Andhra News: భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహంతో..
అనుమానం ఓ పచ్చని కాపురంలో చిచ్చపెట్టింది. అప్పటి వరకు అనందంగా ఉన్న ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఈ అనుమానంతోనే ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆపైన ఏం చేయాలో తెలియక మృతదేహాన్ని బైకుపై పెట్టుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్ళాడు. భార్యను హత్య చేసిన విషయాన్ని చెప్పి అరెస్టు చేయమని వేడుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అనుమానంతో భార్యను హత్య చేసిన ఒక వ్యక్తి ఆమె మృతదేమాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన ఘటన బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఏల్చూరుకు చెందిన వెంకటేష్ కు పదేళ్ళ క్రితం పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరం కు చెందిన మహాలక్ష్మీతో వివాహం అయింది. వీరికి ఇద్దరు సంతానం. ఆరు నెలల కిందట భార్యాభర్తలు మధ్య గొడవలు జరిగాయి. దీంతో మహాలక్ష్మీ పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వెంకటేష్ రెండు రోజుల క్రితం మాచవరం వచ్చాడు.
భార్యతో మాట్లాడి కూతురు బంగారు ఆభరణాలు తీసుకెళ్ళడానికి తనతో ఏల్చూరు రావాలని భార్యను అడిగాడు. అందుకు సమ్మతించిన మహాలక్ష్మీ.. భర్త వెంకటేష్ తో కలిసి బైక్ పై ఏల్చూరు బయలు దేరింది. కొంతదూరం వెళ్ళిన తర్వాత ఆమెతో వెంకటేష్ ఘర్షణ పడ్డాడు. అనంతరం చలికోటు లేస్ తో ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. ఏం చేయాలో తెలియక మృతదేహంతో నేరుగా బాపట్ల జిల్లా సంతమాగులూరు పిఎస్ కు వెళ్ళాడు.
తన భార్యను హత్య చేసి మృతదేహంతో స్టేషన్ కు వచ్చినట్లు చెప్పాడు. దీంతో కంగుతిన్న పోలీసులు వెంటనే వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని రొంపిచర్ల పోలీసులకు చెప్పారు. రొంపిచర్ల పోలీసులు వెంటనే సంతమాగులూరు వెళ్ళి మహాలక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్కడ నుండి నర్సరావుపేట పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాధమికంగా అనుమానంతోనే భార్యను హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




