Srikanth Iyengar: గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. మరో వీడియో రిలీజ్ చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) సభ్యుడు, ప్రముఖ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల జాతిపిత మహాత్మాగాంధీని దూషిస్తూ ఈ నటుడు రిలీజ్ చేసిన తీవ్ర దుమారం రేపింది. ఈ వివాదం కొనసాగుతుండగానే మరో వీడియో రిలీజ్ చేశాడు శ్రీకాంత్.

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. స్వాతంత్రం గాంధీ తీసుకురాలేదు’ అంటూ అతను రిలీజ్ చేసిన వీడియోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయానికి సంబంధించి శ్రీకాంత్ పై కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణును కలిసి శ్రీకాంత్ సభ్యత్వం రద్దు చేయాలంటూ ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు ఈ వ్యవహారంతో శ్రీకాంత్ నటించిన సినిమాలకు నిరసన సెగ తగులుతోంది. ఇటీవల శ్రీకాంత్ నటించిన అరి సినిమాను ప్రదర్శించొద్దంటూ థియేటర్ల వద్ద ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు దిగివచ్చిన శ్రీకాంత్ క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు.
‘నేను చేసిన వ్యాఖ్యలతో ఎంతో మంది బాధపడ్డారని తెలిసింది. వారందరినీ నేను క్షమించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. స్వాతంత్ర్య పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు విడిచారు కదా.. వారందరినీ గుర్తుంచుకోవాల్సిన అవసరం మనకి ఉంది. భవిష్యత్తులో ఇలాంటివి మనల్ని విడదీయకుండా నేను చూసుకుంటాను. దేశాభివృద్ధిలో మనమంతా కలిసి ముందుకు సాగుదాం’ అంటూ వీడియోలో చెప్పుకొచ్చారు. మరి శ్రీకాంత్ క్షమాపణలతో ఈ వివాదం సద్దుమణుగుతుందేమో చూడాలి.
శ్రీకాంత్ అయ్యంగార్ రిలీజ్ చేసిన వీడియో..
View this post on Instagram
గతంలోనూ వివాదాలే..
శ్రీకాంత్ అయ్యంగార్ మంచి నటుడు.. అందులో డౌటేమీ అక్కర్లేదు. ఎటొచ్చి తన ప్రవర్తనతోనే తరచూ వివాదాలు కొని తెచ్చుకుంటున్నాడు. ఆ మధ్యన సినిమా రివ్యూ రైటర్లు, ఫిల్మ్ జర్నలిస్టులను నోటికొచ్చినట్లు తిట్టాడు. బాత్‌రూమ్‌లోని క్రిముల కంటే నీచమైన వాళ్లంటూ నీచంగా కామెంట్స్ చేశాడు. అంతుకు ముందు కూడా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు. ఓ సందర్భంలో విజయవాడకు వెళ్లిన శ్రీకాంత్ బూమ్ బూమ్ బీర్లపై వ్యగ్యంగా వీడియో చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. అప్పుడు వైసీపీ అభిమానులు కూడా శ్రీకాంత్ కు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ గాంధీజీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పుడు అతను క్షమాపణలు చెప్పినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలాగే వివాదాల్లో నిలిస్తే శ్రీకాంత్ ను సినిమాల్లోకి తీసుకునేందుకు కూడా చాలా మంది ఆలోచిస్తారు. గతంలో ఎంతో మంది నటుల విషయంలోనూ ఇది నిరూపితమైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








