AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జానూ ఎక్కడమ్మ.. ఏడు టవర్ల పరిధిలో 4,800 ఫోన్‌ కాల్స్‌‌పై ఫోకస్.. పవన్‌ ఆదేశాలతో రంగంలోకి హనుమాన్ టీమ్

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాకలో అదృశ్యమైన మూడేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నారు. ఏడు సెల్ టవర్ల పరిధిలో నమోదైన 4,800 ఫోన్ కాల్స్‌ను విశ్లేషిస్తూ, అనుమానితులను విచారిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో అదనంగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, హనుమాన్ టీమ్ రంగంలోకి దిగగా, థర్మల్ డ్రోన్ల సహాయంతో తోటలు, కొండ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. చిన్నారి వెంట వెళ్లి తిరిగి వచ్చిన పెంపుడు శునకం మృతిపై కూడా ఫోరెన్సిక్ నివేదిక కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

జానూ ఎక్కడమ్మ.. ఏడు టవర్ల పరిధిలో 4,800 ఫోన్‌ కాల్స్‌‌పై ఫోకస్.. పవన్‌ ఆదేశాలతో రంగంలోకి హనుమాన్ టీమ్
Kakinada Jahnavi Missing Updates
Shaik Madar Saheb
|

Updated on: Jun 15, 2026 | 9:14 AM

Share

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక సమీపంలో మూడేళ్ల చిన్నారి అదృశ్యమై రోజులు గడుస్తున్నాయి.. చిన్నారి కనిపించకుండాపోయి 9 రోజులు అవుతుంది.. వందలాది మంది ఎంత వెతికినా జ్ఞానేశ్వరి (జాను) జాడ కనిపించడంలేదు.. కాకినాడ జిల్లా తునిలో జాహ్నవి మిస్సింగ్ పెద్ద మిస్టరీగా మారింది. దొండవాక గ్రామ శివారులోని పామాయిల్‌ తోటలో కాపలా ఉండే దంపతుల కూతురు జాహ్నవి ఆడుకుంటూ వెళ్లి మిస్సయిన విషయం తెలిసిందే..సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా.. చిన్న క్లూ దొరకడం లేదు.. ఈ నెల 6న చిన్నారి అదృశ్యం కాగా 9 రోజులుగా పోలీసు బృందాలు గాలింపు చేపడుతున్నాయి. అయితే.. చిన్నారి అదృశ్యమైన సమయంలో ఆమె వెంట వెళ్లి తిరిగి వచ్చి.. శనివారం మృతి చెందిన శునకానికి ఆదివారం పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. శునకం శరీరంలోని పలు భాగాల నుంచి నమూనాలు సేకరించి.. విశాఖపట్నంలోని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాత నివేదికకు అనుగుణంగా శునకం మరణానికి కారణాలపై స్పష్టత రానుంది.

ఇదిలాఉంటే.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో అదనంగా 30 మంది ఎన్డీఆర్‌ఎఫ్, వన్యప్రాణుల పర్యవేక్షణ, సహాయం, సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హనుమాన్‌ బృందం సైతం రంగంలోకి దిగింది. వారంతా.. తోట, కొండ ప్రాంతాన్ని అణువణువు గాలిస్తున్నారు. అత్యాధునిక థర్మల్‌ డ్రోన్ల సహాయంతో అన్ని ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. కొండ చుట్టూ అనుమానం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడకు చేరుకుని పరిశీలిస్తున్నారు. సాంకేతికంగా కూడా అన్ని కోణాల్లో జాహ్నవి జాడ కోసం విచారిస్తున్నారు. విస్తృత దర్యాప్తు, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ తెలిపారు.

జూన్ 6న చిన్నారి అదృశ్యం నాటి నుంచి.. ఫోన్‌కాల్స్, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు అనుమానితులను విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో కూడా బృందాలు గాలింపు చేపట్టాయి.. ఏడు టవర్ల పరిధిలో సుమారు 4,800 ఫోన్‌ కాల్స్‌ విశ్లేషించినట్లు తెలిపారు. వీరిలో కొందరు అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తోంది.. వారిని కొందరిని ట్రేస్ చేసి.. విచారిస్తున్నారు.

ఇదిలాఉంటే.. 300 మీటర్లకు పైగా డ్రోన్‌ కెమెరాల ద్వారా పరిశీలించిన సమయంలోనూ ఎటువంటి జంతువుల ఆనవాళ్లు లభ్యం కాలేదని.. మానవ ప్రయత్నంతోపాటు.. సాంకేతికంగా జాను ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us