Lionel Messi: మీకిది తెలుసా..? మెస్సి ఎడమకాలికి రూ. 8వేల కోట్ల ఇన్సూరెన్స్
భారత్‌లో మెస్సీ టూర్ నేటితో ముగుస్తుంది. పశ్చిమ్ బెంగాల్‌లోని హుగ్లీకి చెందిన మెస్సీ టూర్‌ను భారత్ లో నిర్వహించారు. అయితే ఈ టూర్‌లో ఒక్క సీరియస్ మ్యాచ్ కూడా ఎందుకు ఆడలేదు. దీని వెనుక కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు ... ...

ప్రపంచ ఫుట్‌బాల్ మెజీషియన్ లియోనల్ మెస్సీ మనూరికి రానే వచ్చారు. పోనూ పోయారు. కోల్‌కతాలో గ్రౌండ్‌లోకే దిగలేదని ఫ్యాన్స్ ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యారో చూశారుగా? మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో చిన్నపిల్లలాడిన ఓ ఆషామాషీ గేమ్‌లో ఆఖరి ఐదునిమిషాలూ కనిపించి, ఓ పెనాల్టీ కార్నర్ కొట్టి వెళ్లిపోయాడు. తర్వాత ముంబై వాంఖెడే స్టేడియంలో సచిన్‌తో కాసేపు కనిపించి జెర్సీ తీసుకుని వెళ్లిపోయారు. సోమవారం ఢిల్లీలో తాజ్‌మహల్ సందర్శించి మోదీతో భేటీ ఔతారు.. తిరిగి అర్జెంటీనాకు వెళ్లిపోతారు. మీరు గమనించారా.. గోట్ టూర్ పేరుతో ఇండియా మొత్తం ఓ రౌండేసిన మెస్సీ సీరియస్‌గా ఒక్క గేమ్ ఐనా ఆడారా?నోవే. తమ ఆరాధ్య ఆటగాడి ఫుట్‌వర్క్‌ని తనివితీరా చూద్దామని ఆశపడ్డ ఫ్యాన్స్‌కి నిరాశే మిగిలింది. మెస్సీ ఇండియాలో మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉందట. అదేంటంటే, మెస్సీ ఎడమ కాలుకు 8వేల కోట్ల ఇన్సూరెన్స్ చేయించడమే.
అమెరికాకు చెందిన మేజర్ సాకర్ క్లబ్ ఇంటర్‌మియామీ మెస్సీని అడాప్ట్ చేసుకుంది. అలాగని మిగతా క్లబ్‌లకు ఆడకూడదని కఠినమైన రూలేమీ లేదు. విషయం ఏంటంటే, అతడి ఎడమకాలుని ఇన్సూర్ చేసుకున్న కంపెనీ రూల్స్ ప్రకారం, మిగతా దేశాల్లో మ్యాచ్‌లు ఆడి ఏదైనా జరిగితే క్లెయిమ్ ఇవ్వరు. ఆ 8 వేల కోట్ల రూపాయలూ పోయినట్టే. అందుకేనేమో, ఇండియాలో ఉన్నంతవరకూ తన ఎడమ కాలుని చాలా భద్రంగా కాపాడుకుంటున్నారు లియోనల్ మెస్సీ.
మెస్సీ మాత్రమే కాదు, స్పోర్ట్స్ అండ్ గ్లామర్ ప్రపంచంలో సెలబ్రిటీలెవరైనా అంతే. ముందు స్పేర్స్ ఆ తర్వాతే స్పోర్ట్స్. కళ్ళకి, కాళ్ళకి, పళ్ళకి, నవ్వుకి, నాలుక మీద ఉండే టేస్టింగ్ బడ్స్‌కు, చివరకు టెస్టికల్స్‌కి సైతం ఇన్సూరెన్స్ చేయించుకుని భద్రపర్చుకుంటారన్నది ఒక ఓపెన్ సీక్రెట్. గ్లామర్ ఇండస్ట్రీలో కొందరికి స్మైల్ ముఖ్యం.. మరికొందరికి వాయిస్ ఇంపార్టెంట్. తమ బాడీ పార్ట్స్‌ని, ఫేస్ వ్యాల్యూని కాపాడుకోవడానికి లైఫ్‌టైమ్ అంతా కష్టపడతారు. ఏదైనా అనుకోని పరిణామం జరిగి వాటికేదైనా ప్రమాదం వాటిల్లితే ఇంకేముంది మొత్తానికే ఖల్లాస్.
