ఎన్నికలు
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలంటే ఓ పండుగ. ప్రజా ప్రతినిధిని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రజల తరఫున చట్ట సభల్లో ప్రాతినిధ్యంవహించేందుకు నాయకులు పోటీపడుతారు. వీరిలో ఒకరిని తమ తరఫు నాయకుడిగా ఓటు వేసి ప్రజలు ఎన్నుకుంటారు. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అతని ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. భారత్‌లో ఎన్నికలను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రాజ్యాంగ సంస్థ భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. 1950 జనవరి 25న ఏర్పాటైన భారత ఎన్నికల కమిషన్ స్వతంత్ర వ్యవస్థ. సుప్రీంకోర్టులానే ప్రభుత్వ నియంత్రణ లేకుండా భారత ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్‌లో భాగంగా పనిచేస్తుంది.
ప్రజా ప్రతినిధులను(లోక్‌సభ సభ్యులు) ఎన్నుకుని తద్వారా కేంద్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాల ఏర్పాటుకు ప్రతి ఐదు సంవత్సరాలకు నిర్వహించే ఎన్నికలను సాధారణ ఎన్నికలు(జనరల్ ఎలక్షన్) అంటారు. దేశంలోని మొత్తం 543 లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆయా రాష్ట్రాల శాసనసభలకు కూడా ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏ కారణం చేతైనా ఐదు సంవత్సరాలు కొనసాగని పక్షంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్‌సభతో పాటు అసెంబ్లీ పదవీకాలం పూర్తయిన రాష్ట్రాలకు రెండు ఎన్నికలను కలిపి జమిలి ఎన్నికలు నిర్వహిస్తారు.
సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు(ఈవీఎం) ద్వారా నిర్వహిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని పరూర్ శాసనసభ నియోజకవర్గంలో 1982లో జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారిగా ఈవీఎంలు వాడారు. ఈవీఎంలను భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే రెండు ప్రభుత్వ రంగ సంస్థలు తయారు చేశాయి. విద్యుత్ సరఫరా లేని చోట్ల కూడా ఆల్కలైన్ బ్యాటరీ సాయంతో ఈవీఎంలు పనిచేస్తాయి. ఒక్కో ఈవీఎంలో 3,840 ఓట్లను నిక్షిప్తం చేసేందుకు వీలుంటుంది. పోలీలో 64 మంది అభ్యర్థుల కంటే తక్కువగా ఉంటేనే ఈవీఎంలు వినియోగిస్తారు. అభ్యర్థుల సంఖ్య దాని కంటే ఎక్కువగా ఉంటే మాత్రం బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారు.
ఎన్నికలలో ధన, కుల, కండ బలము ప్రాధాన్యత పెరుగుతోంది. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేందుకు పలువురు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే దీన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ పలు చర్యలు తీసుకుంటోంది. భద్రతా సిబ్బంది విస్తృత తనిఖీలు చేపడుతూ దీన్ని కట్టడి చేస్తున్నారు. అయినా ఎన్నికల్లో డబ్బు ప్రభావం మరీ ఎక్కువగా ఉండటం పట్ల ప్రజాస్వామ్యవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.