ఉద్యోగులకు ఇక పండగే.. వారానికి ఒక రోజు కాదు.. 3రోజుల సెలవు!.. 4 రోజులే పని!
New Labor Laws: వారానికి ఆరు రోజులు ఆఫీసు.. ఇదేనా జీవితం? అన్న ప్రశ్న చాలా మందికి తెలుసు. కానీ ఇప్పుడు ఆ లూప్ బ్రేక్ అవబోతోందా? నాలుగు రోజులు పని చేసి, మూడు రోజులు ఫుల్ ఫ్రీ టైమ్ అనుభవించే ఛాన్స్ భారత్‌లో నిజమయ్యే దిశగా కదులుతోంది. కొత్త కార్మిక చట్టాలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కు కొత్త గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నాయి.

నాలుగు రోజుల పని విధానం ఇప్పటికే కొన్ని దేశాల్లో ప్రయోగాత్మకంగా అమలవుతుండగా, భారత్‌లో ఇది అసాధ్యం అన్న భావన ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్స్ ఈ ఆలోచనకు చట్టబద్ధత కల్పిస్తున్నాయి. కంపెనీలు, ఉద్యోగులు పరస్పర అంగీకారంతో వారానికి నాలుగు రోజులు పని చేసి, మిగిలిన మూడు రోజులు వేతనంతో కూడిన సెలవులు పొందే అవకాశం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పాతకాలం నాటి 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి, వాటి స్థానంలో నాలుగు కొత్త లేబర్ కోడ్స్‌ను తీసుకువచ్చింది. ఈ చట్టాల ప్రకారం వారంలో మొత్తం పని గంటలను సంస్థలు సర్దుబాటు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పని విధానంపై వచ్చిన అనుమానాలకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఇటీవల స్పష్టత ఇచ్చింది. వారానికి పని దినాలు తగ్గినా, మొత్తం పని గంటలు మాత్రం తగ్గవు. వారానికి కనీసం 48 గంటలు పని చేయాల్సిందే అన్న నిబంధన యథాతథంగా ఉంటుంది. అంటే నాలుగు రోజుల పని విధానం ఎంచుకుంటే రోజుకు సగటున 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఈ 12 గంటలు నిరంతరంగా పని చేయాల్సిందే అన్న అర్థం కాదని కార్మిక శాఖ తెలిపింది.
భోజన విరామం, షిఫ్ట్‌ల మధ్య విరామాలు వంటి వాటిని కూడా ఈ 12 గంటల్లోనే లెక్కిస్తారు. ఒకవేళ వారానికి 48 గంటలను మించి పని చేయిస్తే, ఆ అదనపు గంటలకు ఉద్యోగులకు రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో పని గంటల పరిమితిపై స్పష్టత వచ్చింది.
నాలుగు రోజుల పని విధానం తప్పనిసరి కాదని, ఇది పూర్తిగా ఐచ్చికమేనని కార్మిక శాఖ పేర్కొంది. కంపెనీ విధానాలు, ఉద్యోగుల అంగీకారం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనల ఆధారంగా ఈ విధానం అమలు అవుతుందని తెలిపింది. అన్ని రంగాలకు ఇది అనుకూలంగా ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
24 గంటలూ నిరంతరంగా పనిచేయాల్సిన పరిశ్రమలు, అత్యవసర సేవలు, తయారీ రంగం వంటి విభాగాల్లో నాలుగు రోజుల పని విధానం అమలు చేయడం సవాలుగా మారవచ్చని కార్మిక రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఐటీ, సేవా రంగాల్లో ఇది ఎంతవరకు ఆమోదం పొందుతుందన్నది వేచి చూడాల్సిన అంశమే.
నాలుగు రోజుల పని విధానం వాస్తవంగా అమలులోకి వస్తే ఉద్యోగుల పనిజీవన సమతుల్యత మెరుగవుతుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. అయితే రోజుకు ఎక్కువ గంటలు పని చేయాల్సి రావడం వల్ల ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందా అనే చర్చ కూడా మొదలైంది. ఈ కొత్త విధానంపై కంపెనీలు, ఉద్యోగులు ఎలా స్పందిస్తారన్నది కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








