AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి ఎప్పుడైన విన్నారా?

శ్మశానమంటే చాలా మందికి భయం.. అందుకే ప్రతి ఊరికి దూరంగా స్మశానం ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని  ఓ గ్రామంలో మాత్రం అందుకు పూర్తి భిన్నం.. అక్కడ ఊర్లోని ఇళ్ళ ముంగిటే సమాధులు దర్శనమిస్తాయి. కొన్ని దశబ్ధాలుగా ఆ గ్రామస్ధులంతా శ్మశానాల మధ్యే జీవనం గడుపుతున్నారు. ఇంతకు ఆ గ్రామం ఏదనేగా మీ డౌట్ చూద్దాం పదండి.

Andhra News: సమాధులే ఇంటి దేవతలు.. ఏపీలోని ఈ వింత గ్రామం గురించి ఎప్పుడైన విన్నారా?
Andhra News
J Y Nagi Reddy
| Edited By: Anand T|

Updated on: Dec 15, 2025 | 6:41 PM

Share

కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలంలో అయ్యకొండ అనే గ్రామం ఉంది. ఈ గ్రామానికి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత ఉంది. కొండపైన ఉండే ఈ గ్రామంలో సుమారు 100 కుటుంబాలు నివాసముంటున్నాయి. తరతరాలుగా ఈగ్రామంలో వింత ఆచారం కొనసాగుతుంది. అక్కడ నివశించే కుటుంబాలలో ఎవరు చనిపోయినా ఇళ్ళ ముంగిటే వారిని సమాధి చేస్తారు. ప్రస్తుతం ఆగ్రామంలో ప్రతి ఇంటి ముంగిట సమాధులే దర్శనమిస్తాయి. ఆ సమాధుల మధ్యే ఆ ఊరిజనం జీవనం సాగిస్తున్నారు. ఈ గ్రామస్తులంతా ఒకే వంశానికి చెందిన వారు. వీరంతా మాల దాసరి కుటుంబానికి చెందిన వారు.

చరిత్ర ప్రకారం అయ్యకొండపై అప్పట్లో చింతల మునిస్వామి తాత అనే యోగి అధ్యాత్మిక చింతనతో గడిపారని చెప్తారు. కొండ దిగువనున్న ఓ భూస్వామికి చెందిన ఆవు రోజు కొండపైకి చేరుకుని మునిస్వామి తాతకు పితకకుండానే పాలు ఇస్తుంది. ఈ విషయాన్ని భూస్వామి వద్ద ఉండే పశువుల కాపరి ఎల్లప్ప గమనించి ఆశ్ఛర్యపోయాడట. అప్పటి నుండి చింతల మునిస్వామి వద్దే అధ్యాత్మిక సేవలో ఎలప్ప మునిగిపోయాడు. ఎల్లప్ప అతని కుమారుడికి సైతం బాల మునిస్వామిగా నామకరణం చేశాడు. ఎల్లప్ప మరణించటంతో అతని కుమారుడు బాల మునిస్వామి అతని దేహాన్ని ఇంటి ముంగిటే సమాధి చేశాడు.

ప్రతి శనివారం సమాధిని పేడతో అలికి, అగరొత్తులు వెలిగించటం ప్రారంభించాడు. ఆనాటి నుండి అయ్యకొండలో కుటుంబాలు పెరిగిపోతు వచ్చాయి. చనిపోయిన వారిని ఇంటిముందే సమాధి చేయటం అచారంగా కొనసాగుతూ వస్తోంది. గ్రామస్తులు ప్రతినిత్యం తాము ఏమి తిన్నా, తాగినా ముందుగా చింతల మునిస్వామి తాత సమాధి వద్ద కొంత ఉంచిన తరువాతే వారు తినటం ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ మరో విచిత్రమేటంటే ఆ గ్రామంలోని ఏ ఇంట్లో కూడా మంచం కనిపించదు. మునిస్వామి తాతకు మంచం వాడొద్దని బడేసాహేబ్ శాపం పెట్టారని అందుకే అనాటి నుండి మంచాలు వాడబోమని గ్రామస్తులు చెబుతున్నారు.

ఈ గ్రామంలో ఏడు తరాలుగా ఈ అచార వ్యవహారాల్లో నేటికి ఎలాంటి మార్పులేదు. అంతేకాదు ఈ కొండపై మాల దాసుల వంశస్ధులు తప్ప మరొకరు ఎవరు నివాసం ఉండేందుకు సాహసం చేయరు. ఒకవేళ ఎవరైనా కొండపై నివాసం ఉండాలని గ్రామంలోకి వచ్చినా సాయంత్రానికి కల్లా కొండదిగి వారంతట వారే వెళ్ళిపోతారని స్ధానికులు చెబుతున్నారు. గ్రామానికి చెందిన వారు ఎవరైనా పని నిమిత్తం ఇతర గ్రామాలకు వెళ్ళినా రాత్రి సమయానికి తిరిగి ఇంటికి చేరాల్సిందే.

గ్రామంలోని చిన్నారులంతా తమ ఇళ్ళ ముందు ఉన్న సమాధులపైనే ఆటపాటలతో గడుపుతారు. కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిపైనే కూర్చుని అన్నపానీయాలు స్వీకరిస్తుంటారు. ప్రతి అమావాస్యనాడు చింతల మునిస్వామికి గ్రామస్తులంతా కలసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సమాధులకు పూజలు చేయటం ద్వారా తమ పెద్దలను దేవుళ్ళుగా కొలుస్తామని స్ధానికులు చెబుతున్నారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.