సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి నిద్ర ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. అయితే రోజువారీ పని ఒత్తిడి, నైట్ షిఫ్టులు, జీవనశైలి కారణంగా కొందరికి సుఖ నిద్ర దూరం అవుతుంది
మనం చేసే కొన్ని పొరపాట్ల కారంణంగా కంటికి నిద్ర దూరం అవుతుంది. తద్వారా శారీరకంగా, మానసికంగా ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి
నిజానికి మన జీవితకాలంలో 1/3 వంతుల సమయాన్ని నిద్రకే కేటాయిస్తామట! కానీ జీవనశైలిలోని కొన్ని మార్పులు, తెలిసో-తెలియకో చేసే కొన్ని పొరపాట్ల వల్ల నిద్రకు తీవ్ర ఆటంకం కలుగుతోంది
కొన్నిసార్లు ఉన్నట్టుండి మధ్యరాత్రి మెలకువ వస్తుంటుంది. మళ్లీ ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు. దానిఫలితంగా మరుసటి రోజు ఏ పని చేస్తున్నా కునుకు పాట్లు పడాల్సి ఉంటుంది
అలాకాకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. చాలామంది ఉదయం లేచిన దగ్గర నుంచీ రాత్రి నిద్రపోయే వరకూ ల్యాప్‌టాప్‌లూ, ఫోన్లూ, కంప్యూటర్లు ఎక్కువగా చూస్తుంటారు
వీటి నుంచి విడదలయ్యే కాంతి నిద్రపోవడానికి కావలసిన మెలటోనిన్ ఉత్పత్తికి ఆటంకం కలిగిస్తుంది. దాంతో సరిగ్గా నిద్రపట్టదు. అందుకే డిజిటల్ పరికరాలకు రాత్రుళ్లు దూరంగా ఉంటే ఈ సమస్య నెమ్మదిగా తగ్గుతుంది
ప్రశాంతమైన నిద్రకి సౌకర్యవంతమైన వాతావరణం కూడా అవసరమే. గది చీకటిగా, దోమలు లేకుండా, చల్లగా ఉండేలా చూసుకోవాలి. ఎటువంటి ఆలోచనలు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి
కొందరు నిద్రపోయే ముందు కాఫీ, టీలు తాగుతుంటారు. వీటిలో ఉండే కెఫీన్ నిద్రకు భంగం కలిగిస్తుంది. అలాగే రోజూ వ్యాయామం చేయటం వల్ల యాక్టివ్‌గా ఉంటే రాత్రికి ప్రశాంతమైన నిద్రపడుతుంది