‘విమానాన్ని కూల్చేయాలనుకున్నా.. చావంటే భయం లేదు!’
ఫ్లై దుబాయ్ విమానాన్ని ముందుగా హైజాక్ చేయాలనుకున్నాడా? లేదా ఏకంగా కూల్చేయాలని ప్లాన్ వేశాడా? ఫ్లైదుబాయ్ విమానంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసిన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ.. తాను విమానాన్ని కూల్చేయాలనుకున్నట్లు సౌదీ అరేబియా అధికారులకు చెప్పినట్లు సమాచారం. చావంటే తనకు భయం లేదని విచారణలో చెప్పినట్లు 'వాల్ స్ట్రీట్ జర్నల్' ఓ కథనంలో తెలిపింది.

సౌదీ అరేబియాలోని తబుక్ లో అత్యవసరంగా ల్యాండ్ అయిన విమానం నుంచి అధికారులు కో పైలట్ 29 ఏళ్ల హమామ్ అల్-హమ్మామీని అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయాలు తెలిసాయి. ‘విమానాన్ని కూల్చేయాలనుకున్నా.. చావంటే భయం లేదు’ అని చెప్పినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో ప్రచురించింది. ప్రస్తుతం సౌదీ నుంచి యూఏఈకి తరలించిన దర్యాప్తు అధికారులు అతడిని విచారిస్తున్నారు.
విమానంలోని కాక్‌పిట్‌లో హమ్మామీ ఓ క్రాష్ యాక్స్‌తో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై పలుమార్లు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడి రక్తమోడుతున్నప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఎలాగోలా కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో మరో ఇద్దరు పైలట్లు కాక్‌పిట్‌లోకి ప్రవేశించి విమానాన్ని అదుపు చేశారు. ప్రయాణికులు, సిబ్బంది కూడా జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఆ సమయంలో విమానంలో 173 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. హమ్మామీ ప్రయత్నం ఫలించి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది.
‘విమానాన్ని కూల్చేయాలనుకున్నా.. చావంటే భయం లేదు’
యూఏఈ అటార్నీ జనరల్ కూడా హమ్మామీ ఉగ్రవాద చర్యకు పాల్పడేందుకు ప్రయత్నించాడని అన్నారు. అతడికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో లేదా ఇరాన్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఇజ్రాయెల్, సౌదీ అరేబియా దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. హమ్మామీ యూఏఈలోనే పుట్టినట్లు అధికారులు తెలిపారు. అతడి తండ్రి ఒమన్‌కు చెందిన వ్యక్తి. తల్లి సిరియా దేశస్థురాలు. ఫ్లైదుబాయ్‌లో ఉద్యోగంలో చేరకముందు హమ్మామీ ఒమన్, సిరియా, మొరాకోల్లో పనిచేసినట్లు తెలిసింది.సిరియాలో చాలా కాలం కొనసాగిన అంతర్యుద్ధ సమయంలో అతడు అక్కడే ఉన్నాడు. ఆ సమయంలోనే అతడికి ఉగ్రవాద భావజాలం పట్ల ఆసక్తి ఏర్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అతడి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా.. వేల సంఖ్యలో ఉగ్రవాదానికి సంబంధించిన పోస్టులు, సందేశాలను గుర్తించారు. అతడి పోస్టుల్లో మహిళలు ఉద్యోగాలు చేయడాన్ని వ్యతిరేకించే వ్యాఖ్యలు, మహిళలు బురఖా ధరించి తీరాలన్న కచ్చితమైన అభిప్రాయం అతనికి ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే ఈ అంశాలపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
భార్య ఉద్యోగం చేయకూడదని కండిషన్
2021 డిసెంబర్‌కు చెందిన ఓ పోస్టులో సిరియా, లెబనాన్‌కు చెందిన వ్యక్తిగా నటిస్తూ ఫేక్ అకౌంట్ ద్వారా సౌదీ మహిళలను సంప్రదించాడు హమ్మామీ. మరో పోస్టులో తన భార్య ఉద్యోగం చేయడం తనకు ఇష్టం లేదనీ స్పష్టం చేసాడు. అతడి ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి సోషల్ మీడియా పోస్టులు దర్యాప్తు అధికారులకు కీలక ఆధారాలుగా మారాయి.
ఒమన్ ఎయిర్ లో నిషేధం
హమ్మామీకి చిన్నప్పటి నుంచే విమానయానంపై ఆసక్తి ఉండేది. యూఏఈలో ఏవియేషన్ చదివిన తర్వాత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఒమన్ ఎయిర్‌లో చేరాడు. అయితే అక్కడ హమ్మామీ తీవ్రవాద భావజాలానికి సంబంధించిన వెబ్‌సైట్లను చూస్తున్నట్లు అధికారులు గుర్తించి విమానాలు నడపకుండా నిషేధించారు. డెస్క్ జాబ్ లో చేరాలని సూచించారు. అయితే విమానాన్ని నడపకుండా నిషేధం ఉన్న వ్యక్తి.. కాక్‌పిట్‌లోకి ఎలా వచ్చాడు?
ఫ్లైదుబాయ్‌లోకి ఎలా వచ్చాడు?
ఒమన్ ఎయిర్‌లో నిషేధం తర్వాత హమ్మామీ ఇతర విమానయాన సంస్థల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. 2025లో మొరాకోకు చెందిన రాయల్ ఎయిర్ మారోక్‌లో ట్రై చేశాడు. 2026 ఫిబ్రవరిలో ఫ్లైదుబాయ్ అతడిని పైలట్ గా నియమించింది. పైలట్లను నియమించే ముందు యూఏఈలో విస్తృత స్థాయిలో తనిఖీలు జరుగుతాయి. అయితే హమ్మామీ కేసులో ఫ్లైదుబాయ్ వెరిఫికేషన్ సరిగ్గా చేయలేదనే విమర్శలు వచ్చాయి. ఒమన్ ను అడిగి ఉంటే అతడి వివరాలు అందించేదని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక రాసుకొచ్చింది. 2022 జూన్‌లోని ఓ పోస్టులో విమానాలు నడపడం, ఫ్లైట్ ట్రైనింగ్ తనకు ఎంత ప్రత్యేకమో వివరించాడు. సోలోగా విమానం నడపడం, ప్రయాణికులతో ఉన్న విమానాన్ని ల్యాండ్ చేసిన అనుభవాలను పంచుకున్నాడు.