టాలీవుడ్‌కే టైం బాంబ్‌లా..రూ.1000 కోట్ల కల
పాన్ ఇండియా విజయాల తర్వాత టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌ల ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. వందల కోట్ల పెట్టుబడులతో తెరకెక్కుతున్న సినిమాలు మార్కెట్ వాస్తవాలకు దూరమవుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కథ కంటే భారీ ఖర్చులపై దృష్టి పెరగడం ప్రమాదకరమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. బాలీవుడ్ ఎదుర్కొన్న సంక్షోభం టాలీవుడ్‌కూ వస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే… 20 నుంచి 50 కోట్ల బడ్జెట్‌లో తీసిన సినిమా… 100 కోట్ల వసూళ్లు సాధిస్తే అది సంచలనం. కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక సినిమా మొదలైతే… బడ్జెట్ 300 కోట్లు… 500 కోట్లు… 700 కోట్లు… చివరకు 1000 కోట్ల మార్క్ దాకా వెళ్లిపోతోంది. ప్రతి హీరో పాన్ ఇండియా స్టార్ కావాలని చూస్తున్నాడు. ప్రతి నిర్మాత “నెక్స్ట్ బాహుబలి”… “నెక్స్ట్ RRR”… “నెక్స్ట్ పుష్ప” కోసం పరుగులు పెడుతున్నాడు. కానీ ఇక్కడ ఒక ప్రశ్న అడగాల్సిన సమయం వచ్చింది.ఈ పాన్ ఇండియా రేస్ నిజంగా మంచిదేనా.. లేదా… టాలీవుడ్ కూడా బాలీవుడ్ చేసిన తప్పులనే మళ్లీ రిపీట్ చేస్తోందా…? మన టాప్ హీరోలంతా ఇప్పుడు లోకల్ కథలను పక్కన పెట్టేసి, గ్లోబల్ లెవెల్ ఆడియన్స్‌ని మెప్పించే భారీ ప్రాజెక్టుల మోజులో పడ్డారు. కానీ.. ఈ వెలుగుల వెనుక, ఈ భారీ నంబర్ల వెనుక ఒక భయంకరమైన నిశ్శబ్దం దాగుంది. “పెరుగుట విరుగుట కొరకేనా?” అనే అనుమానం ఇండస్ట్రీ పెద్దలని వేధిస్తోంది. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌కి ఈ భారీ బడ్జెట్లే పెద్ద శాపంగా మారబోతున్నాయా? ఎస్ ఎస్ రాజమౌళి చూపించిన ‘పాన్ ఇండియా’ రహదారికి డెడ్ ఎండ్ వచ్చేసిందా? ఒకవైపు ఓటీటీ ఆదాయం పడిపోతోంది, థియేటర్లకు జనాలు రావడం తగ్గింది, టికెట్ రేట్ల వివాదాలు నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో బడ్జెట్ హద్దులు దాటడం కరెక్టేనా? ఇవాళ మనం టాలీవుడ్ ఎదుర్కొంటున్న ఈ అతిపెద్ద సంక్షోభం గురించి, మేకర్స్ మరిచిపోతున్న మార్కెట్ లెక్కల ఏం చెబుతున్నాయి. ఈరోజు తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం…దర్శకధీరుడు S. S. Rajamouli. బాహుబలి ముందు… తెలుగు సినిమా మార్కెట్ ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, కొంత ఓవర్సీస్ వరకు మాత్రమే ఉండేది. కానీ బాహుబలి వచ్చాక…ఉత్తర భారతదేశం కూడా తెలుగు సినిమాను గౌరవంగా చూడటం మొదలుపెట్టింది. RRR తర్వాత అయితే…హాలీవుడ్ కూడా తెలుగు సినిమా గురించి మాట్లాడే స్థాయికి చేరింది.ఇది రాజమౌళి సాధించిన గొప్ప విజయమే. కానీ…ఒక రాజమౌళి విజయం చూసి… అందరూ అదే ఫార్ములా ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. అక్కడి నుంచే అసలు సమస్య ప్రారంభమైంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.. ప్రొడ్యూసర్స్ పరిస్థితి ఏంటి? ఒక సినిమాకి 500 కోట్లు బడ్జెట్ పెడుతున్నారు అంటే, అందులో మేకింగ్ కోసం ఎంత ఖర్చు అవుతోంది, హీరోలు, డైరెక్టర్ల రెమ్యునరేషన్లకి ఎంత వెళ్తోంది? నమ్మశక్యం