TS TET 2024 Exam Date:తెలంగాణ టెట్ పరీక్షకు మరో గండం.. షెడ్యూల్ మార్పుకు ఛాన్స్!
తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2024) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తేదీలు కూడా ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది. ఇక జూన్ 12న టెట్ 2024 ఫలితాలు కూడా ప్రకటిస్తామని షెడ్యూల్‌లో..
హైదరాబాద్, ఏప్రిల్ 26: తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2024) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన తేదీలు కూడా ఇప్పటికే విద్యాశాఖ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ పేర్కొంది. ఇక జూన్ 12న టెట్ 2024 ఫలితాలు కూడా ప్రకటిస్తామని షెడ్యూల్‌లో పేర్కొంది. దీంతో నిరుద్యోగులు టెట్ ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. అయితే సార్వత్రిక ఎన్నికల గండం గడిచినా.. మ్మెల్సీ ఉప ఎన్నిక ప్రభావం టెట్ పరీక్షపై పడుతుందేమోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.
ముఖ్యంగా రాష్ట్రంలోని నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ గురువారం (ఏప్రిల్ 25) విడుదలైంది. మే 27న ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్నట్లు షెడ్యూల్ పేర్కొంది. ఈ క్రమంలో మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ అధికారులు ప్రకటించడంతో అసలు ఆయా తేదీల్లో పరీక్షలు ఇంటాయో.. లేదోనని అభ్యర్ధులు గందరగోళంలో పడ్డారు.
మే 27న పోలింగ్ కాబట్టి ఆ రోజు ఆయా జిల్లాల్లో సాధారణ సెలవుగా ప్రకటిస్తారు. టెట్ పరీక్షకు హాజరయ్యేవారంతా పట్టభద్రులు కావడంతో వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే టెట్ పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై పాఠశాల విద్యాశాఖ తర్జనభర్జనలు పడుతుంది. తెలంగాణ టెట్ పరీక్షలు మే 20 నుంచి జూన్ 3 వరకు నిర్వహిస్తామని చెప్పినప్పటికీ ఏ తేదీన ఏ పేపర్‌కు పరీక్ష నిర్వహిస్తామనే విషయం మాత్రం ఇప్పటివరకు విద్యాశాఖ వెల్లడించలేదు. ఉప ఎన్నికల నేపథ్యంలో పేపర్ల వారీగా పరీక్షల నిర్వహణ తేదీల షెడ్యూల్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. ఆ ప్రకారంగా పోలింగ్ రోజున పరీక్షలు జరపకుండా మిగతా రోజుల్లో యథావిథిగా జరిగేలా షెడ్యూల్ రూపొందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కాగా ఈ ఏడాది టెట్ పరీక్షకు 2,83,441 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిల్లో పేపర్ 1కు 99,210 మంది చేసుకోవగా.. పేపర్ 2కు 1,84,231 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత టెట్‌లో 2.91 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.