సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు.. చంద్రబాబు, పవన్ కీలక ఆదేశాలు.. 5 హెలికాప్టర్లతో గాలింపు!
కాకినాడ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ నెల 4న చేపల వేటకు వెళ్లిన వీరితో 19వ తేదీ నుంచి సంబంధాలు తెగిపోయాయి. పూరి, పారాదీప్ తీరంలో ఐదు హెలికాప్టర్లు, కోస్ట్ గార్డు సిబ్బందితో గాలింపు కొనసాగుతోంది. మత్స్యకారుల ఆచూకీ తెలుసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

కాకినాడ: సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన కాకినాడ జిల్లా మత్స్యకారుల ఆచూకీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల వివరాలు, జరుగుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాలుగా సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.
పూరి, పారాదీప్ తీరంలో హెలికాప్టర్లతో గాలింపు..
మత్స్యకారులను సురక్షితంగా వెతికేందుకు ఏపీ యంత్రాంగం ఒడిశా కోస్ట్ గార్డులతో కలిసి సంయుక్త గాలింపు ఆపరేషన్ ప్రారంభించింది. పూరి, పారాదీప్ సముద్ర ప్రాంతాల్లో సుమారు 25 మంది కోస్ట్ గార్డు సిబ్బంది, ఐదు హెలికాప్టర్ల సాయంతో విస్తృతంగా అన్వేషణ సాగిస్తున్నారు. అయితే, బోటులోని ట్రాన్స్‌పాండర్ పనిచేయకపోవడం వల్ల మత్స్యకారుల కచ్చితమైన స్థానాన్ని గుర్తించడం సవాలుగా మారిందని అధికారులు వెల్లడించారు.
19వ తేదీన తెగిపోయిన సంబంధాలు.. కుటుంబ సభ్యుల్లో ఆందోళన..
గల్లంతైన మత్స్యకారులను కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన వారిగా గుర్తించారు. వీరు ఈ నెల 4వ తేదీన చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. సింహాద్రికి చెందిన మోటరైజ్డ్ ఫిషింగ్ బోటులో ఆయనతోపాటు.. తిరి నారాయణ, గంపల ప్రకాష్, మెరుగు నారాయణ, సూరాడ చిన్న, రాము, సూరాడ కోదండ ఉన్నారని అధికారులు తెలిపారు. 19వ తేదీ వరకు కుటుంబ సభ్యులతో మాట్లాడిన వీరు.. ఆ తర్వాత వారితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇటీవలి ‘అక్వాన్’ తుఫాన్ ప్రభావం వీరి బోటుపై ఏమైనా పడిందా అన్న కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు. రోజులు గడుస్తున్నా తమ వారి ఆచూకీ లభించకపోవడంతో ఉప్పాడలోని మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆందోళన, కన్నీటిసంద్రంలో మునిగిపోయాయి.
