రెండు సీట్ల కోసం ముగ్గురు దిగ్గజాల పోరు..! తమిళనాడు బైపోల్‌లో గెలుపెవరిది?
తమిళనాడు ఉపఎన్నికలు మధురాంతకం, ధారాపురంలో హైవోల్టేజ్ పోరుకు దారితీశాయి. రెండు సీట్ల కోసం సీఎం విజయ్ (TVK), స్టాలిన్ (DMK), పళనిస్వామి (AIADMK) హోరాహోరీగా తలపడుతున్నారు. TVK ప్రభుత్వానికి ఇదో రెఫరెండం కాగా, AIADMKకు సొంత సీట్ల తిరిగి దక్కించుకునే పోరాటం, DMKకు ప్రధాన ప్రతిపక్షంగా నిరూపించుకునే అవకాశం. ఈ ఎన్నికలు ముగ్గురు నేతల బలాన్ని పరీక్షించనున్నాయి.

రెండు సీట్లు.. ముగ్గురు అగ్రనేతలు. బైపోల్ అయినా సాధారణ ఎన్నికల స్థాయిలో పోటీపడుతోంది తమిళనాడు రాజకీయం మధురాంతకం, ధారాపురంలో మంగళవారం జరగనున్న ఉపఎన్నికల కోసం ముగ్గురూ ప్రచారాన్ని హోరెత్తించారు. నాలుగు నెలల క్రితమే అధికారంలోకి వచ్చిన విజయ్‌కు ఇది తొలి ఎన్నికల పరీక్ష. విజయ్ జోరుకు బ్రేక్ వేసి ప్రధాన ప్రత్యర్థిగా నిలవాలని స్టాలిన్ ప్రయత్నిస్తుంటే.. తమ పార్టీ గెలిచిన రెండు సీట్లను తిరిగి దక్కించుకోవాలని పళనిస్వామి పట్టుదలగా ఉన్నారు. మరి రెండు సీట్లే అయినా.. తమిళనాడు రాజకీయాల్లో ముగ్గురు అగ్రనేతల బలాన్ని పరీక్షిస్తున్న ఉపఎన్నికల్లో ఎవరిది విజయం?
మధురాంతకం.. ధారాపురం.. తమిళనాడు రాజకీయాల ఫోకస్ ఇప్పుడు ఈ రెండు నియోజకవర్గాలపైనే ఉంది. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండింటినీ అన్నాడీఎంకే గెలుచుకుంది. మధురాంతకం నుంచి మరగతం కుమారవేల్, ధారాపురం నుంచి పి.సత్యభామ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కానీ తర్వాత ఇద్దరూ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి విజయ్ నేతృత్వంలోని TVKలో చేరారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ట్విస్ట్ ఏంటంటే.. ఇప్పుడు TVK మళ్లీ వారిద్దరినే అభ్యర్థులుగా బరిలోకి దించింది. దీంతో విజయ్‌కు ఇది కేవలం రెండు సీట్ల ఎన్నిక కాదు.. అన్నాడీఎంకే నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ప్రజలు TVK అభ్యర్థులుగా మరోసారి ఆమోదిస్తారా లేదా అన్నది తేల్చే ఎన్నిక. ఓరకంగా ఇది టీవీకే సర్కార్‌కు రెఫరెండం లాంటిదంటున్నారు విశ్లేషకులు. అందుకే సాధారణంగా రెండు ఉపఎన్నికల కోసం ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత సమయం కేటాయించడం అరుదైనా.. విజయ్ నాలుగు రోజుల పాటు ప్రచారం చేశారు. మధురాంతకంలో ట్రాక్టర్ నడిపారు.. ధారాపురంలో ఎడ్లబండిపై ప్రచారం చేశారు.. చివరిరోజు ధారాపురంలో దాదాపు 30 కిలోమీటర్ల రోడ్‌షో నిర్వహించారు.
ఇక మాజీ సీఎం స్టాలిన్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత TVKకు ప్రధాన ప్రత్యామ్నాయం తామేనని చాటేందుకు ఈ రెండు సీట్లను అవకాశంగా చూస్తోంది DMK. ధారాపురంలో ప్రచారం చేసిన స్టాలిన్.. SIR నుంచి ప్రభుత్వ హామీల వరకు విజయ్‌ను టార్గెట్ చేశారు. పోలింగ్‌కు వెళ్లేముందు కరెంట్ బిల్లు, రేషన్ బిల్లు చూసుకుని ఓటేయాలంటూ చివరి అప్పీల్ చేశారు. మరోవైపు AIADMK అధినేత, మాజీ సీఎం పళనిస్వామికి మాత్రం ఇది తమ సిట్టింగ్ సీట్లను తిరిగి దక్కించుకునే పోరు. తమ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలను విజయ్ తీసుకెళ్లారంటూ ప్రచారంలో నేరుగా విమర్శించారు. ధారాపురంలో సత్యభామపై AIADMK కె.భానుమతిని బరిలో దించింది. దీంతో రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ మారిన ఎమ్మెల్యేలను గెలిపించాలని విజయ్.. తమ కంచు కోటలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని పళనిస్వామి.. TVK ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటును కూడగట్టాలని స్టాలిన్ ప్రచారం చేశారు.
మరోవైపు TVK ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిస్తున్న వామపక్షాలు కూడా ఉపఎన్నికల్లో విడిగా బరిలోకి దిగడం మరో ట్విస్ట్. మధురాంతకంలో సీపీఎం, ధారాపురంలో సీపీఐ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నామ్ తమిళర్ కట్చి కూడా బరిలో ఉండటంతో పోటీ బహుముఖంగా మారింది. మధురాంతకంలో 27 మంది, ధారాపురంలో 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మధురాంతకంలో 2 లక్షల 12 వేల 639 మంది ఓటర్ల కోసం 268 పోలింగ్ కేంద్రాలు.. ధారాపురంలో 2 లక్షల 22 వేల 406 మంది ఓటర్ల కోసం 282 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
రెండు నియోజకవర్గాలు.. కానీ మూడు అగ్రనేతలకు మూడు వేర్వేరు రాజకీయ పరీక్షలు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ప్రజల నుంచి మరోసారి మద్దతు కోరుతున్న విజయ్‌కు తన హవా తగ్గలేదని నిరూపించుకోవాల్సిన ఎన్నిక. మరోవైపు అధికారం కోల్పోయినా సత్తా తగ్గలేదని డీఎంకే. తమ టికెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఓటర్లు మాత్రం తమవైపే ఉన్నారని నిరూపించుకోవాలని పళనిస్వామి గట్టిగా శ్రమిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
