AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో దడ పుట్టిస్తున్న లంగ్ క్యాన్సర్ కేసులు.. ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్

సాధారణంగా సిగరెట్లు, బీడీలు వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణంగా భావిస్తారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం కూడా ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. గత ఆరేళ్లలో నమోదైన ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు, మరణాల గణాంకాలు చూస్తే.. పొగతాగని వారిలోనూ ఈ మహమ్మారి విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కాలుష్యం కట్టడికి తక్షణ చర్యలు చేపట్టకపోతే ఢిల్లీ తీవ్ర ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.

దేశంలో దడ పుట్టిస్తున్న లంగ్ క్యాన్సర్ కేసులు.. ఈ లక్షణాలు కనిపిస్తే బీ కేర్‌ఫుల్
Delhi Air Pollution
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Nov 25, 2026 | 1:13 PM

Share

దేశ రాజధాని ఢిల్లీలో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది.ఢిల్లీలో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు, మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైన తాజా గణాంకాలు ఈ భయానక వాస్తవాన్ని కళ్లకు కడుతున్నాయి. 2020 జనవరి నుంచి 2026 జూలై మధ్య కాలంలో ఢిల్లీలోని నాలుగు ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులలోనే ఏకంగా 6,581 ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు నమోదు కాగా, 913 మంది మృత్యువాత పడ్డారు. ఈ లెక్కన రాజధానిలో సగటున ప్రతి మూడు రోజులకు ఒకరు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు.

ఆసుపత్రుల వారీగా క్యాన్సర్ కేసులు

ఆర్టీఐ సమాచారం ప్రకారం, నెలకు సగటున సుమారు 83 కొత్త క్యాన్సర్ కేసులు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో ఆసుపత్రుల వారీగా నమోదైన వివరాలు చూస్తే ఆందోళన కలిగిస్తున్నాయి. ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యధికంగా 4,860 కేసులు నమోదు కాగా, 158 మంది మరణించారు. మార్చి 2026 వరకు అందిన డేటా ప్రకారం నెలకు సగటున 65 కేసులు నమోదవుతున్నాయి.

ఇక సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో మొత్తం కేసుల వివరాలు వెల్లడించనప్పటికీ, అత్యధికంగా 393 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ (DSCI)లో 1,613 కేసులు నమోదు కాగా, 354 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో 351 మంది మహిళలు ఉండగా, 2021లో ఇద్దరు చిన్నారులకు సైతం ఈ వ్యాధి నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో 108 కేసులు నమోదు కాగా, 8 మంది మరణించారు. వీరిలో 47 మంది మహిళలు ఉన్నారు.

పొగతాగని వారిలోనూ క్యాన్సర్ ముప్పు!

సాధారణంగా ధూమపానం చేసేవారిలోనే ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ ఢిల్లీలో పొగతాగే అలవాటు లేని మహిళలు, యువత సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి దీర్ఘకాలిక వాయు కాలుష్యం, జన్యుపరమైన మార్పులే ప్రధాన కారణమని వారు స్పష్టం చేస్తున్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ బహిరంగ వాయు కాలుష్యాన్ని, ముఖ్యంగా PM2.5 వంటి అత్యంత సూక్ష్మ ధూళి కణాలను క్యాన్సర్ కారకాలుగా ప్రకటించింది.

మనం శ్వాస తీసుకున్నప్పుడు ఈ సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల లోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి కణాలను దెబ్బతీస్తాయి. కాలక్రమేణా ఇది క్యాన్సర్‌కు దారితీస్తోంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలామంది రోగులు వ్యాధి ముదిరిన చివరి దశలో ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. దీనివల్ల చికిత్స కష్టతరమై మరణాల సంఖ్య పెరుగుతోంది. సాధారణ ఎక్స్-రే ద్వారా దీనిని ప్రారంభ దశలో గుర్తించడం కష్టమని, ముందస్తు నిర్ధారణకు సీటీ స్కాన్ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాల్సిందే

దీర్ఘకాలంగా తగ్గని దగ్గు, దగ్గులో రక్తం పడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, గొంతు బొంగురుపోవడం, కారణం లేకుండా వేగంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us