AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Debit Card Insurance: డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా.. ఎలా పొందాలంటే!

దేశంలో బ్యాంక్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరికీ డెబిట్ కార్డు సాధారణమైపోయింది. ఏటీఎంల్లో నగదు ఉపసంహరణ, ఆన్‌లైన్ చెల్లింపులు, షాపింగ్ వంటి అవసరాలకు ఇది ఉపయోగపడుతోంది. అయితే ఈ డెబిట్ కార్డుతో పాటు చాలా బ్యాంకులు తమ ఖాతాదారులకు ఉచితంగా జీవిత, ప్రమాద బీమా సదుపాయాన్ని కూడా అందిస్తున్నాయన్న విషయం చాలామందికి తెలియదు. అవగాహన లేకపోవడం వల్ల ఎంతోమంది ఈ ప్రయోజనాన్ని కోల్పోతున్నారు.

Debit Card Insurance: డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా.. ఎలా పొందాలంటే!
Debit Card
Prabhakar M
| Edited By: Anand T|

Updated on: Dec 16, 2025 | 9:32 AM

Share

డెబిట్ కార్డుతో అనుసంధానమైన ఈ బీమా సాధారణంగా గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీగా ఉంటుంది. ప్రమాదవశాత్తూ మరణం, శాశ్వత లేదా పాక్షిక వైకల్యం, కొన్ని సందర్భాల్లో విమాన ప్రమాదాలు, కార్డు మోసం వంటి రిస్క్‌లకు ఇది రక్షణ కల్పిస్తుంది. అయితే ఈ కవరేజ్ ఆటోమేటిక్‌గా యాక్టివ్‌గా ఉండదు. నిర్దిష్ట కాలవ్యవధిలో కనీసం ఒక లావాదేవీ అయినా చేయాల్సిందే.

రూ.50 వేల నుంచి రూ.1 కోటి వరకు కవరేజ్

డెబిట్ కార్డు బీమా కవరేజ్ మొత్తం బ్యాంక్, కార్డు రకం, ఖాతా స్వభావాన్ని బట్టి మారుతుంది. కొన్ని సాధారణ కార్డులపై రూ.50 వేల నుంచి ప్రారంభమయ్యే కవరేజ్, ప్రీమియం లేదా ప్లాటినం కార్డులపై రూ.1 కోటి వరకు కూడా ఉంటుంది. రోడ్డు, రైలు ప్రమాదాలకే కాకుండా, విమాన ప్రయాణంలో జరిగే ప్రమాదాలకు కూడా ఈ బీమా వర్తిస్తుంది. అయితే విమాన ప్రమాద కవరేజ్ కోసం టికెట్‌ను అదే డెబిట్ కార్డుతో కొనుగోలు చేయడం వంటి షరతులు ఉండొచ్చు.

లావాదేవీ తప్పనిసరి – అదే కీలకం

డెబిట్ కార్డుపై బీమా పనిచేయాలంటే లావాదేవీ షరతు అత్యంత కీలకం. ఉదాహరణకు, కొటక్ మహీంద్రా గోల్డ్, ప్లాటినం డెబిట్ కార్డులు ఉన్నవారు గత 60 రోజుల్లో కనీసం ఆరు పాయింట్ ఆఫ్ సేల్ లేదా రూ.500 విలువైన ఈ-కామర్స్ లావాదేవీలు చేసి ఉండాలి. డీబీఎస్ బ్యాంక్ ఇన్ఫినిట్ డెబిట్ కార్డుకు గత 90 రోజుల్లో కనీసం ఒక లావాదేవీ అవసరం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌లో గత 30 రోజుల్లో కనీసం ఒక పీఓఎస్ లేదా పేమెంట్ గేట్‌వే లావాదేవీ ఉండాలి. ఈ నిబంధనలు బ్యాంక్‌కు బ్యాంక్‌కు భిన్నంగా ఉంటాయి.

క్లెయిమ్ ప్రక్రియ అంత సులువు కాదు

డెబిట్ కార్డు బీమా క్లెయిమ్‌కు కొన్ని కీలక డాక్యుమెంట్లు అవసరం. నామినీ వివరాలు, బీమా క్లెయిమ్ ఫారం, కార్డుదారి డెత్ సర్టిఫికేట్, పోస్టుమార్టం రిపోర్ట్, ఎఫ్ఐఆర్ లేదా పంచనామా వంటి పత్రాలు తప్పనిసరి. ప్రమాదం జరిగిన ప్రదేశం, వాహన వివరాలు, ఫోటోలు కూడా అవసరమయ్యే సందర్భాలున్నాయి. చికిత్స పొందుతూ మరణిస్తే ఆస్పత్రి అడ్మిషన్, చికిత్స పత్రాలు సమర్పించాలి.

నామినీ వివరాలు బ్యాంక్‌కు నమోదు చేయకపోతే, వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అందించాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులు ఈ-మెయిల్ లేదా ఆన్‌లైన్ ద్వారా కూడా డాక్యుమెంట్లు స్వీకరిస్తున్నాయి. సాధారణంగా ఘటన జరిగిన 60 రోజులలోపు క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది.

శాలరీ అకౌంట్ కార్డులపై ప్రత్యేక కవరేజ్

శాలరీ అకౌంట్ ఉన్నవారికి డెబిట్ కార్డు ద్వారా అదనపు ప్రమాద బీమా సదుపాయం ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు రకాన్ని బట్టి రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డెత్ కవర్ ఇస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు కవరేజ్ అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా శాలరీ అకౌంట్ కార్డులపై రూ.2 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు బీమా సదుపాయం కల్పిస్తున్నాయి.

ముందే తెలుసుకుంటే ప్రయోజనం

డెబిట్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ తమ కార్డుకు బీమా కవరేజ్ ఉందో లేదో ముందుగానే బ్యాంక్ వద్ద తెలుసుకోవాలి. లావాదేవీ షరతులు, కాలపరిమితి, క్లెయిమ్ విధానం వంటి అంశాలపై స్పష్టత ఉండితే, ఉచితంగా లభించే ఈ బీమా రక్షణ నిజంగా ఉపయోగపడుతుంది. చిన్న జాగ్రత్త, సరైన అవగాహన మీ కుటుంబానికి పెద్ద భరోసాగా మారుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.