కాని నిజం ఏంటంటే.. ఈ భారీ బడ్జెట్ సినిమాలలో దాదాపు 50 నుండి 60 శాతం బడ్జెట్ కేవలం హీరో, టాప్ డైరెక్టర్ల జీతాలకే సరిపోతోంది! మిగిలిన 40 శాతంతో సినిమా తీయాలి. అందులో మళ్ళీ విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సీక్వెన్స్, ఫారిన్ షెడ్యూల్స్. మన హీరోలు మార్కెట్ లెక్కలు మరిచి సినిమాలు సైన్ చేస్తున్నారు. ఒక సినిమా హిట్టయితే వచ్చే క్రెడిట్ అంతా హీరో ఖాతాలోకి వెళ్తుంది, రెమ్యునరేషన్ నెక్స్ట్ సినిమాకి డబల్ అవుతుంది. కానీ సినిమా ఫ్లాప్ అయితే? ఆ నష్టం మొత్తం ప్రొడ్యూసర్ గుండె మీద పడుతుంది. డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడతారు. ఇవాళ ప్రొడ్యూసర్ కేవలం ఒక ఫైనాన్షియర్ లా మారిపోయాడు తప్ప, ప్రాజెక్ట్ మీద కంట్రోల్ ఉన్న మేకర్ లా మిగలడం లేదు. సినిమా హిట్ అయితే థియేట్రికల్ రిటర్న్స్ వస్తాయి సరే.. కానీ ఈ బడ్జెట్ రికవరీ కావాలంటే ప్రతి సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వాల్సిన పరిస్థితి. ఇది ఎంతవరకు ప్రాక్టికల్? ఒక్క అడుగు అటు ఇటు పడినా వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అవుతాయి. హిస్టరీ ఇస్ ఎ గ్రేట్ టీచర్ అంటారు. మనం ఎక్కడో వెతకక్కర్లేదు, పక్కనే ఉన్న బాలీవుడ్‌ని చూస్తే మనకి అర్థమైపోతుంది. ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఇండియన్ సినిమాకి కేరాఫ్ అడ్రస్. వందల కోట్లు ఖర్చు పెట్టి స్టార్లు, గ్లామర్, విదేశీ లోకేషన్లు అంటూ సినిమాలు తీశారు. వాళ్ళు కూడా కథని, నేటివిటీని నమ్ముకోవడం మానేసి కేవలం లార్జర్ ద్యాన్ లైఫ్ ఇమేజ్ వెనుక పడ్డారు. ఫలితం ఏమైంది? వరుసగా వందల కోట్ల బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టాయి. బాలీవుడ్ ప్రేక్షకులు ఆ స్టార్లని, ఆ నకిలీ గ్రాఫిక్స్ సినిమాలని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు టాలీవుడ్ కూడా అదే తప్పు చేస్తోందా? బాలీవుడ్ వైఫల్యం నుంచి మన హీరోలు, ప్రొడ్యూసర్లు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. కేవలం యాక్షన్, వీఎఫ్ఎక్స్, వందల మంది ఫైటర్లతో విన్యాసాలు చేయిస్తే జనాలు చూడరు. హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ మన థియేటర్లలో చూపిస్తున్నాం అని మేకర్స్ సంబరపడిపోతున్నారు, కానీ ప్రేక్షకుడు ఆల్రెడీ తన మొబైల్‌లో, టీవీలో రియల్ హాలీవుడ్ కంటెంట్ చూసేస్తున్నాడు. వాడికి కావాల్సింది ‘సోల్’ .. అది కథలోనే ఉంటుంది. బడ్జెట్ పెంచుకుంటూ పోతే టాలీవుడ్ కూడా ఒకరోజు బాలీవుడ్ లా సంక్షోభంలో పడటం ఖాయం. ఇదే టైంలో మనం ఇంకొక ఇండస్ట్రీని మెచ్చుకుని తీరాలి.. అదే మలయాళ చిత్ర పరిశ్రమ . టాలీవుడ్ వాళ్ళు ఒక వైపు 500 కోట్లు పెట్టి తలలు పట్టుకుంటుంటే, మలయాళం వాళ్ళు కేవలం 5 కోట్లు, 10 కోట్లు, మాగ్జిమం 20 కోట్ల బడ్జెట్‌తో వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. గత కొంతకాలంగా మలయాళ సినిమాలు కేవలం కేరళలోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లో.