AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరని అంటే ఏం చెప్తావ్‌?’ UPSC ఇంటర్వ్యూలో ఒక్క ఆన్సర్‌తో టాప్ ర్యాంక్!

సివిల్స్ సాధించడం సాధారణ విషయం కాదు. కానీ సరైన ప్రణాళిక, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సాధించలేనిది కూడా కాదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ లక్ష్యంపై దృష్టి పెట్టిన వారు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో విజయం సాధిస్తారు. అలాగే విజయం ఒక్కరోజులో రాదు. ఓటమిని పాఠంగా మార్చుకుని, సరైన ప్రణాళికతో నిరంతరం కష్టపడితే అసాధ్యమైన లక్ష్యాలు కూడా సాధ్యమవుతాయి. అలాంటి పట్టుదలతో ముందుకు సాగి తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో మెరిసిన అభ్యర్థుల్లో సాయిశివాని ఒకరు. UPSC సివిల్స్‌లో ఆమె 11వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ట్రాల టాపర్‌గా నిలిచారు..

'6 ఏళ్ల పిల్లాడు దేవుడు ఎవరని అంటే ఏం చెప్తావ్‌?' UPSC ఇంటర్వ్యూలో ఒక్క ఆన్సర్‌తో టాప్ ర్యాంక్!
UPSC Topper Sai Shivani
Srilakshmi C
|

Updated on: Aug 07, 2026 | 5:55 PM

Share

తెలంగాణలోని వరంగల్‌కు చెందిన సాయిశివాని.. ఖమ్మంలో పదో తరగతి వరకు విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో ఇంటర్‌తో పాటు ఇంజినీరింగ్ చదివారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సాయిశివానికి చిన్నప్పటి నుంచే సివిల్స్ సాధించాలనే లక్ష్యం ఉండేది. ఆమె తండ్రి రాజ్ కుమార్ మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తుండగా, తల్లి రజిత గృహిణి. ఇంట్లోనే మంచి చదువు వాతావరణం ఉండటం ఆమె విజయానికి పునాది వేసింది. ముఖ్యంగా ఆమె తండ్రి తరచూ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు. తెలియని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుని మళ్లీ చెప్పే అలవాటు చిన్నప్పటి నుంచే ఆమెలో జ్ఞానాన్ని పెంచింది.

మొదటి ప్రయత్నంలో వైఫల్యం.. రెండో ప్రయత్నంలో విజయం

సివిల్స్ ప్రయాణం సాయిశివానికి అంత సులభంగా సాగలేదు. దాదాపు మూడేళ్ల పాటు ఆమె ఈ పరీక్ష కోసం కష్టపడ్డారు. మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోయారు. సరైన ప్రణాళిక లేకపోవడం, మెటీరియల్ పరిమితంగా చదవడం, పరీక్ష విధానంపై పూర్తి అవగాహన లేకపోవడం కారణంగా విఫలమయ్యానని ఆమె తెలిపారు. అయితే ఆ ఓటమి ఆమెను నిరుత్సాహపరచలేదు. కుటుంబ సభ్యులు, స్నేహితుల ప్రోత్సాహంతో రెండోసారి మరింత పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యారు. ఆన్‌లైన్ వనరులను ఉపయోగించుకుని అవసరమైన మెటీరియల్ సేకరించారు. పాత ప్రశ్నాపత్రాలను విశ్లేషిస్తూ ప్రిపరేషన్ కొనసాగించారు. సాయిశివాని ప్రిపరేషన్‌లో క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు.

ప్రిలిమ్స్ సమయంలో రోజుకు 6 నుంచి 8 గంటలు చదివారు. మెయిన్స్ కోసం రోజుకు 13 నుంచి 14 గంటల వరకు శ్రమించారు. నెలలో ఒకరోజు బ్రేక్ తీసుకుని కుటుంబంతో సమయం గడిపేవారు. ఇష్టమైన సినిమాలు చూడటం, వంటలు చేయడం వంటి వాటితో మానసిక ప్రశాంతత పొందేవారు. ఆమె UPSCలో ఆంత్రపాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలను ఎక్కువగా సాధన చేయడం. ముఖ్యమైన అంశాలను కీ వర్డ్స్ రూపంలో నోట్స్ తయారు చేసుకోవడం. ప్రభుత్వ డేటా, గణాంకాలతో ప్రత్యేక నోట్స్ సిద్ధం చేయడం. టాపర్స్ నోట్స్‌ను రిఫరెన్స్‌గా ఉపయోగించడం. తరచూ రివిజన్ చేయడం.. ఈ విధానం వల్ల కొత్తగా వచ్చే ప్రశ్నలకు కూడా విశ్లేషణాత్మకంగా సమాధానాలు రాయగలిగానని ఆమె తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్వ్యూలో ఎదురైన ఆసక్తికర ప్రశ్నలు

