Retirement Goals: రిటైర్మెంట్ తర్వాత ఒంటరితనం వేధిస్తోందా?.. మనశ్శాంతిని, సంతోషాన్ని ఇచ్చే ఆ మ్యాజిక్ సూత్రాలివే
జీవితాంతం ఆఫీసు పనులు, పిల్లల చదువులు, పెళ్లిళ్లు అంటూ నిరంతరం పరుగెత్తిన వారికి పదవీ విరమణ (Retirement) అనేది ఒక గొప్ప ఊరట. అయితే, చాలామంది దీనిని జీవితానికి ముగింపుగా భావిస్తూ నిరాశకు గురవుతుంటారు. ముఖ్యంగా పురుషులు వార్తాపత్రికలు, కబుర్లతో కాలక్షేపం చేస్తే.. మహిళలకు ఇంటి బాధ్యతలు మరింత పెరుగుతాయి. కానీ, నిజమైన పదవీ విరమణ అంటే విశ్రాంతి మాత్రమే కాదు..

పదవీ విరమణ అనేది మనకోసం మనం సమయం కేటాయించుకోవడానికి ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన అవకాశం. ఇన్నాళ్లూ మనం కోల్పోయిన మనల్ని మనం తిరిగి ఆవిష్కరించుకోవడం. వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ, శేష జీవితాన్ని ఆరోగ్యం, ఉత్సాహం ఆనందంతో ఎలా గడపాలో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
సమయం మీ కోసం – బంధాల కోసం!
బిజీగా ఉన్న రోజుల్లో భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకునే సమయం దొరకకపోవచ్చు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసుకోండి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. అలాగే, నెలకోసారి బంధువుల ఇళ్లకు వెళ్లడం, పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం వల్ల మనసు ఉల్లాసంగా ఉంటుంది.
పాత స్నేహాలకు ప్రాణం పోయండి
స్కూల్, కాలేజీ రోజుల స్నేహితులతో టచ్‌లో ఉండండి. వీలైతే వారితో కలిసి ఒక రోజంతా బయటకు వెళ్లడానికి ప్లాన్ చేయండి. ఇష్టమైన వారితో నవ్వుతూ గడపడం వల్ల ఒత్తిడి తగ్గి ఆయుష్షు పెరుగుతుంది. ఫోన్ ద్వారా కూడా స్నేహితులతో తరచుగా మాట్లాడుతూ మీ మనసులోని భావాలను పంచుకోండి.
మీకంటూ ఒక ప్రపంచం
వృద్ధాప్యం అనేది ఆనందానికి అడ్డంకి కాదు. మీకు ఇష్టమైన పుస్తకాలు చదవడం, చిన్నపాటి నడక, షాపింగ్ చేయడం వంటి పనులు చేయండి. మనవళ్లను చూసుకోవడం ఆనందమే అయినా, అది మీపై భారం కాకుండా చూసుకోండి. కుటుంబానికి అసౌకర్యం కలగకుండా మీకంటూ కొంత సమయం కేటాయించుకోవడం ఎంతో అవసరం.
ఆరోగ్యమే మహాభాగ్యం
“నేను వృద్ధుడిని అయిపోయాను” అనే ప్రతికూల ఆలోచనలను దరిచేరనీయకండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వైద్యులు సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడటం ముఖ్యం. నడక, యోగా వంటి చిన్నపాటి వ్యాయామాలు మిమ్మల్ని చురుగ్గా ఉంచుతాయి.