బాలీవుడ్ దేశీగర్ల్ ప్రియాంక చోప్రాను మిలియన్ డాలర్ స్మైలీ అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? తన నేచురల్ పౌటీ స్మైల్‌కు కాపీరైట్ తీసుకున్నారు. ఎవరైనా సర్జరీ ద్వారా ఆమెలాంటి స్మైల్ పొందేందుకు ప్రయత్నిస్తే ఆమెకు భారీ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్ వాయిస్‌కి ఇంటర్నేషనల్ రేంజ్‌లో గుర్తింపుంది. కానీ, ఆయన గొంతుకను ఓ గుట్కా కంపెనీ ప్రమోషన్ యాడ్‌లో ఇమిటేట్ చేశారు. దీంతో ఎలర్టయిన బిగ్‌బీ తన వాయిస్‌కు కాపీరైట్ తీసుకున్నారు. ఆ మాటకొస్తే, రజనీకాంత్ వాయిస్‌కీ, సన్నీ డియోల్ డైలాగ్ స్టైల్‌కీ, ఐశ్వర్య రాయ్ కళ్లకీ కూడా ఇన్సూరెన్స్ ఉంది.
బాలీవుడ్ హ్యాండ్‌సమ్ హంక్ – జాన్ అబ్రహం… ఫిట్‌నెస్ విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉంటారు. అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు పోటీపడి ఆయన పటిష్టమైన పిరుదుల్ని 10 కోట్ల రూపాయలకు బీమా చేయించుకున్నాయి.టెన్నిస్ సంచలనం సానియా మిర్జా తన చేతుల్ని మా దగ్గరే ఇన్సూర్ చేయించుకుంది… అంటూ ఓ పేరుమోసిన బీమా సంస్థ ఓపెన్ స్టేట్‌మెంటే ఇచ్చింది.
అమెరికాకు చెందిన ఫెర్రెరా.. ఆక్వాఫ్రెష్ టూత్‌పేస్ట్ యాడ్‌తో వరల్డ్ ఫేమస్ ఐంది. తెల్లటి మెరిసే దంతాల్ని పది మిలియన్ డాలర్లకు బీమా చేయించుకుందామె. మన ప్రియాంకా చోప్రా నవ్వుకొచ్చే క్లెయిమ్ కూడా 10 మిలియన్ డాలర్లు. కిమ్ కార్దర్సన్ నడుము కింద వెనుకభాగం మీద 21 మిలియన్ డాలర్ల క్లెయిమ్ ఉంది.
డేవిడ్ బెకం బలమైన కాళ్లు, జూలియా రాబర్ట్స్ అందమైన దరహాసం, మారియా క్యారీ స్వరమాధుర్యం.. వేటికవే అన్నీ వెలకట్టలేనివే. మిలియన్ డాలర్ల విలువైనవే. వరల్డ్ క్లాస్ ఛెఫ్‌లకు ఫేవరెట్ టేస్టర్.. గోర్డాన్ రామ్సే తన నాలుకను 10 మిలియన్ డాలర్లకు ఇన్సూర్ చేయించుకున్నాడు. ఆయన నాలుకపై టేస్టీ బడ్స్ అరిగిపోతే ఆ మొత్తం ఇచ్చేస్తారన్నమాట. ఇంతకంటే ఆసక్తికరమైన పాయింట్ ఇంకోటుంది. అమెరికన్ పాపులర్ కమెడియన్ నిక్ కెనన్ తన వృషణాలను ఏకంగా 10 మిలియన్ డాలర్లకు బీమా చేయించుకున్నట్టు ఓ షోలో చెప్పుకున్నాడు.
ఇటీవలే బైసన్ అని ఒక సినిమా వచ్చింది. కబడ్డీ ఆటంటే చచ్చేంత ఇష్టపడే హీరోకి విలన్లొచ్చి మోచెయ్యి విరగ్గొడతారు. అతని ప్రొఫెషన్‌కి ఎండ్‌కార్డ్ పడ్డట్టేగా? ఇటువంటి డేంజర్లు రాకూడదనే స్పోర్ట్స్ స్టార్లు ఇన్సూరెన్స్ కంపెనీలతో డీల్ పెట్టుకుంటారు. మనకి ఇదంతా నాన్సెన్సూ, న్యూసెన్సు అనిపించొచ్చు. వాళ్లకైతే ఇన్సూరెన్సే లైఫ్. అందుకే, ఒంట్లో ప్రతీ పార్టునూ బీమా చేయించుకుని బీరువాలో భద్రంగా దాచుకుంటారు. ఏ నిమిషానికి ఏమి జరుగునో అనే భయమే వాళ్లను వెంటాడుతుంది. కన్నుకు కన్ను, కాలుకు కాలు ఇవ్వకపోయినా ఎంతోకొంత పైసలైతే ముట్టజెబుతారుగా?




