పశ్చిమాసియా యుద్ధంతో పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం.. మార్చి 23న జరగాల్సిన రిపబ్లిక్ డే పరేడ్ రద్దు!
మార్చి 23న జాతీయ దినోత్సవం సందర్భంగా జరగాల్సిన సైనిక కవాతు సహా రిపబ్లిక్ వేడుకలను పాకిస్తాన్ రద్దు చేసింది. గల్ఫ్ చమురు సంక్షోభం, ప్రభుత్వం చేపట్టిన వ్యయ నియంత్రణ చర్యల నేపథ్యంలో జాతీయ దినోత్సవ వేడుకలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కార్యాలయం తెలిపింది. ప్రతి ఏడాది మార్చి 23ని పాకిస్తాన్ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు.

మార్చి 23న జాతీయ దినోత్సవం సందర్భంగా జరగాల్సిన సైనిక కవాతు సహా రిపబ్లిక్ వేడుకలను పాకిస్తాన్ రద్దు చేసింది. గల్ఫ్ చమురు సంక్షోభం, ప్రభుత్వం చేపట్టిన వ్యయ నియంత్రణ చర్యల నేపథ్యంలో జాతీయ దినోత్సవ వేడుకలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కార్యాలయం తెలిపింది. ప్రతి ఏడాది మార్చి 23ని పాకిస్తాన్ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా పాకిస్తాన్‌కు చమురు సరఫరాకు అంతరాయం కలగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఎంవో తెలిపింది. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీని కారణంగా, పాకిస్తాన్‌లో ప్రభుత్వ వ్యయంలో ఇప్పటికే భారీ కోత విధించబడింది.
పాకిస్తాన్ అధ్యక్ష కార్యాలయం తన అధికారిక సోషల్ మీడియా X ఖాతాలో పంచుకున్న ఒక పోస్ట్‌లో కీలక ప్రకటన చేసింది “గల్ఫ్ చమురు సంక్షోభం, పొదుపు చర్యల దృష్ట్యా, 2026 మార్చి 23న జరగాల్సిన పాకిస్తాన్ దినోత్సవ పరేడ్, సంబంధిత కార్యక్రమాలను రద్దు చేసే ప్రతిపాదనను అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి సలహా మేరకు ఆమోదించారు. సన్మాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఏప్రిల్ 28కి వాయిదా వేశారు.” అని పేర్కొన్నారు.
పాకిస్తాన్ జాతీయ దినోత్సవ వేడుకలను రద్దు చేయడం ఒక చారిత్రక సంఘటనగా భావిస్తు్న్నారు. 1940 నాటి చారిత్రక లాహోర్ తీర్మానాన్ని (పాకిస్తాన్ తీర్మానం) స్మరించుకుంటూ వేడుకలు జరుపుకుంటారు. ఈ తీర్మానం ముస్లింలకు ప్రత్యేక మాతృభూమి కోసం డిమాండ్ చేసింది. ఇది 1947లో భారతదేశ విభజనకు దారితీసింది. స్వాతంత్ర్యం వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత, 1956 మార్చి 23న దేశపు మొదటి రాజ్యాంగాన్ని ఆమోదించడంతో పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌గా ప్రకటించారు. ఈ సందర్భాన్ని సాధారణంగా ఇస్లామాబాద్‌లో ఒక భారీ సైనిక కవాతుతో జరుపుకుంటారు.
ఇదిలావుంటే, మధ్యప్రాచ్య సంక్షోభం పాకిస్థాన్‌లో పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. హోర్ముజ్ జలసంధి మూసివేత పాకిస్థాన్‌లో ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఇది కోవిడ్-19 మహమ్మారి సమయంలో అమలు చేసిన చర్యలను తలపించే కఠినమైన చర్యలను పాకిస్థాన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. పాకిస్థాన్‌లో ఇంటి నుండి పని చేయడాన్ని ప్రోత్సహించారు. పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ప్రభుత్వ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల విదేశీ ప్రయాణాలను నిషేధించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల జీతాలలో కోత విధిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
