సర్ఫరాజ్ ఖాన్‌కు అండగా ముంబై క్రికెట్.. అగార్కర్‌తో యుద్ధానికి సై అంటోన్న అజింక్య రహానే
సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై కొంతకాలంగా విమర్శలు వస్తున్నప్పటికీ, రహానే చేసిన ఈ తాజా వ్యాఖ్యలు సెలక్షన్ కమిటీపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. 'ముంబై క్రికెట్ సర్ఫరాజ్ ఖాన్ వెనుక ఉంది' అని రహానే అనడం, తన పాత సహచరుడు, ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగార్కర్‌కు పరోక్షంగా హెచ్చరిక పంపినట్టుగా క్రికెట్ పండితులు భావిస్తున్నారు.

Ajinkya Rahane vs Ajit Agarkar: టీమిండియా టెస్ట్ జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశ క్రికెట్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. రంజీ ట్రోఫీలో గత కొన్ని సీజన్లలో స్థిరంగా పరుగులు సాధిస్తూ, అద్భుతమైన ఫస్ట్-క్లాస్ సగటును (65+ యావరేజ్) కొనసాగిస్తున్నప్పటికీ, సర్ఫరాజ్ ఖాన్‌ను జాతీయ జట్టులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ ఈ విషయమై సరైన వివరణ ఇవ్వలేదని ముంబై క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సందర్భంలో, ముంబై జట్టు తరపున ఆడుతున్న సీనియర్ ఆటగాడు అజింక్య రహానే, సర్‌ఫరాజ్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు.
రహానే మాటల సారాంశం..
“సర్ఫరాజ్ ఖాన్ వెనుక ముంబై క్రికెట్ మొత్తం ఉంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా ఆడుతున్న ఆటగాళ్లకు జాతీయ జట్టులోకి అవకాశం దక్కాలి. ముంబై ఆటగాళ్లు అత్యున్నత స్థాయిలో ఆడాలని మేం కోరుకుంటున్నాం” అంటూ రహానే చెప్పుకొచ్చాడు.
తన విషయంలోనూ సెలెక్టర్ల నుంచి ఎలాంటి సంభాషణ లేదని రహానే ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవం గల ఆటగాళ్లను తప్పించినప్పుడు, దానికి గల కారణాలను వారికి తెలియజేయాల్సిన బాధ్యత సెలెక్టర్లపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
క్రికెట్‌లో వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని రహానే అన్నారు. రెడ్-బాల్ (టెస్ట్) క్రికెట్‌పై మక్కువ, నిబద్ధత ముఖ్యం కానీ, ఆటగాడి వయసు కాదన్నారు. మైఖేల్ హస్సీ వంటి ఆటగాళ్లను ఉదహరిస్తూ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు జాతీయ జట్టులో ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని రహానే అభిప్రాయపడ్డారు.
అగార్కర్‌పై ‘యుద్ధానికి సిద్ధమా’..?
సర్ఫరాజ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై కొంతకాలంగా విమర్శలు వస్తున్నప్పటికీ, రహానే చేసిన ఈ తాజా వ్యాఖ్యలు సెలక్షన్ కమిటీపై మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. ‘ముంబై క్రికెట్ సర్ఫరాజ్ ఖాన్ వెనుక ఉంది’ అని రహానే అనడం, తన పాత సహచరుడు, ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ అయిన అజిత్ అగార్కర్‌కు పరోక్షంగా హెచ్చరిక పంపినట్టుగా క్రికెట్ పండితులు భావిస్తున్నారు. ఈ పరిణామం ముంబై క్రికెట్‌లో రహానే వర్సెస్ అగార్కర్ అనే ఒక అంతర్గత చర్చకు తెర లేపింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








