ఉగాది రోజున స్పెషల్ స్నాక్.. రోహిత్ శర్మ ఫేవరెట్ కోతిమ్బిర్ వడి రెసిపీ..!
ఉగాది అంటే తెలుగు ప్రజలకు కొత్త సంవత్సరపు ఆరంభం. ఈ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ఉగాది రోజున నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆరోగ్యకరమైన వంటకాలు, పచ్చళ్లు, స్నాక్స్ తయారు చేస్తారు. ఈ రోజు బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించడం ప్రారంభించిన రోజు అని నమ్ముతారు. తెలుగువారు, కర్ణాటక ప్రజలు ఉగాది పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు.

ఉగాది పండుగలో సంప్రదాయ పచ్చడి, తీపి వంటకాలు, రుచికరమైన స్నాక్స్ చేయడం ఒక పెద్ద సంప్రదాయమే. ఈ రోజున మనం తయారు చేసే వంటకాలు ఆరోగ్యానికి మేలు చేయాలి. ఈ ఉగాది పండుగ రోజున మీరు కోతిమ్బిర్ వడి స్నాక్ కూడా మీ అతిథులకు వడ్డించవచ్చు. ఇది చాలా రుచికరమైనది, తయారీలో సులభమైనది. పైగా రోహిత్ శర్మ ఫేవరెట్ స్నాక్ కూడా.. ఇప్పుడు మనం కోతిమ్బిర్ వడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు – 2 కప్పులు
- శనగపిండి – 1 కప్పు
- అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
- పచ్చిమిరపకాయ – 1 (సన్నగా తరిగినది)
- పసుపు – 1/2 టీస్పూన్
- కారం – 1/2 టీస్పూన్
- జీలకర్ర పొడి – 1/2 టీస్పూన్
- ధనియాల పొడి – 1/2 టీస్పూన్
- నువ్వులు – 1 టీస్పూన్
- నిమ్మరసం – 1 టీస్పూన్
- ఉప్పు – రుచికి సరిపడా
- నీరు – 1/2 కప్పు
- ఆయిల్ – తగినంత
తయారీ విధానం
ఒక గిన్నె తీసుకోని దాంట్లో తాజా కొత్తిమీర ఆకులను, శనగపిండి వేసి బాగా కలపాలి. తరువాత అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరప తరుగులు, పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, నువ్వులు, ఉప్పు, నిమ్మరసం కూడా జోడించి అన్ని పదార్థాలు సమంగా కలిసేలా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మెత్తని పిండిలా మారేలా చేయడానికి కొద్దిగా నీరు వేసి మెత్తగా కలపాలి.
తయారైన పిండిని చేతులతో చిన్న ఆకారంలో చేసి 15 నిమిషాల పాటు స్టీమ్ కుక్కర్ లో ఆవిరిపై ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి, ఆపై వాటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్‌లో ఆయిల్ వేడి చేసి ఈ కట్ చేసిన ముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకు క్రిస్పీగా వేయించాలి. అవి సరిగా వేగిన తర్వాత వాటిని కొత్తిమీర ఆకులతో అలంకరించి, వేడి వేడి చట్నీతో వడ్డించాలి. ఇంతే సింపుల్.. రోహిత్ శర్మ ఫేవరెట్ స్నాక్ కోతిమ్బిర్ వడి రెడీ అయ్యింది.
ఉగాది పండుగలో ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు వండడం ఒక పెద్ద ఆనందం. కోతిమ్బిర్ వడి వంటి స్నాక్స్ పండుగ ఆహారంలో ఒక మంచి స్నాక్‌గా నిలుస్తుంది. కొత్తిమీర ఆకులు, శనగ పిండితో తయారు చేసిన ఈ వడలు ఆరోగ్యానికి మంచి పోషక విలువలు అందిస్తాయి.




