Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana BJP: తెలంగాణలో సత్తా చాటుతున్న బీజేపీ.. 2 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం.. కమళదళంలో ఫుల్ జోష్..

తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక విజయాల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాత్ర అత్యంత కీలకమనే చెప్పాలి. సాధారణంగా గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ అగ్రనేతలు అంత సీరియస్‌గా తీసుకోరు. కానీ ఇందుకు భిన్నంగా కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు.

Telangana BJP: తెలంగాణలో సత్తా చాటుతున్న బీజేపీ.. 2 ఎమ్మెల్సీ స్థానాలు కైవసం.. కమళదళంలో ఫుల్ జోష్..
Telangana Bjp
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 06, 2025 | 12:41 PM

తెలంగాణలో బీజేపీ అనుకున్నది సాధిస్తోంది. రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కమలదళం.. జరుగుతున్న అన్ని ఎన్నికల్లోనూ సత్తా చాటుతోంది. లేటెస్ట్‌గా మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో రెండింటిని గెలుచుకుని దూకుడుగా ముందుకు సాగుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్క కొమరయ్య తొలి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించారు.. అలాగే.. ఉత్కంఠభరితంగా సాగిన కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి అంజి రెడ్డి సూపర్ విక్టరీ సాధించారు. ఒకరకంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ని మించి రిజల్ట్స్ రాబట్టింది కమలం పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బీజేపీ పట్టు మరింతగా పెరిగింది. ఈ ఎన్నికలు జరిగిన 6 లోక్‌సభ స్థానాలు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 13 జిల్లాలు, 217 మండలాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపించింది.

బీజేపీ విజయాల్లో కీలకంగా కిషన్ రెడ్డి

బీజేపీ కీలక విజయాల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాత్ర అత్యంత కీలకమనే చెప్పాలి. సాధారణంగా గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ అగ్రనేతలు అంత సీరియస్‌గా తీసుకోరు. కానీ ఇందుకు భిన్నంగా కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోయారు. ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న పట్టభద్రులు, టీచర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. జిల్లాలు, చిన్న స్థాయి పట్టణాల్లో కూడా విస్తృతంగా పర్యటించి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రత్యక్షంగా కలిశారు. సాధ్యమైనన్నీ ఎక్కువసార్లు ఓటర్లను కలవాలని పార్టీ కేడర్‌కు సూచించారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగారు. ఆ రకంగా బీజేపీకి కీలక విజయాలు దక్కేలా చేశారు.

పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు

అసెంబ్లీ ఎన్నికల తరువాత తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించకపోయినా.. ఆ తరువాత ఆరు నెలల గ్యాప్‌లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దుమ్మురేపింది. అధికార పార్టీతో సమానంగా 8 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ ఈ స్థాయిలో సీట్లు సాధించడం సాధారణ విషయం కాదు. ఈ విజయంలోనూ కిషన్ రెడ్డి పాత్ర కీలకమనే చెప్పాలి. ఓ వైపు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌లో ప్రచారం చేపడుతూనే… ఇతర నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేపట్టారు. అధికార పార్టీకి ధీటుగా ఫలితాలు సాధించడంలో సక్సెస్ అయ్యారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం మరింత బాధ్యత పెంచిందన్న కిషన్‌రెడ్డి.. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామన్నారు.

స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని ప్రణాళికలు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తరువాత బీజేపీలో జోష్ మరింతగా పెరిగింది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించాలని భావిస్తున్న కమలదళం.. ఆ దిశగా ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. క్షేత్రస్థాయిలో బలపడటం ద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకోవాలని భావిస్తోంది.

అభినందించిన ప్రధాని మోదీ..

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. మల్క కొమరయ్య, అంజిరెడ్డిని ప్రధాని మోదీ అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజతకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలతో మమేకమై పనిచేస్తున్న తమ పార్టీ కార్యకర్తలను చూసి గర్విస్తున్నానంటూ పేర్కొన్నారు. అలాగే.. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు కూడా మోదీ అభినందనలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..