AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్ 2026 ముగిసింది.. కోహ్లీ, గేల్ సృష్టించిన ఆ 5 రికార్డులను తాకడం ఎవరితరం కాలేదుగా!

IPL 2026 : ఈ సీజన్‌ లో టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ లాంటి యంగ్ ప్లేయర్లు ఎన్నో కొత్త రికార్డులు బద్దలు కొట్టినప్పటికీ.. ఐపీఎల్ చరిత్ర లోనే అత్యంత అరుదైన కొన్ని పాత రికార్డులు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోయాయి.

IPL 2026 : ఐపీఎల్ 2026 ముగిసింది.. కోహ్లీ, గేల్ సృష్టించిన ఆ 5 రికార్డులను తాకడం ఎవరితరం కాలేదుగా!
Ipl (1)
Rakesh
|

Updated on: Jun 02, 2026 | 9:13 PM

Share

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ఎంతో ఉత్కంఠభరితంగా ముగిసింది. గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి, రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఈ సీజన్‌లో టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ లాంటి యంగ్ ప్లేయర్లు ఎన్నో కొత్త రికార్డులు బద్దలు కొట్టినప్పటికీ.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అరుదైన కొన్ని పాత రికార్డులు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండిపోయాయి. క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ నెలకొల్పిన ఆ ఐదు చారిత్రాత్మక రికార్డులను బ్రేక్ చేయడానికి ఈ ఏడాది ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

క్రిస్ గేల్ 175 రికార్డును తృటిలో మిస్ చేసిన కేఎల్ రాహుల్

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు వెస్టిండీస్ లెజెండ్, ఆర్సీబీ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఆయన 2013 సీజన్‌లో పుణే వారియర్స్ జట్టుపై కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు. తాజా ఐపీఎల్ 2026 లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఈ రికార్డును బద్దలు కొట్టేంత పని చేశారు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఏకంగా 152 పరుగులు సాధించి అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. అయితే గేల్ పేరిట ఉన్న 175 పరుగుల మైలురాయిని అధిగమించడానికి ఆయనకు మరో 24 పరుగులు తక్కువ కావడంతో ఆ చారిత్రాత్మక రికార్డు అలాగే భద్రంగా ఉండిపోయింది.

విరాట్ కోహ్లీ 973 రన్స్ రికార్డు

ఒక ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. ఆయన 2016 ఐపీఎల్ సీజన్‌లో కళ్ళు చెదిరే ప్రదర్శనతో ఏకంగా 973 పరుగులు సాధించి ఈ అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్ 2026 లో వైభవ్ సూర్యవంశీ, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ వంటి టాప్ బ్యాటర్లు అద్భుతమైన ఫామ్‌తో స్థిరంగా పరుగులు సాధించినప్పటికీ కోహ్లీ రికార్డును మాత్రం దాటలేకపోయారు. ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నప్పటికీ, విరాట్ కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు కంటే 198 పరుగులు వెనుకబడే నిలిచిపోయారు.

క్రిస్ గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిట ఉంది. ఆయన కేవలం 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఈ ఘనత సాధించారు. ఐపీఎల్ 2026 లో ఈ రికార్డు దాదాపు బద్దలైనంత పని అయింది. రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులకు చేరుకుని గేల్ రికార్డును బ్రేక్ చేసేలా కనిపించారు, కానీ ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో అవుట్ కావడంతో ఆ రికార్డు తృటిలో తప్పించుకుంది. ఆ తర్వాత వైభవ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 36 బంతుల్లోనే మెరుపు సెంచరీ సాధించినప్పటికీ.. 2013 నాటి గేల్ 30 బంతుల రికార్డును మాత్రం అధిగమించలేకపోయారు.

హర్షల్, బ్రావోల 32 వికెట్ల రికార్డు సేఫ్

ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును హర్షల్ పటేల్, డ్వేన్ బ్రావోలు సంయుక్తంగా పంచుకుంటున్నారు. హర్షల్ పటేల్ 2021 లో ఆర్సీబీ తరఫున, బ్రావో 2013 లో సీఎస్‌కే తరఫున చెరో 32 వికెట్లు తీసి ఈ రికార్డు నెలకొల్పారు. ఐపీఎల్ 2026 లో ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్, గుజరాత్ టైటాన్స్ బౌలర్ కగిసో రబడాలు అద్భుతమైన ఫామ్‌లో రాణించారు. రబడా అద్భుత ప్రదర్శనతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకోగా, భువనేశ్వర్ కుమార్ 28 వికెట్లతో రాణించారు. అయినప్పటికీ వీరిద్దరూ హర్షల్ పటేల్, బ్రావోల 32 వికెట్ల మార్కును చేరుకోవడంలో విఫలమయ్యారు.

ఒకే సీజన్‌లో 4 సెంచరీల రికార్డు

ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సెంచరీలు (4 సెంచరీలు) చేసిన రికార్డు విరాట్ కోహ్లీ, జోస్ బట్లర్ పేరిట ఉమ్మడిగా ఉంది. కోహ్లీ 2016లో ఈ ఘనత సాధించగా, బట్లర్ 2022 లో దానిని పునరావృతం చేశారు. అయితే ఐపీఎల్ 2026లో ఏ ఒక్క బ్యాటర్ కూడా ఈ మార్కును అందుకోలేకపోయారు. ఈ సీజన్‌లో సీఎస్‌కే ఓపెనర్ సంజూ శాంసన్ ఒక్కడే ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు (2 సెంచరీలు) సాధించాడు. మిగిలిన బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, వైభవ్ సూర్యవంశీలతో కలిపి మొత్తం 13 మంది బ్యాటర్లు తలా ఒక సెంచరీ మాత్రమే చేయగలిగారు. దీంతో ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీల రికార్డు ఈసారి కూడా పదిలంగానే ఉండిపోయింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us