Telangana: బీఆర్‌ఎస్, బీఎస్పీ ఉమ్మడి అభ్యర్థిగా RS ప్రవీణ్ కుమార్ పోటీ చేసే స్థానం ఇదే..!
లోక్ సభ ఎన్నికల వేల తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఊహించని విధంగా బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు పొడుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నటికీ అప్పుడే పోటీ చేసే స్థానాలపై పలు ప్రచారాలు జరుగుతున్నాయి. పొత్తు కుదిరితే బీఎస్పీ అధ్యక్షులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కి కేటాయించబోయే స్థానం ఇదేనంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఇంతకీ ప్రవీణ్ పోటీ చేయబోయే ఆ సీటేంటి?
పార్లమెంట్ ఎన్నికల ముందు ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. తాజాగా పొడిచిన బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్ స్థానం బీఎస్పీకి కేటాయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. నాగర్ కర్నూల్ స్థానం నుంచి పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉన్నా లేకున్నా నాగర్‌కర్నూల్ నుంచే పోటీ చేయాలని ప్రవీణ్ కుమార్ ముందుగానే నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఆయన క్షేత్ర స్థాయిలో పని కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. ఇప్పుడు కారు పార్టీతో పొత్తు కలిసివస్తుందనే భావనలో ఉన్నారట ఆర్‌ఎస్ ప్రవీణ్.
మొదట్లో గువ్వల బాలరాజు పేరు పరిశీలన
నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు బీజేపీ తీర్థం పుచ్చుకుని.. ఆయన తనయుడిని బరిలోకి దింపారు. దీంతో బీఆర్‌ఎస్ నుంచి ఈ సారి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరును పార్టీ అధిష్ఠానం పరిశీలించింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో సైతం ఆయన పేరును సూచనప్రాయంగా ప్రకటించారట పార్టీ అధినేత కేసీఆర్. అయితే బహుజన సమాజ్ వాదీ పార్టీతో పొత్తు కుదరడంతో ఈ సీటుకు వదులుకునే ఆలోచనలో ఉంది కారు పార్టీ.
చర్చలు సఫలం అయితే నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో ఉండబోతున్నారని జోరుగు ప్రచారం జరుగుతోంది. నాగర్ కర్నూల్ సిట్టింగ్ సీటు కావడంతో పార్టీ ఓట్లతో పాటు.. దళిత ఓట్లు కలిసి వస్తాయని.. పొత్తులో భాగంగా గెలుపు లాంఛనమే అని బీఆర్‌ఎస్, బీఎస్పీ భావిస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..