిగా మాత్రమే భావిస్తారు. కానీ, హైనాలు అత్యంత వ్యూహాత్మకమైన వేటగాళ్లు. ఇవి సామాజిక జీవులు, ఎప్పుడూ గుంపులుగానే ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత బలమైన దవడలు కలిగిన జంతువులలో హైనా ఒకటి.

ఎముకలను సైతం సులభంగా పిండి చేయగల శక్తి వీటి దవడలకు ఉంటుంది. ఇవి గుంపుగా వేటాడితే సింహాలు, అడవి ఎద్దుల వంటి భారీ జంతువులను సైతం మట్టికరిపించగలవు.

ఒకవేళ అడవిలో ఒంటరిగా ఉన్న చిరుత, ఒంటరి హైనా ఎదురెదురుగా వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. ఆకస్మికంగా, మెరుపు వేగంతో దాడి చేసే అవకాశం దొరికితే కచ్చితంగా చిరుతదే పైచేయి అవుతుంది. 

కానీ, ఈ పోరాటం ఎక్కువ సమయం కొనసాగితే మాత్రం సీన్ మారుతుంది. హైనాకు ఉండే అపారమైన సహనశక్తి, దాని బలమైన దవడలు పోరులో దానికి ఆధిక్యాన్ని తెచ్చిపెడతాయి.

అదే హైనాలు గుంపుగా వస్తే మాత్రం, చిరుత సాధారణంగా పోరాటానికి దిగకుండా వెనక్కి తగ్గుతుంది. ప్రాణాల మీదకు తెచ్చుకునే అనవసరమైన పోరాటాలకు చిరుతలు ఎప్పుడూ దూరంగా ఉంటాయి. హైనాల గుంపు వస్తే తాను వేటాడిన ఆహారాన్ని సైతం అక్కడే వదిలేసి చెట్టెక్కేస్తాయి.

ఈ వీడియోలో మాత్రం హైనాను చూసి చిరుత వెనక్కి తగ్గింది. ఎంత ప్రయత్నించినా, హైనా నుంచి పోరాడిన జంతువును దక్కించుకోలేకపోయింది. చాలాదూరం తన వేట కోసం వెంబడించినా, చిరుతకు మొండిచేయే దక్కింది.

వాస్తవానికి అడవిలో హైనా, చిరుత పోరులో "కచ్చితంగా ఫలానా జంతువే గెలుస్తుంది" అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే, అక్కడ బలం ఒక్కటే సరిపోదు. ఆ సమయానికి ఉండే పరిస్థితులు, వ్యూహం, తెలివితేటలు, గుంపుల సంఖ్య అన్నీ విజయాన్ని ప్రభావితం చేస్తాయి.