బీజేపీ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారత దేశంలో ఒక జాతీయ రాజకీయ పార్టీ. ప్రస్తుతం బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉంది. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పార్టీ అధికారంలో ఉంది. హిందూ జాతీయవాద సిద్ధాంతంతో ఆ పార్టీ దేశ వ్యాప్తంగా విస్తరించింది.
1980లో బీజేపీ ఏర్పడింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత రామమందిరం విషయంలో జరిగిన ఉద్యమంతో ఆ పార్టీ చాలా ఊపందుకుంది. 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే పూర్తి మెజార్టీ లేకపోవడంతో 13 రోజులకే ప్రధాని పదవికి అటల్ బిహారీ వాజ్‌పేయి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల తర్వాత 13 మాసాల పాటు మాత్రమే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. ఆ తర్వాత 1999లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి 2004 వరకు పూర్తి ఐదేళ్లు పదవీకాలం కేంద్రంలో బీజేపీ అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత పదేళ్లపాటు కేంద్రంలో బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగింది.
2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీకి మెజారిటీ వచ్చింది. దీని తర్వాత 2019లో అంతకంటే పెద్ద విజయం సాధించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 తొలగింపు, యూనిఫాం సివిల్ కోడ్ మొదలైనవి బిజెపి ప్రధాన ఎజెండా. అయోధ్యలో రామమందిరాన్ని నిర్మాణం, జమ్మూ కశ్మీర్ నుంచి ఆర్టికల్ 370 తొలగింపును పూర్తి చేసింది. బీజేపీ ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు.