IPL 2026: వర్షం వల్ల మ్యాచ్‌లు రద్దయితే విజేతను ఎలా నిర్ణయిస్తారు.. ఐపీఎల్ కొత్త రూల్స్ ఇవే?
Rain Rules in IPL: ఐపీఎల్ 2026 సీజన్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 28న రజత్ పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ, ఇషాన్ కిషన్ సారథ్యంలోని సన్‌రైజర్స్‌తో తలపడనుంది. అయితే, ఈ మెగా టోర్నీపై వరుణుడి నీలినీడలు కమ్ముకున్నాయి. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌లు ఆగిపోతే ఫలితం ఎలా ఉంటుందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం విజేతను ఎలా ప్రకటిస్తారో ఇప్పుడు చూద్దాం..

Rain rules in IPL: మార్చి 28 నుంచి మే 31 వరకు జరగనున్న ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో ఉత్తర భారత దేశంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో పలు ప్రాంతాల్లో వర్షం మ్యాచ్‌లకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉన్నప్పటికీ, భారీ వర్షం కురిస్తే మ్యాచ్ నిర్వహణ సవాలుగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంపైర్లు అనుసరించే నిబంధనలు కీలకం కానున్నాయి.
ఫలితం కోసం ఐదు ఓవర్ల నిబంధన..
ఒకవేళ వర్షం కారణంగా ఆట నిలిచిపోతే, మ్యాచ్‌ను పూర్తి చేయడానికి అంపైర్లకు అదనంగా 2 గంటల సమయం ఉంటుంది. నిర్ణీత సమయంలో పూర్తి స్థాయి మ్యాచ్ సాధ్యం కాకపోతే, ఫలితం కోసం కనీసం చెరో 5 ఓవర్ల మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఒకవేళ ఐదు ఓవర్ల ఆట కూడా సాధ్యం కాని పక్షంలో, సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించే అవకాశం ఉంటుంది. అయితే మైదానం పరిస్థితిని బట్టి అంపైర్లు తుది నిర్ణయం తీసుకుంటారు.
పాయింట్ల పంపిణీ ఇలా..
వర్షం తగ్గకపోయినా లేదా మైదానం ఆటకు అనుకూలించకపోయినా, కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించలేని స్థితిలో ఆ మ్యాచ్‌ను రద్దు చేస్తారు. అప్పుడు ఇరు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున (1-1) కేటాయిస్తారు. లీగ్ దశలో ఈ పాయింట్లు ప్లేఆఫ్స్ అవకాశాలను ప్రభావితం చేస్తాయి.
ఫైనల్ మ్యాచ్ రద్దయితే ఛాంపియన్ ఎవరు?
లీగ్ మ్యాచ్‌లకు భిన్నంగా ఫైనల్ మ్యాచ్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ‘రిజర్వ్ డే’ను కేటాయిస్తుంది. నిర్ణీత రోజున వర్షం వల్ల ఆట సాధ్యం కాకపోతే మరుసటి రోజు నిర్వహిస్తారు. ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడి మ్యాచ్ పూర్తిగా రద్దయితే, లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో (Top of the Table) ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఉదాహరణకు, పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ రెండవ స్థానంలో, చెన్నై సూపర్ కింగ్స్ మూడవ స్థానంలో ఉండి ఫైనల్ మ్యాచ్ రద్దయితే, ముంబైని ఛాంపియన్‌గా ప్రకటిస్తారు. అయితే, ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకపోవడం విశేషం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
