SSC CGL Jobs: ఎస్సెస్సీ సీజీఎల్‌లో 15,130 ఉద్యోగాలు.. ఆప్షన్-కమ్-ప్రిఫరెన్స్‌కు అప్లికేషన్ విండో ఓపెన్
ఎస్సెస్సీ సీజీఎల్ 2025 పోస్టుల తుది ఖాళీల వివరాలు తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. మొత్తం 15,130 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. దీనితో పాటు ఆప్షన్-కమ్-ప్రిఫరెన్స్ సమర్పణ తేదీలను, విధానంను కూడా ఎస్ఎస్‌సీ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కింద Income Tax ఇన్స్పెక్టర్, సీబీఐలో అసిస్టెంట్..

హైదరాబాద్, మార్చి 10: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో ఎస్సెస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) 2025 పోస్టుల తుది ఖాళీల వివరాలు తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసింది. మొత్తం 15,130 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. దీనితో పాటు ఆప్షన్-కమ్-ప్రిఫరెన్స్ సమర్పణ తేదీలను, విధానంను కూడా ఎస్ఎస్‌సీ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ కింద Income Tax ఇన్స్పెక్టర్, సీబీఐలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సబ్-ఇన్స్పెక్టర్, ఆడిటర్, అకౌంటెంట్, టాక్స్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ తదితర పోస్టులు భర్తీకానున్నాయి. మొత్తం పోస్టుల్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆధ్వర్యంలోని ఆఫీస్ సూపరింటెండెంట్ పోస్టులు 6,626 వరకు అధికంగా ఉన్నాయి. ఆ తరువాత అధిక సంఖ్యలో సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 1,306 ఉన్నాయి.
ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించి టైర్ 1, టైర్ 2 పరీక్షలను ఎస్సెస్సీ నిర్వహించిన సంగతి తెలిసిందే. జనవరి 18, 19 తేదీల్లో జరిగిన టైర్ 2 పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా తమ పోస్ట్ ప్రాధాన్యతలను సమర్పించాల్సి ఉంటుంది. ఆప్షన్-కమ్-ప్రిఫరెన్స్ సమర్పణ విండో మార్చి 12 సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అభ్యర్థి తన మెరిట్, ఆసక్తిని బట్టి ఏ పోస్టుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ శాఖలో చేరాలనుకుంటున్నారు వంటి వివరాలను ‘ఆప్షన్ ఫామ్’లో తమ ప్రిఫరెన్స్‌ను తెలియజేయాల్సి ఉంటుంది.
నిజానికి ఈ ప్రక్రియ గతంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో జరిగేది. కానీ ఇప్పుడు అభ్యర్థులు తమ స్టూడెంట్ లాగిన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే పోస్ట్ ప్రిఫరెన్స్‌లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో ఈ వివరాలను సేకరిస్తున్నారు. ఇందులో అభ్యర్థులకు మంచి మార్కులు వచ్చినా ప్రిఫరెన్స్‌లో తమకు నచ్చిన పోస్టును పైన ఇవ్వకపోతే ఆ అవకాశం కోల్పోయే ఛాన్స్ ఉంది. కోరుకున్న పోస్టుకు తగిన కట్-ఆఫ్ మార్కులు ఉంటే నచ్చిన జాబ్ తప్పక అందుతుంది. ప్రిఫరెన్స్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని మార్చుకోవడానికి వీలుండదు. కాబట్టి ప్రిఫరెన్స్ ఇచ్చే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒకవేళ ఈ ఫామ్‌ను సమర్పించకపోతే సదరు అభ్యర్ధి మెరిట్ జాబితాలో ఉన్నప్పటికీ ఏ పోస్టునూ కేటాయించరు. అందువల్ల నోటిఫికేషన్‌లో ఇచ్చిన పోస్ట్ కోడ్‌లను జాగ్రత్తగా ఓ పేపర్‌పై ముందుగా రాసుకుని ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఎంటర్ చేస్తే పోస్ట్ స్వభావం, పోస్టింగ్ ఏరియా, జీతం, అర్హతల్లో గందరగోళం లేకుండా ఉంటుంది. అభ్యర్ధులు ఈ విషయాలను గమనించి ముగింపు గడువులోగా పోస్ట్ ప్రిఫరెన్స్ ఫామ్‌ను సమర్పించాలని కమిషన్ సూచించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




