పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి అమ్మకాల జోరు.. జ్యువెలరీ వ్యాపారులెందుకు హ్యాపీగా లేరు?
Wedding Season 2026: బంగారం ధరలు భారీగా తగ్గడంతో పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి ఆభరణాల కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి. గతంలో ధరల పెరుగుదలతో కొనుగోళ్లు వాయిదా వేసుకున్నవారు ఇప్పుడు నగల దుకాణాల బాట పడుతున్నారు. అయితే ధరల పతనం వినియోగదారులకు ఊరటనిస్తుంటే.. జ్యువెలరీ వ్యాపారులకు మాత్రం కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇంతకీ బంగారం ధరల తగ్గుదల వ్యాపారులపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? రానున్న రోజుల్లో పసిడి ధరలు ఎలా ఉండబోతున్నాయి?

బంగారం ధరలు భారీగా తగ్గడంతో కొనుగోలుదారులకు ఊరట లభిస్తోంది. మరీ ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ (Wedding Season 2026) ప్రారంభం కావడంతో బంగారు ఆభరణాల (Gold Jewellery) కొనుగోళ్లకు డిమాండ్ మళ్లీ పెరుగుతోంది. గత కొన్ని నెలలుగా అడ్డూ అదుపు లేకుండా పెరిగిన పసిడి ధరల కారణంగా వినియోగదారులు కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు ధరలు నేలచూపు చూస్తుండటంతో నగల దుకాణాల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే బంగారం ధరలు భారీగా పతనం కావడం జ్యువెలరీ వ్యాపారులకు మాత్రం కొత్త సమస్యలను తీసుకొస్తోంది. బంగారు కొనుగోళ్లు పెరిగినా.. వ్యాపారులు మాత్రం హ్యాపీగా లేరు.
14 నెలల కనిష్టానికి బంగారం ధరలు
గత నెల రోజుల వ్యవధిలో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. 2026 జనవరి చివరిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1.80 లక్షల ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే ప్రస్తుతం ధరలు భారీగా పడిపోయాయి. నవంబర్ 19 నాటికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1.30 లక్షలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 1.20 లక్షల దిగువునకు పడిపోయింది. దీంతో బంగారం ధరలు 14 నెలల కనిష్ట స్థాయికి పడిపోయినట్లయింది.
అమెరికా డాలర్ బలపడటం, అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం, ప్రస్తుత వడ్డీ రేట్లను ఫెడరల్ రిజర్వ్ ఎక్కువ కాలం కొనసాగవచ్చనే అంచనాలు బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. గతంలో బంగారం ధరలు భారీగా పెరగడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం కూడా ఇప్పుడు వాటి ధరల తగ్గుదలకు కారణమైంది.
పెళ్లిళ్ల సీజన్‌తో పెరిగిన కొనుగోళ్లు
బంగారం ధరలు తగ్గడంతో పెళ్లిళ్ల కోసం నగలు కొనుగోలు చేయాలనుకునే కుటుంబాలకు కొంత ఊరట లభిస్తోంది. ముఖ్యంగా డిసెంబర్‌లో జరగనున్న వివాహాల కోసం ఇప్పటి నుంచే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది జనవరిలో పెళ్లిళ్లు ఉన్నవారు కూడా ముందుగానే బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు.
గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో తమ వ్యాపారం సుమారు 25 శాతం పెరిగిందని జ్యువలరీ వ్యాపారులు చెబుతున్నారు. వినియోగదారులు ముఖ్యంగా 22 క్యారెట్ల బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తమ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని తక్కువ బరువున్న నగలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బంగారు నాణేలు, బిస్కెట్ల కంటే నెక్లెస్‌లు, ఉంగరాలు, గాజులు వంటి ఆభరణాల కొనుగోళ్లపైనే వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొందరు వచ్చే ఏడాది పెళ్లిళ్ల కోసం కూడా ఇప్పుడే నగలు కొనుగోలు చేస్తున్నారు.
జ్యువెలరీ వ్యాపారులకు అసలు సమస్య ఇదే!
బంగారం ధరలు తగ్గడం వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ నగల వ్యాపారులకు మాత్రం కొంత ఇబ్బందికరంగా మారుతోంది. జ్యువెలరీ వ్యాపారులు గతంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన బంగారాన్ని తమ వద్ద నిల్వ ఉంచుతారు. ఇప్పుడు మార్కెట్లో ధరలు తగ్గడంతో ఆ నిల్వల విలువ కూడా తగ్గిపోతోంది. దీంతో పాత ధరలకు కొనుగోలు చేసిన బంగారంతో తయారు చేసిన నగలను ప్రస్తుత తక్కువ ధరలకు విక్రయించాల్సి వస్తే లాభాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న, మధ్యస్థాయి నగల వ్యాపారులు ఈ పరిస్థితిని ఎదుర్కోవడం కష్టంగా మారవచ్చని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పెద్ద జ్యువెలరీ సంస్థలకు మెరుగైన నిల్వల నిర్వహణ వ్యవస్థలు, ధరల హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పించే హెడ్జింగ్ విధానాలు అందుబాటులో ఉంటాయి. కానీ చిన్న వ్యాపారులకు అలాంటి అవకాశాలు పరిమితంగా ఉంటాయి. అందుకే పెళ్లిళ్ల సీజన్‌లో బంగారు ఆభరణాలు కొనుగోళ్లు పెరిగినా.. జ్యువలరీ వ్యాపారులు మాత్రం బిక్క మొహం పెడుతున్నారు.
బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా?
ప్రస్తుతం బంగారం ధరలు తగ్గినప్పటికీ దీర్ఘకాలంలో మళ్లీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయని గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేస్తోంది. 2027 చివరి నాటికి ఔన్స్ బంగారం ధర 4,650 డాలర్లకు చేరవచ్చని అంచనాను వెల్లడించింది. గతంలో ఈ అంచనా 4,800 డాలర్లుగా ఉండేది. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లు కొనసాగించడం, భవిష్యత్తులో అమెరికా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పసిడి ధరలకు మద్దతు ఇవ్వవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నిర్వహించిన సర్వేలో కూడా బంగారు ఆభరణాల కొనుగోళ్లపై ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 12 మెట్రో, టైర్-1 నగరాల్లో 1,957 మంది వినియోగదారుల అభిప్రాయాలను సేకరించగా.. వచ్చే మూడు నెలల్లో బంగారు ఆభరణాల కొనుగోళ్లను పెంచాలని 29 శాతం మంది భావిస్తున్నట్లు వెల్లడైంది. అలాగే తమ తదుపరి ఆభరణాల కొనుగోలుకు పెళ్లిళ్లే ప్రధాన కారణమని 25 శాతం మంది తెలిపారు.
బంగారం ధరలు తగ్గడం పెళ్లిళ్ల సీజన్‌లో వినియోగదారులకు మంచి అవకాశంగా మారుతోంది. అయితే ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కొనసాగితే పసిడి వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. బంగారం ధరలు ఒక స్థాయిలో స్థిరంగా కొనసాగితేనే వినియోగదారులు, వ్యాపారులు ఇద్దరికీ ప్రయోజనం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.




