AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దోమలపై కత్తికట్టిన గూగుల్.. 3.2 కోట్ల దోమల విడుదలకు రెడీ

దోమలపై కత్తికట్టిన గూగుల్.. 3.2 కోట్ల దోమల విడుదలకు రెడీ

Phani CH
|

Updated on: Jun 02, 2026 | 7:48 PM

Share

దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధులను అరికట్టేందుకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. కాలిఫోర్నియా, ఫ్లోరిడాలో 3.2 కోట్ల ప్రత్యేక మగ దోమలను విడుదల చేసి దోమల జనాభాను సహజసిద్ధంగా తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘వోల్బాకియా’ బ్యాక్టీరియాతో కూడిన ఈ దోమలు డెంగ్యూ, జికా, వెస్ట్ నైల్ వంటి వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

సాధారణంగా గూగుల్‌ అంటే సెర్చ్‌ ఇంజిన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, అత్యాధునిక టెక్నాలజీ గుర్తుకొస్తాయి. కానీ అమెరికాలోని కాలిఫోర్నియా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ అయిన గూగుల్‌ ఇప్పుడు దోమలను నాశనం చేసే.. ఓ గొప్ప ప్రయోగానికి కేంద్రంగా మారబోతోంది. ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న ఓ ప్రమాదకరమైన ప్రజారోగ్య సమస్యపై దృష్టి సారించిన గూగుల్ మాతృసంస్థ ఆల్ఫా బెట్.. ‘ముల్లును ముల్లుతోనే’ తియ్యాలి అన్నట్టుగా సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. రసాయన పురుగుమందులపై ఆధారపడకుండా దోమల వ్యాప్తిని అరికట్టడమే ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా మిలియన్ల మంది ప్రజలు దోమల వల్ల సంక్రమించే వివిధ రకాల ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా డెంగ్యూ, జికా, వెస్ట్ నైల్ వంటి వైరస్‌లు మానవాళికి పెద్ద సవాలుగా మారాయి. దీంతో డీబగ్ ప్రాజెక్ట్ పేరుతో వచ్చే రెండేళ్లలో కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో 32 మిలియన్ల ప్రత్యేక దోమలు వదిలేందుకు అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థకు గూగుల్ సంస్థ దరఖాస్తు చేసుకుంది.ఈ కార్యక్రమానికి అనుమతి లభిస్తే 3.2 కోట్ల దోమలను వదిలేందుకు సిద్ధమవుతోంది. ల్యాబ్‌లో పెంచిన ఈ మగ క్యూలెక్స్ దోమల్లో వోల్చాలియా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇవి ఆడ దోమలతో జత కడితే పుట్టబోయే గుడ్లు పెరగవు. దీంతో పురుగుమందు లేకుండానే దోమల జనాభాను గణనీయంగా తగ్గించవచ్చు. తద్వారా డెంగ్యూ, చికున్ గున్యా, జికా తదితర రోగాల బారిన పడకుండా కాపాడుకోవాలన్నది గూగుల్ ప్రణాళిక. గూగుల్ ప్రతిపాదనపై జూన్ 5వరకు పర్యావరణ పరిరక్షణ సంస్థ అభిప్రాయాలను సేకరిస్తోంది. ఆల్ఫాబెట్‌కు చెందిన ‘వెరిలీ’ విభాగం ‘డీబగ్’ అనే ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా, ‘వొల్బాకియా’ అనే సహజ సిద్ధమైన బ్యాక్టీరియాతో నింపిన మగ దోమలను వాతావరణంలోకి విడుదల చేస్తారు. ఈ మగ దోమలు అడవిలో ఉండే ఆడ దోమలతో కలిసినప్పుడు, వాటి నుంచి వెలువడే గుడ్లు పొదగవు. ఫలితంగా, దోమల జనాభా క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇది జన్యు మార్పిడి కాదని, కేవలం సహజ పద్ధతి అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా ల్యాబ్‌లలో ఇంత భారీ సంఖ్యలో దోమలను ఉత్పత్తి చేయడం, వాటిని పర్యవేక్షించడం మానవ శ్రమతో కూడుకున్న పని. కానీ, గూగుల్ తన రోబోటిక్స్, ఏఐ సాంకేతికతను ఉపయోగించి అతి తక్కువ సమయంలో కోట్లాది సున్నితమైన దోమలను పెంచే సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. చాలామందికి ఒక అనుమానం రావచ్చు… “ఇప్పటికే దోమలు ఎక్కువై జనాలు చస్తుంటే, గూగుల్ మళ్లీ కోట్ల కొద్దీ దోమలను ప్రకృతిలోకి వదలడం ఏంటి?” అని. