Venkaiah Naidu: నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని.. ఇకపై ఇక్కడే ఉంటాను.. వెంకయ్య నాయుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది. సోమవారం (డిసెంబర్ 15) హైదరాబాద్ లోని రవీంద్ర భారతి వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎప్పటిలాగే ఉత్తేజభరిత ప్రసంగం ఇచ్చారు.

తెలుగు సంగీత ప్రపంచానికి చిరస్మరణీయుడైన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ రవీంద్ర భారతి ప్రాంగణంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్ బాబు, ప్రముఖ సినీ కళాకారులు హాజరై కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా నిలిపారు. విగ్రహావిష్కరణ అనంతరం మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు నెల్లూరు తో ఉన్న అనుబంధం చెప్పే క్రమంలో “నేను అప్పుడు నెల్లూరు వాణ్ని, ఇప్పుడు తెలంగాణ వాణ్ని. ఇక్కడ ఉంటున్నాను కాబట్టి తెలంగాణ వాణ్నే. ఇకపై ఇక్కడే ఉంటాను కూడా” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. భాష, సంస్కృతి గురించి మాట్లాడిన వెంకయ్య నాయుడు, బ్రిటిష్ పాలనలో ఇంగ్లీష్ మనపై రుద్దబడిందని చెప్పారు. ‘మమ్మీ–డాడీ కల్చర్ వదిలేయాలి. అమ్మ–నాన్న అనే మాటలను అలవాటు చేసుకోవాలి. మన భాషను మనమే ప్రమోట్ చేయాలి’ అంటూ పిలుపునిచ్చారు.
ఇదే కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని అన్నారు. బాలు చిన్ననాటి మిత్రుడు జీవి మురళిని మంత్రి శ్రీధర్ బాబు సన్మానించారు. అలాగే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని రూపొందించిన శిల్పి వడయార్‌ను కూడా ఘనంగా సన్మానించారు. సంగీతం, సంస్కృతి, భాష పట్ల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చూపిన అంకితభావాన్ని ఈ విగ్రహం ఎప్పటికీ గుర్తు చేస్తుందని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రవీంద్ర భారతి వేదికగా జరిగిన ఈ కార్యక్రమం సంగీతాభిమానులకు భావోద్వేగ క్షణాలను అందించింది.








