AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది.. ఇక ఏప్రిల్ నుంచి

ఇప్పుడున్న లబ్ధిదారుల సంఖ్యను, ఎన్నికల హామీలను పరిగణనలోకి తీసుకుంటే అన్ని పింఛన్లు పెంచినట్లయితే వార్షిక వ్యయం దాదాపు రూ.22 వేల కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఈ భారీ మొత్తాన్ని బడ్జెట్‌లో ఎలా సర్దుబాటు చేయాలి.? అదనపు నిధులు ఎలా సమీకరించాలి.? అనే అంశాలపై ఆర్థిక శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

Telangana: తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది.. ఇక ఏప్రిల్ నుంచి
Pensions
Prabhakar M
| Edited By: Ravi Kiran|

Updated on: Dec 16, 2025 | 9:02 AM

Share

రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల పెంపును త్వరలోనే అమలులోకి తీసుకురావాలన్న దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఆరు గ్యారంటీల్లో ఒకటైన పింఛన్ల పెంపును వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా ఇతర పింఛన్ల పెంపుపై సాధ్యాసాధ్యాలను అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ, 2026–27 ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి, అంటే ఏప్రిల్ నుంచే పింఛన్ల పెంపు అమలుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. పెంపుతో రాష్ట్ర ఖజానాపై పడే భారాన్ని అంచనా వేయడానికి ఆర్థిక శాఖ అధికారులు విస్తృతంగా లెక్కలు తీస్తున్నారు. ప్రస్తుతం 2025–26 బడ్జెట్‌లో పింఛన్ల కోసం ప్రభుత్వం సుమారు రూ.11,635 కోట్లను కేటాయించింది.

ఇప్పుడున్న లబ్ధిదారుల సంఖ్యను, ఎన్నికల హామీలను పరిగణనలోకి తీసుకుంటే అన్ని పింఛన్లు పెంచినట్లయితే వార్షిక వ్యయం దాదాపు రూ.22 వేల కోట్ల వరకు చేరే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు చెబుతున్నాయి. ఈ భారీ మొత్తాన్ని బడ్జెట్‌లో ఎలా సర్దుబాటు చేయాలి.? అదనపు నిధులు ఎలా సమీకరించాలి.? అనే అంశాలపై ఆర్థిక శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పింఛన్లను ఎంత మేరకు పెంచాలన్న దానిపైనా ప్రభుత్వంలో చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఇస్తున్న మొత్తానికి రూ.500 పెంచాలా? లేక రూ.వెయ్యి వరకు పెంచాలా? అన్న అంశంపై వివిధ ప్రత్యామ్నాయాలపై లెక్కలు వేస్తున్నారు. ఏకకాలంలో పూర్తిస్థాయిలో పెంపు సాధ్యం కాకపోతే, దశలవారీగా అమలు చేయాలన్న ఆలోచన కూడా పరిశీలనలో ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పింఛన్ల విధానాన్ని పరిశీలిస్తే వృద్ధులు, వితంతువులు, నేతన్నలు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ.2,016 చొప్పున పింఛన్ అందుతోంది. దివ్యాంగులకు నెలకు రూ.4,016 చెల్లిస్తున్నారు. డయాలసిస్ రోగులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పింఛన్లు అమలులో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సాధారణ పింఛన్లను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచాల్సి ఉంది. చేయూత గ్యారంటీ కింద పింఛన్ల పెంపుతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పెంపునూ ప్రకటించింది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పెంపు అమలులో ఉండగా, ఇప్పుడు పింఛన్ల పెంపుపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, బోగస్ పింఛన్లను అరికట్టేందుకు ఆధార్ సీడింగ్, బయోమెట్రిక్ విధానాలను మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల ఆదా అయ్యే నిధులను పింఛన్ల పెంపుకు వినియోగించవచ్చన్న అంచనా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే పెంపు అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. అదే సమయంలో, ఇటీవల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన నేపథ్యంలో కొత్తగా పింఛన్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పెరిగిన నిత్యావసరాల ధరలు, వైద్య ఖర్చుల నేపథ్యంలో పింఛన్ల పెంపు కోసం లబ్ధిదారులు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నుంచి పింఛన్ల పెంపు అమలవుతుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..