AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పేరెంట్స్‌కు గుడ్‌న్యూస్.. కష్టపడి పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లే పనిలేదు.. జస్ట్ ఇది చేస్తే చాలా

హైదరాబాద్‌లో స్కూల్ సమయాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. ఉదయం పిల్లలను స్కూల్‌కు వదిలేయడం, సాయంత్రం తిరిగి ఇంటికి తీసుకురావడం తల్లిదండ్రులకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ఉద్యోగాల్లో ఉన్న తల్లిదండ్రులకు ఇది మరింత కష్టంగా మారుతోంది. స్కూల్ ప్రాంతాల వద్ద వాహనాల రద్దీ పెరిగి తరచూ ట్రాఫిక్ జామ్‌లు కూడా ఏర్పడుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో సైబరాబాద్ పోలీసులు ఒక కొత్త రవాణా విధానాన్ని సిద్ధం చేస్తున్నారు.

Hyderabad: పేరెంట్స్‌కు గుడ్‌న్యూస్.. కష్టపడి పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లే పనిలేదు.. జస్ట్ ఇది చేస్తే చాలా
Hyderabad Traffic Solution
Anand T
|

Updated on: Mar 06, 2026 | 10:06 AM

Share

స్కూల్ విద్యార్థుల ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు నగర ట్రాఫిక్‌ను తగ్గించేలా సైబరాబాద్ పోలీసులు సరికొత్త ప్రణాళిక రూపొందించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం సుమారు 1,539 ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ఉన్నాయి. అయితే విద్యార్థులను తరలించేందుకు స్కూల్ బస్సులు మాత్రం కేవలం మూడువేల వరకు మాత్రమే ఉన్నాయి. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను బైకులు, కార్లు, ఆటోలు వంటి వ్యక్తిగత వాహనాల ద్వారా స్కూల్‌కు తీసుకెళ్తున్నారు. దీని కారణంగా స్కూల్ ప్రారంభం, ముగింపు సమయాల్లో రోడ్లపై భారీ ట్రాఫిక్ ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు సైబరాబాద్ పోలీసులు స్మార్ట్ మొబిలిటీ సిస్టమ్ ను అమలు చేయాలని నిర్ణయించారు.

ఈ ప్రణాళికలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బందిని ఎంపిక చేసి వారికి పోలీసుల ద్వారా బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అనంతరం వారిని విద్యార్థుల కోసం ప్రత్యేక మొబిలిటీ అటెండెంట్లుగా నియమిస్తారు. ఈ అటెండెంట్లు ప్రతి రోజు విద్యార్థుల ఇంటి వద్దకు వెళ్లి పిల్లలను సురక్షితంగా బస్సు వరకు తీసుకెళ్తారు. బస్సులో ఉన్న సిబ్బందికి అప్పగించిన తర్వాత పిల్లలు స్కూల్‌కు చేరుకుంటారు. సాయంత్రం స్కూల్ నుంచి తిరిగి వచ్చినప్పుడు కూడా అదే విధంగా బస్సు వద్ద నుంచి పిల్లలను తీసుకుని వారి ఇళ్ల వరకు చేరుస్తారు.

ఇక ఈ మొత్తం వ్యవస్థను సాంకేతికతతో అనుసంధానం చేయనున్నారు. ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల బస్సు ప్రయాణాన్ని రియల్ టైమ్‌లో ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి బస్సులో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పోలీసుల కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు కనెక్ట్ చేయనున్నారు. అదేవిధంగా ఒకే ప్రాంతంలో నివసించే వివిధ స్కూళ్ల విద్యార్థులను ఒకే బస్సులో తరలించేలా స్మార్ట్ రూట్ ప్లానింగ్ కూడా రూపొందించనున్నారు. ప్రస్తుతం ఉన్న మూడు వేల స్కూల్ బస్సుల సంఖ్యను 15 వేల వరకు పెంచాలని సైబరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. ఇలా చేస్తే వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గి ట్రాఫిక్ సమస్య కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఈ కొత్త వ్యవస్థను వినియోగించుకునేందుకు తల్లిదండ్రులు మూడు నెలలు లేదా ఏడాది ప్రాతిపదికన యాప్ ద్వారా సబ్‌స్క్రిప్షన్ తీసుకుని నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి నుంచి స్కూల్ దూరాన్ని బట్టి ఈ రుసుమును నిర్ణయించనున్నారు. ఈ ప్రాజెక్టును అమలు చేసే ముందు సైబరాబాద్ పరిధిలోని స్కూల్ యాజమాన్యాలు, తల్లిదండ్రులతో పోలీసులు చర్చలు జరపనున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత 2026 జూన్ నాటికి ఈ ప్రణాళికను అమల్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే స్కూల్ సమయాల్లో నగర రోడ్లపై ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గడమే కాకుండా, విద్యార్థుల ప్రయాణం కూడా మరింత భద్రంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us