సాయిశివాని UPSC ఇంటర్వ్యూ దాదాపు అరగంటకు పైగా కొనసాగింది. ఐదుగురు సభ్యులతో కూడిన బోర్డు ఆమెను వివిధ అంశాలపై ప్రశ్నించింది. కరెంట్ అఫైర్స్‌పై ప్రశ్నలు వస్తాయని భావించిన ఆమె అందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమె డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్‌లో పేర్కొన్న అంశాలపై ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఆమె హాబీలైన యోగా, వ్యర్థ పదార్థాలతో హ్యాండీక్రాఫ్ట్స్ తయారీ, తొమ్మిదో తరగతిలో భగవద్గీత శ్లోకాల పఠనంలో సాధించిన విజయం వంటి అంశాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇంటర్వ్యూలో అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. అదేంటంటే.. ‘ఆరేళ్ల పిల్లాడు దేవుడు ఎవరని అడిగితే ఏమి చెబుతారు?’ అని బోర్డు సభ్యులు ప్రశ్నించారు. దీనికి సాయిశివాని ఆలోచనాత్మకంగా సమాధానం ఇచ్చారు. ‘దేవుడికి ప్రత్యేకమైన రూపం ఉండదని, ప్రతి మనిషి జీవిత అనుభవాల ద్వారా ఆధ్యాత్మికతను అర్థం చేసుకుంటారని చెప్పారు. అవసరమైన సమయంలో ఇతరులకు సహాయం చేసే ప్రతి వ్యక్తి దేవుడితో సమానమని’ వివరించారు. ఆమె సమాధానం బోర్డు సభ్యులను ఆకట్టుకున్నట్లు ఆమె తెలిపారు.

భగవద్గీతపై మరో ప్రశ్న..

ఆమె భగవద్గీత గురించి ప్రస్తావించడంతో ‘ప్రతి యుగంలో దేవుడు వస్తాడని చెబుతారు. మరి సమాజంలో అన్యాయాలు జరుగుతున్నప్పుడు దేవుడు ఎందుకు రావడం లేదు?’ అని ప్రశ్నించారు. దీనికి సాయిశివాని ‘సమాజంలోని ప్రతి మనిషిలో కొంత మంచితనం ఉంటుంది. అవసరమైన సమయంలో సహాయం చేసే ప్రతి వ్యక్తి దేవుడి రూపమే. దేవుడు ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేదు. మంచి చేసే ప్రతి మనిషిలో దేవుడిని చూడవచ్చు’ అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత వరంగల్ ప్రత్యేకత ఏమిటని అడిగినప్పుడు కాకతీయుల చరిత్రను ఆమె వివరించారు. కాకతీయులు ఓరుగల్లును రాజధానిగా చేసుకుని తెలుగు నేలను పాలించిన గొప్ప రాజవంశమని తెలిపారు. వారు నిర్మించిన చెరువులు ఇప్పటికీ రైతులకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం, కాకతీయ కళాతోరణం వంటి చారిత్రక సంపదలను ప్రస్తావిస్తూ వరంగల్ గొప్పతనాన్ని వివరించారు. సాయిశివాని ప్రయాణం ఒక విషయం స్పష్టం చేస్తుంది. వైఫల్యం వచ్చినప్పుడు ఆగిపోకుండా, తప్పులను విశ్లేషించి ముందుకు సాగితే విజయం తప్పక వస్తుంది. మొదటి ప్రయత్నంలో విఫలమైన ఆమె, అదే అనుభవాన్ని పాఠంగా మార్చుకుని దేశస్థాయిలో 11వ ర్యాంకు సాధించారు. కష్టానికి సరైన ప్రణాళిక, పట్టుదల జత అయితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని ఆమె విజయం నిరూపించింది.

Follow Us