Petrol Prices: దేశ ప్రజలకు పెద్ద ఊరట.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? ఎంతంటే..?
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ముడి చమురు ధరలు భారీగా కుప్పకూలడమే. ఇటీవల కాలంలో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోయాయి. బ్యారెల్‌కు 120 డాలర్ల నుంచి 80 డాలర్ల దిగువకు వచ్చింది. దీంతో ఇంధన ధరలు తగ్గే ఛాన్స్ ఉంది.

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు గత నెలలో నాలుగుసార్లు పెరిగాయి. ఏకంగా లీటర్‌పై రూ.7.5 మేర పెరిగాయి. దీంతో రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరిగాయి. ఇటీవల కూరగాయలు, సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులకు ఇంటి ఖర్చు పెరుగుతోంది. అమెరికా-ఇరాన్ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ ధర 120 డాలర్లు దాడటంతో చుమురు కంపెనీలు కొనుగోలు చేసేందుకు ఎక్కువ సొమ్ము వెచ్చించాల్సి ఉంటుంది. దీని వల్ల కంపెనీలు నష్టాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇంధన ధరలను పెంచింది. కానీ ఆ తర్వాత కూడా కంపెనీలకు నష్టం కొనసాగుతుండటంతో మరోసారి ఇంధన ధరలను కేంద్రం పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఊరటనిచ్చే వార్త బయటకొచ్చింది. అదేంటంటే..
పెట్రోల్, డీజిల్ ధర తగ్గుతుందా..?
ఇరాన్‌తో త్వరలో శాంతి ఒప్పందం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందం జరిగిన వెంటనే హర్ముజ్ జలసంధి తెరుచుకుంటుందని తెలిపారు. ఈ ప్రకటనతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోయాయి. ఇటీవల బ్యారెల్ 120 డాలర్లగా ఉండగా.. ఇప్పుడు 83.43 డాలర్లకు చేరుకుంది. ఇక అమెరికాలో 5 శాతం పడిపోయి 80.61 డాలర్లకు చేరుకున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్దం క్రమంలో 120 డాలర్లకుపైగా చేరుకున్నాయి. యుద్దానికి ముందు 70 డాలర్లకు ఉండగా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి మూతపడటం వల్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే హర్ముజ్ జలసంధి తెరుచుకోనుందని ట్రంప్ ప్రకటన తర్వాత ముడి చమురు ధరలు కుప్పకూలాయి. హర్ముజ్ జలసంధి తిరిగి తెరవడం వల్ల సముద్ర వాణిజ్యం మరింత మెరుగుపడనుంది. గల్ప్ దేశాల నుంచి చమురు దిగుమతులు తిరిగి ప్రారంభం కానున్నాయి. దీంతో పాటు ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ జూలై నుండి ఉత్పత్తి కోటాలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో భారత్‌లో కూడా పెట్రోల్, డీజిల్ తగ్గే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.
కేంద్రం నుంచి త్వరలో ప్రకటన..?
ముడి చమురు ధరలు భారీగా పతనం కావడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ తగ్గనున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. త్యరలోనే కేంద్రం నుంచి ప్రకటన రావొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం ప్రభుత్వం ధరలను పెంచింది. దీంతో చాలా రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ రూ.100కిపైగా చేరుకుంది. త్వరలో తగ్గిస్తే వాహనదారులతో పాటు సామాన్యులకు ఊరట కలగలనుందని చెప్పవచ్చు. ముడి చమురు ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్న క్రమంలో ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ఎంత తగ్గిస్తుందనేది చూడాలి.
