సంక్రాంతి
హిందువులు ముఖ్యంగా తెలుగువారు జరుపుకునే పండగలలో అతి పెద్ద పండగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమలతో పాటు కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమ అంటూ నాలుగు రోజుల పాటు ఈ పండగను జరుపుకుంటారు. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజుని మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. ఈ మూడు రోజుల్లో మొదటి పండగ భోగి, భోగ భాగ్యాలను ఇవ్వమంటూ కోరుకోవడమే కాదు.. చెడుని విడిచి మంచిగా బతకమని సూచిస్తూ భోగి మంటలు వేస్తారు. రెండో రోజు సంక్రాంతిపండగను పెద్దల పండగగా, తమ ఇంటికి ధాన్యం చేరుకున్నందుకు ఆనందంతో కొత్త బియ్యంతో పాయసం చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. మూడో రోజు కనుమ ఇది రైతుల పండగ.. పశువులను పూజిస్తారు. ధనుర్మాసం మొదలు నెల రోజులపాటు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, బుడబుక్కలవారు, గంగిరెద్దులు ఇలా వీధుల్లో సందడి చేస్తుంటాయి. ధనుర్మాస ముగింపును గుర్తు చేస్తూ మకర సంక్రాంతి పండుగ వస్తుంది. కొత్త సంవత్సరంలో జరుపుకునే మొదటి పండగ భోగి పండగ జనవరి 13వ తేదీన, సంక్రాంతిని 14 వ తేదీన , కనుమను 15 వ తేదీన జరుపుకోనున్నారు. ఇప్పటికే పల్లెల్లో సంక్రాంతి సందడి మొదలైంది.