Modi Government: మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉపాధి హామీ పథకం రద్దు..!
Upadi Hami Pathakam: మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేేసేందుకు రెడీ అయింది. దీని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఇటీవల ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త బిల్లు తీసుకురానుండటం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయనుందని సమాచారం. దీని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. ఉపాధి హామీ చట్టం స్థానంలో వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్) (VB-G RAM G) బిల్లును తీసుకురానుంది. దీనికి సంబంధించిన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆమోదించనుందని తెలుస్తోంది. సోమవారం ఈ బిల్లు కాపీలను లోక్‌సభ సభ్యులకు అధికారులు అందించినట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు అమలవుతున్న మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం ఇక రద్దు కానుంది. దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అమలు చేయనున్నారని తెలుస్తోంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు
డిసెంబర్ 1వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవ్వగా.. ఈ నెల 19వ తేదీ వరకు జరగనున్నాయి. లోక్‌సభ ఎంపీల కాపీలను అందించడంతో ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఉపాధి హామీ పథకంలో కేంద్రం ఇటీవల భారీ మార్పులు చేసిన విషయం తెలిసిందే. పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్ గార్ యోజనగా మారుస్తూ కేంద్రం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా పనిదినాల సంఖ్యను కూడా పెంచింది. గతంలో ఏడాదిలో 100 పనిదినాలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు వాటిని 120 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక కనీస వేతనాన్ని కూడా రూ.250కు పెంచింది. ఈ క్రమంలో ఇప్పుడు మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకురానున్నారు.
2005లో ఉపాధి హామీ చట్టం
2005వ సంవత్సరంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఎన్ఆర్‌ఈజీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత 2009లో దీని పేరు మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టంగా మార్చారు. అప్పటినుంచి అదే పేరుతో కొనసాగుతుండగా.. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకొస్తుంది. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు సంవత్సరంలో 100రోజులు పని కల్పిస్తున్నారు. దీని వల్ల ఎంతోమంది ప్రజలకు ఉపాధి లభిస్తుంది. ఆర్ధికంగా కూడా గ్రామీణ ప్రజలకు ఈ పథకం ఉపయోగపడుతుంది. దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఉపాధి హామీ కార్డు పొంది ఉన్నారు.