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. గూగుల్ విడుదల చేయబోయే దోమలు సాధారణ దోమలు కావు. గత సంవత్సరం, ఈ కార్యక్రమం ‘వోల్బాకియా’ అనే ఒక ప్రత్యేక రూపంతో కూడిన ప్రయోజనకరమైన బ్యాక్టీరియా సోకిన దోమలను ప్రయోగించి డెంగ్యూ, జికా వంటి వైరస్‌ల వ్యాప్తికి ప్రధాన కారణమైన దోమల జనాభాను ప్రకృతిలోనే తగ్గించవచ్చు. అయితే, గతంలో కూడా ఇలాంటి ప్రయోగాలు చాలా జరిగినా అవి అనుకున్నంత సక్సెస్ కాలేదు. కానీ, ఈ డీబగ్ ప్రయోగం ద్వారా దీనిని సక్సెస్ చేయాలని పట్టుదలతో పనిచేస్తోంది. ఫెడరల్ రిజిస్టర్ నోటీసు ప్రకారం, గూగుల్ ఈ ప్రాజెక్ట్‌ను రెండు దశల్లో పరీక్షించనుంది. మొదటి సంవత్సరం 1.6 కోట్లు, రెండవ సంవత్సరం మరో 1.6 కోట్ల వంధ్యీకరించిన మగ దోమలను ఎంపిక చేసిన ప్రాంతాలలో విడుదల చేస్తారు.ఇలా మొత్తంగా రెండు సంవత్సరాలలో 3.2 కోట్ల దోమలను పర్యావరణంలోకి ప్రవేశపెడతారు. మరి.. ఇన్ని కోట్ల దోమలు ఊరిమీద పడితే.. సమస్య మరింత తీవ్రతరం అవుతుందని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అయితే.. నిజానికి ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడతాయి. ఎందుకంటే వాటి గుడ్ల ఉత్పత్తికి రక్తం అవసరం. కానీ గూగుల్ ఉత్పత్తి చేస్తోంది మగ దోమలు కనుక కుడతాయనే భయం లేదు. పైగా, మగదోమలు మొక్కల రసాలను మాత్రమే తాగి బతుకుతాయని గూగుల్ నిపుణులు భరోసా ఇస్తున్నారు. డెంగ్యూ, జికా, చికున్‌గున్యా, పసుపు జ్వరం మరియు సెయింట్ లూయిస్ ఎన్సెఫలైటిస్ వంటి రోగాలకు కారణమవుతున్న దోమల పనిపట్టటమే తమ ముఖ్య లక్ష్యమని వారు వివరిస్తున్నారు. యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదికల ప్రకారం, ప్రస్తుతం ఖండాంతర యునైటెడ్ స్టేట్స్ అంతటా ‘వెస్ట్ నైల్ వైరస్’ అనేది దోమల ద్వారా సంక్రమించే అత్యంత ప్రబలమైన వ్యాధిగా మిగిలిపోయింది. ఏటా అమెరికాలో దాదాపు 1,300 మందికి పైగా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇది మెదడు, వెన్నుపాము, కేంద్ర నాడీ వ్యవస్థలోని ఇతర ముఖ్యమైన భాగాలను తీవ్రంగా ప్రభావితం చేసి ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.సాధారణంగా మానవ నివాసాల మధ్య కనిపించే దోమల జాతులలో ‘క్యూలెక్స్’, ‘ఏడిస్’ అనే రెండు రకాలు ప్రధానమైనవి. క్యూలెక్స్ దోమలు సాధారణంగా సాయంత్రం వేళల్లోను, రాత్రిపూట అత్యంత చురుకుగా ఉండి మనుషులను కుడతాయి. ఏడిస్ దోమలు పగటిపూట మాత్రమే కుడతాయి. డెంగ్యూ, జికా వంటివి వీటి ద్వారానే వ్యాపిస్తాయి. ప్రస్తుతం అమెరికా నియంత్రణ సంస్థలు ఈ అప్లికేషన్‌ను నిశితంగా పరిశీలిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ సంస్థ తన సమీక్షా ప్రక్రియలో భాగంగా జూన్ 5 వరకు ప్రజల నుండి సలహాలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను ఆహ్వానిస్తోంది. నియంత్రణ సంస్థలు ఈ ప్రతిపాదిత ప్రయోగం యొక్క పూర్తి పరిధిని, వ్యూహాన్ని వెల్లడించినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రయోగం ఖచ్చితంగా ఏయే నగరాల్లో, ఏయే నిర్దిష్ట ప్రాంతాలలో జరుగుతుంది, అలాగే మొదటి బ్యాచ్ ఎప్పుడు విడుదలవుతుంది అనే వివరాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఒకవేళ వీటికి ఫెడరల్ ఆమోదం లభిస్తే, రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దోమల నివారణకు ఇదొక సరికొత్త బెంచ్‌మార్క్‌గా మారనుంది. టెక్నాలజీ రంగంలోనే కాకుండా పర్యావరణ, ఆరోగ్య రంగాల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి గూగుల్ చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో దోమల వల్ల వచ్చే ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు సహజసిద్ధమైన పద్ధతిలోనే అడ్డుకట్ట వేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చుక్క రక్తంతో క్యాన్సర్‌ గుట్టురట్టు.. మన నిమ్స్‌లో ఫ్రీగానే పరీక్ష!

యువకుడిగా ఉండగా పరీక్ష.. వృద్ధుడయ్యాక వచ్చిన కొలువు!

తండ్రి ప్రేమ.. కొడుకు హోంవర్క్‌ చేద్దామని ప్రయత్నిస్తే..

రబ్బరు పడవలో 30 గంటల జర్నీ.. కుటుంబాన్ని కలవడం కోసం సాహసం

చెన్నకేశవ స్వామి పాదాల నుంచి ఎర్రని ద్రవం! కలియుగాంతానికి సంకేతమంటూ భక్తుల్లో భయం

Follow Us