Hyderabad: హైదరాబాదీస్ జాగ్రత్త.! ఈసారి న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలివే.. తేడా వస్తే ఊసలు లెక్కపెట్టాల్సిందే
హైదరాబాద్ నగరం న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు రెడీ అవుతోంది. ఈసారి మరింత వినూత్నంగా కొత్త ఏడాదికి వెల్‌కమ్ చెప్పేందుకు నగరవాసులు ఎదురుచూస్తున్నారు. అయితే.. హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు. స్టార్ హోటల్స్, క్లబ్స్, బార్లపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతోపాటు.. పలు ఆంక్షలు విధించారు.

న్యూ ఇయర్ అంటే గుర్తుకొచ్చేది భాగ్యనగరం.. కొత్త సంవత్సరం వేడుకలు ఓ రేంజ్‌లో జరుగుతుంటాయి. కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతూ అందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేయాలనుకుంటారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచే యువత పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు. దీంతో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగానే.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ గైడ్ లైన్స్ జారీ చేశారు. స్టార్ హోటల్స్, క్లబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్‌ల నిర్వాహకులు 15 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవడంతోపాటు.. అర్ధరాత్రి ఒంటి గంట వరకే సెలబ్రేషన్స్ చేసుకోవాలని సూచించారు. కొత్త సంవత్సరం వేడుకలు జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు, ట్రాఫిక్ నియంత్రణ, అశ్లీలత లేని ప్రదర్శనలు మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. సెలబ్రేషన్స్ ప్రాంతంలో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్నారు హైదరాబాద్ పోలీసులు.
బహిరంగ ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లు, డీజేలను రాత్రి 10 గంటలకు నిలిపివేయాలని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఇండోర్‌లో మాత్రం అర్ధరాత్రి 1 గంట వరకు తక్కువ సౌండ్ మాత్రమే ఉపయోగించాలని చెప్పారు. పార్టీల్లో బాణసంచాకు అనుమతి లేదని.. వెహికల్ పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు హైదరాబాద్ పోలీసులు. సెలబ్రేషన్స్‌లో భాగంగా.. కెపాసిటీకి మించి పాస్‌లు, టికెట్లు, కూపన్లు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ప్రధానంగా.. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు వాడొద్దన్నారు . ఇలాంటివి ఎవరైనా వాడుతున్నట్లు తెలిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి, లిక్కర్‌తో పాటు అనేక అంశాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయన్నారు. మైనర్‌లకు ప్రవేశం నిషేధంతో పాటు డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తప్పవని డీసీపీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు.
ఇక.. ప్రతి ఏడాదిలాగే న్యూఇయర్ వేడుకలకు ఈసారి కూడా ఏక్సైజ్, నార్కోటిక్స్, పోలీసుల ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాలు, పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్స్‌లో తనిఖీలు నిర్వహిస్తామన్నారు హైదరాబాద్ పోలీసులు. డ్రగ్స్ టెస్టులు కూడా నిమిషాల్లో తెలిసిపోయేలా అత్యాధునిక పరికరాలు వినియోగిస్తున్నామని చెప్పారు. పబ్బుల్లో డ్రగ్స్ ఛాయలు, అనుమానితుల గుర్తింపు కోసం ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీ చేస్తామని తెలిపారు. డ్రంకన్ అండ్ డ్రైవ్ తనిఖీల నేపథ్యంలో మద్యం సేవించి వాహనాలు నడపకుండా డ్రైవర్‌లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. మొత్తంగా.. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలను చేపట్టారు. ప్రశాంత వాతావరణంలో న్యూఇయర్ వేడుకలను నిర్వహించుకోవాలని కోరుతున్నారు. నిబంధనలు అతిక్రమించితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








