AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికూతురికి బంగారు నాణెం.. పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం.. సర్కార్ సరికొత్త కానుక..!

తమిళనాడులో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళనాడు వెట్రి కజగం (TVK) ప్రభుత్వం తన తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ సంక్షేమం, విద్య, మహిళా సాధికారత, సామాజిక భద్రత, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని 2036 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.

పెళ్లికూతురికి బంగారు నాణెం.. పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం.. సర్కార్ సరికొత్త కానుక..!
Tamil Nadu Budget
Balaraju Goud
|

Updated on: Aug 05, 2026 | 1:04 PM

Share

తమిళనాడులో ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళనాడు వెట్రి కజగం (TVK) ప్రభుత్వం తన తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ సంక్షేమం, విద్య, మహిళా సాధికారత, సామాజిక భద్రత, ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రాన్ని 2036 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు.

ఈ బడ్జెట్‌లో మహిళల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. వివాహం చేసుకునే ప్రతి మహిళకు ప్రభుత్వం తరఫున 8 గ్రాముల బంగారు నాణెంతో పాటు పట్టు చీర బహుమతిగా అందించే కొత్త పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం అమలుకు రూ.812 కోట్లు కేటాయించారు. మహిళల ఆర్థిక భద్రతకు, కుటుంబాలకు ఊరటనిచ్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

అదే విధంగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి శిశువుకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించే ‘థాయ్ మమ్మన్ తంగ మోధిర తిట్టం’ పథకాన్ని కూడా ప్రకటించింది. ఈ పథకం అమలుకు రూ.560 కోట్లు కేటాయించారు. శిశు సంక్షేమం, మాతృత్వాన్ని ప్రోత్సహించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని ఆర్థిక మంత్రి వెల్లడించారు.

విద్యారంగంలోనూ ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. కళాశాల విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించే ‘వెట్రి మడికనిని తిట్టం’ కోసం రూ.2,000 కోట్లు కేటాయించారు. అలాగే పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు, హెల్మెట్లు, బాటిల్ హోల్డర్లు అందించే ‘జెన్-జెడ్’ పథకానికి రూ.777 కోట్లు కేటాయించారు.

మరో ముఖ్య నిర్ణయంగా కామరాజ్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ పరిధిని విస్తరించారు. ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ అల్పాహార పథకాన్ని వర్తింపజేయనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి అమల్లోకి రానున్న ఈ నిర్ణయంతో అదనంగా 15.14 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. ఈ పథకానికి రూ.710 కోట్లు కేటాయించారు. వృద్ధుల సంక్షేమం కోసం తొలి దశలో 12 జిల్లాల్లో 12 ఆధునిక వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి కేంద్రంలో 40 మంది వృద్ధులకు వసతి, వైద్య సేవలు అందించనున్నారు. ఇందుకోసం రూ.6.66 కోట్లు కేటాయించారు.

బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఎన్. మేరీ విల్సన్ మాట్లాడుతూ, గతంలో టెండర్లలో కొనసాగిన కమిషన్ విధానానికి ముగింపు పలికారని, ప్రభుత్వ నిధుల వినియోగంలో పారదర్శకత తీసుకొచ్చామని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

మొత్తంగా చూస్తే, టీవీకే ప్రభుత్వ తొలి బడ్జెట్ మహిళలు, విద్యార్థులు, పిల్లలు, వృద్ధులు, అల్పసంఖ్యాకుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే, దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను కూడా ప్రతిబింబించింది. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ఇది తొలి అడుగుగా ప్రభుత్వం అభివర్ణిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us