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా కేవలం ‘మౌత్ టాక్’ తో కోట్లు కొల్లగొడుతున్నాయి. ‘మంజుమ్మెల్ బాయ్స్’ తీసుకోండి.. అందులో ఏమైనా వందల కోట్ల వీఎఫ్ఎక్స్ ఉందా? లేదు, కేవలం ఒక గుహ, స్నేహితుల మధ్య ఉన్న ఎమోషన్. ‘భ్రమయుగం’ చూడండి.. కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ సినిమా, కానీ థియేటర్లో కూర్చుంటే వెన్నులో వణుకు పుడుతుంది. వీళ్ళు నమ్ముకుంది కంటెంట్‌ని, నటీనటుల ప్రతిభని, దర్శకుడి విజన్‌ని. వాళ్ళు తక్కువ బడ్జెట్‌తో గ్లోబల్ క్వాలిటీ సినిమా తీసి చూపిస్తున్నారు. మరి టాలీవుడ్ ఎందుకు కేవలం ‘భారీతనం’ వెనుకే పరిగెడుతోంది? కథలో దమ్ముంటే చిన్న బడ్జెట్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఆడుతుందని మలయాళం ఇండస్ట్రీ నిరూపిస్తుంటే, మనవాళ్లు ఇంకా ఎందుకు కళ్ళు తెరవడం లేదు? సినిమా బిజినెస్ రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు సినిమా ఫ్లాప్ అయినా ఓటీటీ రైట్స్ ద్వారా ప్రొడ్యూసర్ సేఫ్ జోన్‌కి వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఓటీటీ సంస్థలు కూడా తెలివిమీరాయి. థియేట్రికల్ రన్‌ని బట్టే, సినిమా రిజల్ట్‌ని బట్టే రేట్లు ఇస్తాం అని కండిషన్స్ పెడుతున్నాయి. ఓటీటీ నుంచి వచ్చే ఆదాయం దారుణంగా పడిపోయింది. ఇక థియేటర్ల పరిస్థితి చూస్తే.. సామాన్య ప్రేక్షకుడు థియేటర్ కి రావాలంటేనే భయపడుతున్నాడు. ఒక ఫ్యామిలీ థియేటర్ కి వెళ్తే టికెట్లు, పాప్‌కార్న్, పార్కింగ్ అన్నీ కలిపి కనీసం 1500 నుండి 2000 రూపాయలు ఖర్చవుతున్నాయి. దానికి తోడు పెద్ద సినిమాలకి గవర్నమెంట్ నుంచి టికెట్ రేట్ల పెంపు జీవోలు తెచ్చుకుంటున్నారు. దీనివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది. రేట్లు ఎక్కువగా ఉన్నాయని జనాలు థియేటర్లకు రావడం మానేసి, “ఎలాగో నాలుగు వారాల్లో ఓటీటీ లోకి వస్తుంది కదా, అప్పుడే చూద్దాం” అని ఫిక్స్ అయిపోతున్నారు. ఇదే విషయాన్ని మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఎన్నోసార్లు వేదికల మీద చెప్పారు. “హీరోలు, దర్శకులు బడ్జెట్ తగ్గించుకోవాలి, కంటెంట్ మీద ఫోకస్ పెట్టాలి, అనవసరపు ఖర్చులు తగ్గించి ప్రొడ్యూసర్‌ని బతికించాలి” అని ఆయన ఎంత మొత్తుకుంటున్నా.. నేటి తరం హీరోలు కానీ, మేకర్స్ కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. ఇగోలకి పోయి బడ్జెట్‌ని హద్దులు దాటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే… భారీ బడ్జెట్ సినిమా. అని చాలామంది అనుకుంటున్నారు. అసలు అది నిజం కాదు. పాన్ ఇండియా అంటే… భారతదేశం మొత్తం ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యే కథ. అంతే. బడ్జెట్ కాదు. భాష కాదు. VFX కాదు.కేవలం కంటెంట్ మాత్రేమే పాన్ ఇండియా కావాలి. బడ్జెట్ కాదు. టాలీవుడ్‌లో ప్రమాదకరమైన బడ్జెట్ ఇన్ఫ్లేషన్ కనిపిస్తోంది. టాలీవుడ్ లో ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. హీరో రెమ్యునరేషన్ పెరిగింది. డైరెక్టర్ రెమ్యునరేషన్ పెరిగింది. VFX ఖర్చులు పెరిగాయి. సెట్‌లు పెరిగాయి. మార్కెటింగ్ ఖర్చులు పెరిగాయి. ఫలితం… 300 కోట్ల సినిమా… 600 కోట్లకు చేరుతోంది. 600 కోట్ల సినిమా… 1000 కోట్లకు చేరుతోంది. కానీ ఇక్కడ అసలు ప్రశ్న… అంత మార్కెట్ ఉందా?