ప్రధాని మోదీ తీసుకున్న ఆ నిర్ణయంతో తెలంగాణ సర్కారుకు పెను ఊరట..
తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం కాస్త ఊరటను కల్గించింది. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళా మణులకు తీపికబురు చెప్పారు. వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ నిర్ణయం కేవలం మహిళలకే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేలు చేసేలా ఉంది.

రాష్ట్రంలో ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.955గా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హామీ ప్రకారం రూ.500 కే అందించాలి. ఇలా ఇవ్వడం వల్ల ఒక్కో సిలిండర్‌పై రూ.455 సబ్సిడీ రాష్ట్ర ఖజానా నుంచి చెల్లించాల్సి ఉంటుంది.
అలా కాకుండా కేంద్రం ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ.100 తగ్గించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిలిండర్‌పై కేవలం రూ.355 మాత్రమే సబ్సిడీని భరించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో సిలిండర్‌పై సబ్సిడీలో రూ. 100 తగ్గిందన మాట. ఇలా లబ్ధిదారులందరి కోణంలో నుంచి చూస్తే రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ భారం ఏడాదికి రూ.852 కోట్లకు తగ్గనుంది. అంతేకాకుండా ప్రధాని తీసుకున్న సంచలన నిర్ణయం వల్ల ఏడాదికి రూ.240 కోట్లు రేవంత్ సర్కార్‌కు ఆదా అవుతుంది. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంట గ్యాస్ సిలిండర్ పై ఒక వాగ్దానం చేసింది. తాము అధికారంలోకి వస్తే కేవలం రూ.500కే ఎల్‌పిజి సిలిండర్లను అందిస్తామని తెలిపింది. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహా లక్ష్మీ పథకం కింద ఈ హామీ అమలు చేయాల్సి ఉంది. మోదీ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండి పడకుండా స్వల్ప ఉపశమనం కలిగినట్లు అయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








