AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక క్యూలో నిల్చునే పనిలేదు.. ఒక్క బుకింగ్‌తో ఇంటికే యూరియా!

తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రైతులు యూరియా కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, ఇంటి నుంచే ముందుగానే యూరియా బుక్ చేసుకునే సౌకర్యాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ అందుబాటులోకి తీసుకురానుంది. రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, ఎరువుల పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడించారు. ఈ యాప్‌ను ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక క్యూలో నిల్చునే పనిలేదు.. ఒక్క బుకింగ్‌తో ఇంటికే యూరియా!
Prabhakar M
| Edited By: |

Updated on: Dec 15, 2025 | 7:08 PM

Share

రబీ ముందస్తు ప్రణాళికపై రాష్ట్ర, జిల్లా వ్యవసాయ ,ఉద్యానశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా యూరియా అధిక వినియోగం వల్ల జరుగుతున్న నష్టాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాలని, పంట కోత తర్వాత అవశేషాలను కాల్చడం వల్ల పర్యావరణం, భూమి సారంపై కలిగే దుష్పరిణామాలను రైతులకు వివరించాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వ్యవసాయ, ఉద్యాన, కోఆపరేటివ్ శాఖల అధికారులు సమన్వయంతో ఒక టీమ్‌లా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.

రైతుల విలువైన సమయం వృథా కాకుండా ఉండేందుకు, కేవలం ఎరువుల పంపిణీ కోసం ఈ కొత్త మొబైల్ యాప్‌ను తీసుకువస్తున్నట్టు మంత్రి తెలిపారు. యాప్ ద్వారా రైతులు తమకు సమీపంలోని డీలర్ వద్ద మాత్రమే కాకుండా, జిల్లా పరిధిలోని ఇతర డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ లభ్యతను కూడా తెలుసుకోవచ్చు. అవసరమైన యూరియా పరిమాణాన్ని తమకు అనుకూలమైన డీలర్ వద్ద నుంచే ముందుగా బుక్ చేసుకునే అవకాశం ఈ యాప్‌లో కల్పించనున్నారు.

యూరియా బుకింగ్ చేసిన తర్వాత రైతుకు ప్రత్యేక బుకింగ్ ఐడీ అందుతుంది. ఆ బుకింగ్ ఐడీ ఆధారంగానే డీలర్ యూరియాను విక్రయించాల్సి ఉంటుంది. రైతు లేదా అతని ప్రతినిధి వద్ద ఉన్న బుకింగ్ ఐడీ, బుక్ చేసిన పరిమాణాన్ని ధృవీకరించిన తర్వాత మాత్రమే యూరియా ఇవ్వాలని డీలర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.

బుకింగ్ సమయంలో రైతు పంట పేరు, సాగు విస్తీర్ణం మాత్రమే నమోదు చేస్తే సరిపోతుంది. నమోదు చేసిన వివరాల ఆధారంగా వ్యవస్థ స్వయంచాలకంగా రైతుకు అర్హమైన మొత్తం యూరియా పరిమాణాన్ని లెక్కిస్తుంది. అలాగే, 15 రోజుల వ్యవధిలో ఒకటి నుంచి నాలుగు దశలుగా యూరియా అందుకునే విధంగా యాప్‌లో వివరాలు కనిపిస్తాయి. ఎలాంటి సమస్యలు ఎదురైనా పరిష్కరించేందుకు హెల్ప్‌లైన్ నంబర్లతో కూడిన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచనున్నట్టు మంత్రి తెలిపారు.

పాస్‌బుక్ లేని రైతులు ఆధార్ ఆధారంగా నమోదు చేసుకునే అవకాశం ఉండగా, కౌలు రైతులకు కూడా యాప్‌లో ప్రత్యేక సౌకర్యం కల్పించారు. కౌలు రైతులు తమ వివరాలు నమోదు చేసి, భూ యజమాని ఆధార్ ధృవీకరణతో యూరియా బుకింగ్ చేసుకునే వీలుంటుంది. అవసరమైతే, యూరియా బుకింగ్ కోసం సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) సేవలను కూడా వినియోగించుకోవచ్చని మంత్రి తెలిపారు.

యూరియా పక్కదారి పట్టకుండా, నిజంగా పంట పండించే రైతులకు మాత్రమే ఎరువులు అందించడమే ఈ యాప్ లక్ష్యమని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. దేశంలో యూరియా అధిక వినియోగం జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని పేర్కొన్న ఆయన, యూరియా వాడకం వల్ల కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించడం అధికారుల బాధ్యత అని అన్నారు. ఇందుకోసం అధికారులు గ్రామస్థాయిలో విస్తృత పర్యటనలు నిర్వహించాలని సూచించారు.

అలాగే ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాల్సిన అవసరాన్ని మంత్రి మరోసారి గుర్తు చేశారు. ఈ దిశగా అధికారులు ప్రత్యేక కృషి చేయాలని, రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధికి అందరూ కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.