ఏంట్రా ఇది.. మసాజ్ చేస్తానని భార్య కాళ్లు పట్టుకున్నాడు.. ఆ తర్వాత పాముతో..
దేశంలో మరో సంచలన హత్య వెలుగులోకి వచ్చింది. అతి క్రూరంగా భార్యను విష సర్పంతో కాటు వేయించిన భర్త దుర్మార్గానికి సంబంధించిన కథనం ఇది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. అసలేంటి.. ఎందుకు కట్టుకున్న భర్తే భార్యను అత్యంత దారుణంగా చంపాల్సి వచ్చింది.. మొదలైన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ముంబై మహానగరం సమీపంలోని బడ్లాపూర్‌లో ఈ సంచలన హత్య కేసు వెలుగు చూసింది. భర్తే భార్యను విష సర్పంతో కాటేయించి హత్య చేశాడు. మూడేళ్ల క్రితం సహజ మరణంగా భావించిన ఈ కేసు ఆ తర్వాత జరిపిన విచారణలో అత్యంత భయంకరమైన, కుట్రపూరిత హత్యగా తేలింది. హత్య చేయబడిన మహిళ కూడా సాదాసీదాగా అనుకోవడానికి లేదు.. తను ఓ రాజకీయ పార్టీకి చెందిన ఉన్నత స్థాయిలో ఉన్న మహిళ. స్థానిక కాంగ్రెస్ పార్టీ మహిళా నేత నీర్జా ఆంబేకర్ మరణం పాము కాటుతో జరిగిందని గతంలో అంతా నమ్మారు.. జరిగింది కూడా ఇదేనంటూ నిజాన్ని అందరూ మర్చిపోయారు. కానీ, ఇది ఇప్పుడు సాధారణ ప్రమాదం కాదు.. పక్కా ప్రణాళికతో చేసిన హత్య అని సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఈ హత్యకు మాస్టర్‌మైండ్ ఎవరో కాదు.. స్వయానా నీర్జా భర్త రూపేశ్ ఆంబేకరే అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
ఈ ఘటనకు సంబంధించి అంబర్నాథ్ ఏసీపీ శైలేష్ కాలే వివరాలు తెలియజేశారు. 2022లో బడ్లాపూర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా నేత నీర్జా ఆంబేకర్ అకస్మాత్తుగా మృతి చెందారు. డాక్టర్లు పాము కాటు వల్ల జరిగిన మరణమని నిర్ధారించగా, పోలీసులు అప్పట్లో కేవలం ఏడీఆర్ నమోదు చేసి కేసును ముగించారు. కానీ, మూడేళ్ల తర్వాత ఈ కేసులో చోటు చేసుకున్న పరిణామాల ద్వారా పోలీసులకు సంచలన నిజాలు తెలిశాయి. ఇటీవల బడ్లాపూర్‌లో మరో హత్యాయత్నం కేసులో పోలీసులు నిందితుడు ఋషికేష్ చాళ్కేను అరెస్టు చేశారు. విచారణలో పాత నేరాలపై కఠినంగా ప్రశ్నించగా, అతడు నీర్జా ఆంబేకర్ హత్య రహస్యాన్ని బయటపెట్టినట్లు ఏసీపీ శైలేష్ కాలే వెల్లడించారు.
ఇదంతా ఇలా ఉండగా.. నీర్జా హత్యను ఆమె భర్త రూపేశ్ ఆంబేకర్ తన ముగ్గురు సహచరులు చేతన్ దుధానే, కునాల్ చౌధరీ, ఋషికేష్ చాళ్కేతో కలిసి చేయించినట్లు అంగీకరించాడు. హత్యను సహజ మరణంలా చూపించేందుకు నిందితులు అత్యంత భయంకరమైన మార్గాన్ని ఎంచుకున్నారు. వాళ్లు హత్యను అమలు చేశారో తెలుసుకున్నాక పోలీసులు కూడా షాక్‌కు గురయ్యారు. పక్కా ప్లాన్ ప్రకారం.. ముందే ఓ విష సర్పాన్ని బస్తాలో దాచి తెచ్చి నీర్జా ఇంటి వంటగదికి తీసుకువచ్చారు. అదే మంచి సమయంగా చూసుకుని భార్య కాళ్లు మర్దన, మసాజ్ చేస్తాననే నెపంతో నీర్జాను రూపేశ్ హాల్‌లో పడుకోబెట్టాడు. తనకు ఈ హత్యలో సహకరించిన మిత్రుడు చేతన్ దుధానే బస్తా నుంచి పామును తీసి ఋషికేష్ చాళ్కే అనే మరో వ్యక్తికి ఇచ్చారు. ఆ తర్వాత నీర్జా ఎడమ కాలి మడమ వద్ద పాముతో మూడు సార్లు బలవంతంగా కాటు వేయించారు. హత్య అనంతరం ఈ ఘటనను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. నీర్జా మృతదేహానికి ఎలాంటి పోస్టుమార్టం జరగలేదు. దీంతో భర్త రూపేశ్ వాంగ్మూలం ప్రకారం.. కేవలం ఇది సహజ మరణంగానే భావించి, ఏడీఆర్ నమోదు చేసి కేసును అప్పట్లో మూసివేశారు.
ఇదే విషయాన్ని ఏసీపీ శైలేష్ కాలే వివరిస్తూ.. ‘బడ్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2022 సంవత్సరంలో ఒక ఆకస్మిక మరణం రిపోర్ట్ నమోదైంది. ఆ కేసులో నీర్జా అనే మహిళ మృతి చెందినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో పాము కాటు వల్లే ఆమె మరణించిందని నిర్ధారణ కావడంతో వైద్యులు కూడా రిపోర్ట్ అదే విధంగా ఇవ్వడంతో మేం దర్యాప్తును అంతటితో ముగించాం. కానీ, ఇటీవల నీర్జా మరణం సహజమైనది కాదని, ఇది ముందస్తు పథకం ప్రకారం చేసిన హత్య అని సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గత ఆరు నెలలుగా ఈ కేసుపై లోతైన దర్యాప్తు చేపట్టాం. ఈ క్రమంలో 109 BNS సెక్షన్ కింద ఒక నిందితుడిని అరెస్టు కూడా చేశాం. విచారణలో అతడు, ఇతర సహచరులతో కలిసి నీర్జాను అత్యంత దారుణంగా ఎలా హత్య చేశారనే పూర్తి వివరాలు వెల్లడించాడు. దాంతో ఈ హత్యలో నీర్జా భర్త రూపేశ్ ప్రధాన పాత్రధారుడు అని స్పష్టమైంది. ఆ వివరాల ఆధారంగా మిగతా నిందితులందరినీ కూడా అరెస్టు చేయడం జరిగింది’ అని ఏసీపీ శైలేష్ కాలే మీడియాకు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