ఉదాహరణకు… ఒక సినిమా బడ్జెట్ 600 కోట్లు అయితే… దానికి కనీసం 1000 నుంచి 1200 కోట్ల గ్రాస్ అవసరం. అప్పుడు మాత్రమే అందరికీ లాభాలు వస్తాయి. కానీ… ప్రతి సినిమా RRR కాదు. ప్రతి సినిమా పుష్ప కాదు. ప్రతి సినిమా బాహుబలి కాదు. ఇది నిర్మాతలు గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు నిర్మాతలకు ఒక ధైర్యం ఉండేది. థియేటర్‌లో రాకపోయినా… OTT అమ్ముడవుతుంది. శాటిలైట్ వస్తుంది. డిజిటల్ వస్తుంది అని. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. OTT కంపెనీలు కూడా జాగ్రత్త పడుతున్నాయి. ఎంత పడితే అంత ఇవ్వడం లేదు. కంటెంట్ చూసి కొనుగోలు చేస్తున్నాయి. మరోవైపు… ప్రేక్షకుడు కూడా చాలా సెలెక్టివ్ అయ్యాడు. నచ్చితే మాత్రమే థియేటర్‌కు వస్తున్నాడు. ఇలాంటి సమయంలో… బడ్జెట్‌లను నియంత్రించకపోతే… ప్రమాదం మరింత పెరుగుతుంది. పాన్ ఇండియా అనేది తప్పు కాదు. భారీ కలలు కనడం కూడా తప్పు కాదు. కానీ… మార్కెట్ రియాలిటీని మర్చిపోవడం మాత్రం ప్రమాదకరం. ప్రతి సినిమా 1000 కోట్ల కోసం తీయాల్సిన అవసరం లేదు. ప్రతి హీరో పాన్ ఇండియా స్టార్ కావాల్సిన అవసరం లేదు. ప్రతి కథకు 500 కోట్ల బడ్జెట్ అవసరం లేదు. మెగా స్టార్ చిరంజీవి చెప్పినట్టుగా… బడ్జెట్ కంట్రోల్‌లో ఉండాలి. కథ మీద ఫోకస్ ఉండాలి. ప్రేక్షకుడు థియేటర్‌కి రావాలంటే… అతడికి విజువల్ వండర్ కంటే… ఎమోషన్, ఎంటర్టైన్‌మెంట్, మంచి కథ కావాలి. ఎందుకంటే…సినిమా చరిత్ర ఎప్పుడూ ఒక విషయం చెబుతోంది. “పెరుగుట విరుగుట కొరకే.” అతి ఎక్కడైనా ప్రమాదమే. టాలీవుడ్ ఇప్పుడు ప్రపంచాన్ని గెలిచే స్థాయిలో ఉంది. కానీ అదే సమయంలో… తన కాళ్లు నేల మీద ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే… పాన్ ఇండియా కల… పాన్ ఇండియా బుడగగా మారే ప్రమాదం ఉంది. మన హీరోలు, మేకర్స్ కూడా ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. గ్రౌండ్ రియాలిటీని గ్రహించాలి. బడ్జెట్ హద్దులు దాటితే అది టాలీవుడ్ భవిష్యత్తుకే ముప్పు. కంటెంట్‌ని నమ్ముకుంటే తక్కువ బడ్జెట్‌లో కూడా అద్భుతాలు చేయొచ్చని పక్కనే ఉన్న మలయాళ ఇండస్ట్రీ చూపిస్తున్న పాఠాలనైనా నేర్చుకోవాలి. లేదంటే, ఒకప్పుడు వైభవంగా వెలిగి, ఆ తర్వాత సంక్షోభంలో పడిన బాలీవుడ్ పరిస్థితే టాలీవుడ్‌కి కూడా వచ్చే ప్రమాదం ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Peddi: పెద్ది హిట్టా..? ఫట్టా..? ఫైనల్‌గా కలెక్షన్స్ ఏం చెబుతున్నాయి?
పెంపుడు కుక్క మృతి.. తిరిగిరాని చిన్నారి.. 500 ఎకరాల్లో జల్లెడ
ఎల్ నినో భయంకరమైన సవాల్.. వేడి ఎక్కువ, వర్షం తక్కువ..
పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్ వల్ల బతికాను..
పట్టుతప్పి కిందపడ్డా.. చనిపోయేదాన్నే.. కానీ గైడ్ వల్ల బతికాను..
వైరల్ వీడియోలే వరుడికి విలన్‌లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!
రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!
మగ తోడు ఉంటేనే పిల్లల్ని కనగలరా? మరి ఈ చేప సంగతేంటి?
5,300 ఏళ్ల నాడు తిన్న తిండి.. ఇంకా అరుగుతూనే ఉంది
ఆకాశంలో వింత కాంతులు! ఆత్మలా? ఏలియన్సా?
ఆకారం భారీగా.. కానీ చేతులు చిన్నవిగా? ఇజ్జత్ మొత్తం పాయె!

