కాంగ్రెస్ పార్టీ
138 ఏళ్ల చరిత్ర కలిగిన భారత జాతీయ కాంగ్రెస్ (కాంగ్రెస్ పార్టీ) 1885 డిసెంబర్ 28న ఆవిర్భవించింది. భారత దేశంలో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన జాతీయ పార్టీ ఇది. కాంగ్రెస్‌ను మాజీ బ్రిటీష్ అధికారి ఏఓ హ్యూమ్ స్థాపించారు. వ్యోమేశ్ చంద్ర బెనర్జీ పార్టీ తొలి అధ్యక్షుడిగా పనిచేశారు. బ్రిటిష్ పాలనలో దేశ స్వాతంత్ర్య లక్షంతో ఆ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ తదితరులు కూడా ఉన్నారు. స్వాతంత్ర అనంతరం ఐదు దశాబ్ధాల పాటు కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా దేశ రాజకీయాలను శాసించింది. స్వాతంత్ర భారతావనిలో అత్యధిక సమయం (49 ఏళ్లు) అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే.
దేశ చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 364 సీట్లు గెలుచుకుంది. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ పార్టీ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కేవలం 44 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దేశానికి ఏడుగురు ప్రధానమంత్రులను ఇచ్చింది. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీకి చెందిన తొలి ప్రధాని. ఆయన తర్వాత కాంగ్రెస్ నుండి గుల్జారీ లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశానికి ప్రధానులు అయ్యారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రిగా పనిచేసిన ఒకే ఒక్క తెలుగువాడు పి.వి.నరసింహారావు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడుగా మల్లికార్జున్ ఖర్గే ఉన్నారు.