Brain Health: ఇవి మెదడుకు విషంతో సమానం.. వీటికి బదులుగా ఏం తినాలంటే?
మనం రోజూ తీసుకునే ఆహారం మన మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. కొన్ని ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా శక్తిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఏడు రకాల ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ ఆహారాలు ఏవి? వాటికి బదులుగా ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి?

మన శరీరంలో మెదడు అత్యంత కీలకమైన అవయవం. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఆలోచనా శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వంటి ఎన్నో పనులను మెదడు నియంత్రిస్తుంది. అయితే మనం రోజూ తీసుకునే ఆహారం మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుందన్న విషయం తెలిసిందే. కొన్ని రకాల ఆహారాలను అతిగా తీసుకోవడం వల్ల అలసట, ఏకాగ్రత లోపం, మానసిక చురుకుదనం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వీటిని తరచూ అధిక మోతాదులో తీసుకుంటే మెదడు పాలిట విషానికి సమానంగా మారుతుంది. మరి మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి? వాటికి బదులుగా మెదడు చురుక్కా పనిచేయాలంటే.. ఎలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి?
1. చక్కెర అధికంగా ఉండే ఆహారాలు
చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల నీరసం, మూడ్ ఛేంజ్, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా స్వీట్లు, చక్కెర కలిపిన పానీయాలను పరిమితంగా తీసుకోవాలి.
వీటికి బదులుగా తినాల్సినవి: కివీ, యాపిల్, చెర్రీ, నారింజ, మామిడి, పైనాపిల్ వంటి పండ్లను తీసుకోవచ్చు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ లభిస్తాయి.
2. ప్రాసెస్డ్ జంక్ ఫుడ్
ప్యాకెట్ స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఆహారాల్లో ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు, అదనపు చక్కెర ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యంతో పాటు మెదడు ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
వీటికి బదులుగా: ఇంట్లో తయారుచేసిన తాజా ఆహారం, కూరగాయలు, పప్పులు, చిరుధాన్యాలు వంటి పోషకాహారాన్ని తీసుకోవడం మంచిది.
3. కెఫీన్ అధికంగా ఉండే పానీయాలు
కాఫీ తాగడం వల్ల కొంతసేపు చురుకుదనం, ఏకాగ్రత పెరుగుతుంది. అయితే కెఫీన్‌ను అతిగా తీసుకుంటే నిద్రలేమి, ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు వస్తాయి. ఇవి పరోక్షంగా మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి.
వీటికి బదులుగా: హెర్బల్ టీ, డీకాఫినేటెడ్ కాఫీ, పండ్లు, ఆకుకూరలతో తయారుచేసిన స్మూతీలు తీసుకోవచ్చు. తగినంత నీరు తాగడం కూడా ముఖ్యం.
4. డీప్ ఫ్రై చేసిన ఆహారాలు
నూనెలో ఎక్కువసేపు వేయించిన ఆహారాలు, శ్యాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే పదార్థాలను తరచూ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిని అధికంగా తీసుకోవడం గుండె ఆరోగ్యంతో పాటు మెదడు ఆరోగ్యాన్నీ ప్రభావితం చేస్తుంది.
వీటికి బదులుగా: డీప్ ఫ్రై చేసిన ఆహారాలకు బదులుగా ఉడికించినవి, కాల్చిన లేదా గ్రిల్ చేసిన ఆహారాలను తీసుకోవడం మంచిది.
5. ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు
ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది. సోడియంను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇది మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
వీటికి బదులుగా: వంటల్లో ఉప్పు పరిమాణాన్ని తగ్గించి, కొత్తిమీర, పుదీనా, అల్లం, వెల్లుల్లి, సహజ సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తే మంచిది.
6. ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు
చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే కృత్రిమ తీపి పదార్థాలైన అస్పార్టేమ్, సుక్రలోజ్ వంటివి కొన్ని పానీయాలు, ఆహార పదార్థాల్లో ఉంటాయి. వీటి ఆరోగ్య ప్రభావాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మెదడు పనితీరు తప్పనిసరిగా దెబ్బతింటుందని చెప్పడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు. అయినప్పటికీ తీపి పదార్థాలపై అధికంగా ఆధారపడకుండా ఉండటం మంచిది.
వీటికి బదులుగా: అవసరమైతే పరిమిత పరిమాణంలో తేనె, ఖర్జూరం వంటి సహజ తీపి పదార్థాలను ఉపయోగించవచ్చు. అయితే వీటిలోనూ చక్కెర ఉంటుంది కాబట్టి మితంగా తీసుకోవాలి.
7. ఆల్కహాల్
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మెదడు పనితీరు తాత్కాలికంగా మంచగిస్తుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉంది. దీర్ఘకాలం అధికంగా మద్యం సేవించడం వల్ల మెదడుపై మరింత తీవ్రమైన ప్రభావాలు చూపుతాయి.
వీటికి బదులుగా: పండ్ల ముక్కలు కలిపిన నీరు, స్పార్క్లింగ్ వాటర్, చక్కెర కలపని పండ్ల పానీయాలను ఎంచుకోవచ్చు.
(ముఖ్య గమనిక: మెదడు ఆరోగ్యానికి ఒక్క ఆహారం మాత్రమే కారణం కాదు. సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, క్రమం తప్పని వ్యాయామం, తగినంత నీరు తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. ప్రాథమిక అవగాహన కోసమే ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించండి)




