AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Sooryavanshi: 28 సిక్సర్లతో వైభవ్ విధ్వంసం.. జట్టంతా కలిసి కొట్టిన సిక్సర్లను ఒక్కడే కొట్టేశాడు

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ యూఏఈపై 53 బంతుల్లో 204 పరుగులు చేసి 28 సిక్సర్లు బాదాడు. ఈ ఇన్నింగ్స్‌తో లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు సృష్టించడమే కాకుండా, ఇంగ్లండ్ జట్టు పేరిట ఉన్న 26 సిక్సర్ల రికార్డును కూడా అధిగమించాడు.

Vaibhav Sooryavanshi: 28 సిక్సర్లతో వైభవ్ విధ్వంసం.. జట్టంతా కలిసి కొట్టిన సిక్సర్లను ఒక్కడే కొట్టేశాడు
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: Nov 25, 2026 | 11:53 AM

Share

Vaibhav Sooryavanshi: క్రికెట్‌లో ఒక ఆటగాడు మరో ఆటగాడి రికార్డును బద్దలు కొట్టడం సహజం. కానీ ఒకే ఇన్నింగ్స్‌తో ఏకంగా ప్రపంచ క్రికెట్‌లోని అగ్ర జట్ల రికార్డులనే తిరగరాస్తే? వైభవ్ సూర్యవంశీ సరిగ్గా ఇదే చేసి చూపించాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఈ యంగ్ సెన్సేషన్ కేవలం 53 బంతుల్లో 204 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 28 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో లిస్ట్-ఏ క్రికెట్‌లో వ్యక్తిగత రికార్డులే కాదు.. జట్ల పేరిట ఉన్న సిక్సర్ల రికార్డులను కూడా అధిగమించాడు. ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, భారత్ వంటి జట్లు ఒక ఇన్నింగ్స్‌లో సాధించిన సిక్సర్ల సంఖ్యను వైభవ్ ఒక్కడే దాటేశాడు.

ఇంగ్లండ్ రికార్డు బద్దలు

ఒక వన్డే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా ఇంగ్లండ్ పేరిట 26 సిక్సర్ల రికార్డు ఉంది. కానీ వైభవ్ సూర్యవంశీ యూఏఈపై ఒక్కడే 28 సిక్సర్లు బాదడంతో ఆ రికార్డును అధిగమించాడు. అంటే ఒక జట్టులోని బ్యాటర్లందరూ కలిసి సాధించిన రికార్డు కంటే ఒక ఆటగాడే ఎక్కువ సిక్సర్లు కొట్టాడు. ఈ విషయంలో వైభవ్ సృష్టించిన రికార్డు ఎంత ప్రత్యేకమో అర్థం చేసుకోవచ్చు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా అతడు చరిత్రలో నిలిచాడు.

ఏ జట్టు ఎన్ని సిక్సర్లు కొట్టిందంటే?

ఒక ఇన్నింగ్స్‌లో జట్లు బాదిన అత్యధిక సిక్సర్ల జాబితాను పరిశీలిస్తే ఇంగ్లండ్ 26 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉంది. వెస్టిండీస్ 23 సిక్సర్లతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ 22 సిక్సర్లతో తర్వాతి స్థానంలో ఉన్నాయి. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు చెరో 20 సిక్సర్లు బాదగా, భారత్ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 19 సిక్సర్లు కొట్టింది. కానీ వైభవ్ ఒక్కడే 28 సిక్సర్లు బాదడంతో ఈ జట్లన్నింటినీ వెనక్కి నెట్టాడు. ఒక ఆటగాడు ఒకే ఇన్నింగ్స్‌లో ఇంత భారీ సంఖ్యలో సిక్సర్లు బాదడం ప్రొఫెషనల్ క్రికెట్‌లోనే అరుదైన ఘనత.

త‌న్మ‌య్ అగర్వాల్, డార్సీ షార్ట్ రికార్డులు కూడా వెనక్కి

ఇప్పటివరకు ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో పలువురు ప్రముఖులు ఉన్నారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో హైదరాబాద్ ఆటగాడు తన్మయ్ అగర్వాల్ 26 సిక్సర్లు బాదిన రికార్డు ఉంది. న్యూజిలాండ్ ఆటగాడు కోలిన్ మున్రో 23 సిక్సర్లు కొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో డార్సీ షార్ట్ 23 సిక్సర్లతో రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు వైభవ్ 28 సిక్సర్లతో ఈ రికార్డులన్నింటినీ అధిగమించాడు. అతడి వయసు, ఆడిన బంతుల సంఖ్యను చూస్తే ఈ ఘనత మరింత ప్రత్యేకంగా కనిపిస్తోంది.

52 బంతుల్లో డబుల్ సెంచరీ

వైభవ్ ఈ మ్యాచ్‌లో 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 53 బంతులు ఎదుర్కొని 204 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి స్కోరులో 7 ఫోర్లు, 28 సిక్సర్లు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ, 150 పరుగులు, డబుల్ సెంచరీ సాధించిన రికార్డులు కూడా ఈ ఇన్నింగ్స్‌లోనే అతడి ఖాతాలో చేరాయి. మరోవైపు భారత్-ఎ జట్టు కూడా ఈ మ్యాచ్‌లో పరుగుల వేగంతో కొత్త మైలురాళ్లు అందుకుంది. లిస్ట్-ఏ క్రికెట్‌లో 50, 100, 200, 250 పరుగుల మార్కులను అత్యంత తక్కువ బంతుల్లో చేరిన జట్టుగా రికార్డులు నమోదు చేసిందని నివేదిక పేర్కొంది. మొత్తంగా వైభవ్ ఇన్నింగ్స్ ఒక్క ఆటగాడి రికార్డులకే పరిమితం కాకుండా, జట్టు రికార్డులపైనా తనదైన ముద్ర వేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us