కరెన్సీ నోట్లపై పెన్సిల్ గుర్తులు ఉంటే చెల్లవా..? ఆర్బీఐ కొత్త రూల్స్..

Venkatrao Lella

Images: Pinterest

03 OCT 2026

కరెన్సీ నోట్లపై పెన్సిల్ గుర్తులు ఉంటే వాటిని దుకాణాదారులు తీసుకోవడం లేదు. అలాంటి నోట్లను తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు. అవి చెల్లుతాయని చెప్పినా దుకాణాదారులకు తెలిసినా.. వాటిని స్వీకరించడం లేదు.

ఈ క్రమంలో ఇలాంటి నోట్లకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. తాత్కాలిక పెన్సిల్ గుర్తులు ఉన్న కరెన్సీ నోట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.

నోట్లపై తాత్కాలిక పెన్సిల్ గుర్తులు ఉన్నంత మాత్రాన పనికిరానివిగా పరిగణించడానికి వీల్లేదని తెలిపింది. ఈ మేరకు అక్టోబర్ 2న ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

నోట్లపై పెన్సిల్ గుర్తులు ఉన్నంత మాత్రాన దుకాణదారులు, బ్యాంకులు తిరస్కరించకూడదని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. చలామణిలో ఉన్న నోట్ల రీసైక్లింగ్‌ను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఆర్బీఐ ఈ ఆదేశాలిచ్చింది.

2022లో ప్రచురించిన పాత ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఆటోమేటెడ్ క్యాష్-సార్టింగ్ పరికరాలు, బ్యాంకు సిబ్బంది అన్ని గుర్తులను కఠినమైన మరక లేదా గ్రాఫిటీ నిబంధనల కింద పరిగణించేవారు. ఈ కారణంతో  పెన్సిల్ గుర్తులు ఉన్న కరెన్సీ నోట్లను స్వీకరించేవారు కాదు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆర్బీఐ ఈ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. రిఫ్లెక్టెన్స్, ఆప్టికల్ డెన్సిటీ ప్రమాణాల ప్రకారం పెన్సిల్ గీతల వంటి తాత్కాలిక గుర్తులు కలిగిన నోట్లను అనర్హమైనవిగా వర్గీకరించకూడదని ఆదేశించింది.

శాశ్వతం కాని పెన్సిల్ గుర్తులను పట్టించుకోకుండా.. స్పష్టంగా చదవగలిగే, అసలైన నోట్లు చలామణిలో ఉండేలా బ్యాంకులు చూసుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఇక 50 మైక్రాన్లు లేదా అంతకంటే ఎక్కువ మందం ఉన్న ఏ టేప్ లేదా జిగురు పొరనైనా అనుమానాస్పదంగా గుర్తించి తిరస్కరిస్తారు.

అదనపు మందంతో టేప్ అంటించిన నోట్లు ఏటీఎంలను జామ్ చేస్తాయి. నగదు పంపిణీ రోలర్లను దెబ్బతీయకుండా నివారించేందుకు ఆర్బీఐ ఇలాంటి నోట్ల విషయంలో కఠిన నిబంధణలు జారీ చేసింది.

బ్యాంకులు ఇండియన్ స్టాండర్డ్ IS 18663: 2024 ప్రకారం BIS-ధృవీకరించిన నోట్ సార్టింగ్ మెషీన్‌లను మాత్రమే కొనుగోలు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది.  ధృవీకరణ లేని అన్ని మెషీన్ మోడల్‌లను జూన్ 30, 2027 నాటికి దశలవారీగా తొలగించాలని ఆదేశించింది.