Hyderabad: ఆ ఇంటి తలుపు తీసి ఉంది.. గుట్టుగా నలుగురు వ్యక్తులు దూరారు.. ఆపై కాసేపటికి చేతిలో..!
దొంగతనం చేస్తే కోట్లు విలువ చేసే ఏ బంగారు ఆభరణాలో, డబ్బో దోచుకెళ్తారు.. లేదా గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోని విలువైన వస్తువులను ఎత్తుకెళ్తారు. కానీ, ఈ పిల్లిని దొంగిలించడం ఏంటి వింతగా అనుకుంటున్నారా? పిల్లితో ఏం ఉపయోగం ఉంటుంది దండగ అని అలా కొట్టిపారేస్తున్నారా? పిల్లిని దొంగతనం చేసి తీసుకెళ్లారు అంటే మీరే కాదు..

హైదరాబాద్ నగరం పాతబస్తీలోని సిటీ కాలేజ్, హుస్సేన్ ఆలం మధ్య ప్రాంతంలో పిల్లిని దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో సుమారు రూ.25,000 విలువ చేసే ఓ పిల్లి దొంగతనానికి గురైంది. ఏంటీ.! పిల్లి విలువ రూ.25 వేలా?.. అందుకే ఆ దొంగ పథకం వేసి మరీ పిల్లిని దొంగిలించి తీసుకెళ్లాడా అని జరిగింది తెలుసుకుని ఆశ్చర్యపోతారు. చుట్టూ జనంతో రద్దీగా ఉన్న ఆ ప్రాంతంలో ఓ ఇద్దరు బైక్ పై వచ్చారు. అటు ఇటు చూసి తమని ఎవరైనా గమనిస్తున్నారా అని జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ ఇంట్లోకి దూరిపోయారు. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి చేతిలో పిల్లిని ఉంచుకుని, ఏమీ ఎరుగనట్లు చాలా నింపాదిగా ఇంటి నుంచి బయటికి వచ్చాడు. కాస్త ముందు వరకూ అలాగే పిల్లిని చంకలో పెట్టుకుని దారి వెంట నడుస్తూ మెల్లగా జారుకున్నాడు. అక్కడే చుట్టుపక్కల ఉన్నవాళ్లు అసలు దీనిని పెద్దగా గుర్తించకపోవడంతో తన పని సవ్యంగా జరిగిపోయిందన్నట్లు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
అయితే.. రూ.25 వేల వరకు విలువ చేసే ఆ పిల్లి నాలుగు చిన్న పిల్లలకు తల్లి అని, అవి ఇంకా పాలు తాగే వయసులోనే ఉన్నాయని తెలిసింది. పిల్లి యజమానులు చెప్పిన వివరాల ప్రకారం.. టోపీ ధరించిన ఓ వ్యక్తి ఆ పిల్లిని ఇంటి బయట నుంచి దొంగిలించి తీసుకెళ్లాడు. మూగజీవాల పట్ల కనీస కనికరం లేకుండా ఇలా దొంగతనానికి పాల్పడేవారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఇష్టారీతిన జంతువులను, చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠాల ప్రవర్తన మానవత్వానికి మచ్చలా మిగులుతుందంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి, నిందితులను పట్టుకోవాలని పిల్లి యజమానులు, స్థానికులు పోలీసులను కోరుతున్నారు. టోపీ ధరించిన ఆ వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం ఉంటే దయచేసి సమీప పోలీస్ స్టేషన్‌లో తెలియజేయాలని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..








