AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నదాతలకు ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. మరో 46 వేల వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు!

అన్నదాతల శ్రేయస్సే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. రైతులకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 22,30,703 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రకటించారు.

అన్నదాతలకు ఏపీ సర్కార్ మరో గుడ్‌న్యూస్.. మరో 46 వేల వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు!
Free Agricultural Electricity Connections
Balaraju Goud
|

Updated on: Feb 19, 2026 | 7:53 PM

Share

అన్నదాతల శ్రేయస్సే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. రైతులకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 22,30,703 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా మంత్రి ప్రకటించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అడిగిన ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ తో పాటు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై వివరాలు వెల్లడించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు డిస్కంల పరిధిలో 1,02,538 కొత్త ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. అయితే మరో 46 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపిన మంత్రి గొట్టిపాటి.. వచ్చే వ్యవసాయ సీజన్ నాటికి పెండింగ్‌లో ఉన్న కనెక్షన్లను కూడా మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో మూడు డిస్కంల పరిధిలో రూ.839.44 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. పీఎం కుసుమ్ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటివరకు 2,61,481 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఫీడర్ లెవల్ సోలార్ ప్రాజెక్టుల అమలుతో విద్యుత్ కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1059 కోట్లు ఆదా అవుతుందని పేర్కొన్నారు.

11 కేవీ లైన్ల దగ్గర సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, దీని ద్వారా వినియోగదారులకు 25 సంవత్సరాల పాటు ఒకే విధమైన టారిఫ్‌తో విద్యుత్ అందించవచ్చని మంత్రి తెలిపారు. ఫీడర్ లెవల్ సోలార్ ప్రాజెక్టుల కోసం భూ సేకరణ జరుగుతోందని, 1035 మెగావాట్ల సామర్థ్యానికి టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు. రాబోయే మే నెల నుంచి సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి స్పష్టం చేశారు. 2028–30 నాటికి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ఫీడర్ లెవల్ సోలార్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులకు ఉదయం వేళల్లోనే 9 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించగలమని మంత్రి చెప్పారు. గృహ, పారిశ్రామిక, వ్యాపార వర్గాలతో పాటు రైతులకు కూడా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించడమే రాష్ట్ర విద్యుత్ శాఖ లక్ష్యమని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us