Telangana: మందుబాబులు మరీ ఇలా తయారయ్యారేంట్రా.! లిక్కర్ కోసం ఏం చేసారో తెలిస్తే
తన వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగాలని ఓ బెల్ట్ షాపు నిర్వహకుడు కొత్తదారి ఎంచుకున్నాడు. తన బెల్ట్ షాపులో అమ్మాల్సిన మద్యాన్ని వైన్స్‌ల్లో నుంచి కొనుగోలు చేయాల్సిందిపోయి నేరుగా ఆ వైన్స్‌లకే కన్నం వేశాడు. ఒక్కడితో అయ్యే పని కాదని భావించి ఓ ఐదుగురితో ముఠా కట్టి మద్యం షాపుల్లోని మద్యాన్నంత లూఠీ చేసేశాడు.

నిర్మల్ జిల్లా బైంసా డివిజన్‌లో తాజాగా రెండు వైన్స్ షాపుల్లో వరుసగా చోరీలు జరిగాయి. వైన్స్‌లో కేవలం మందు మాత్రమే మాయం అవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చోరీకి గురైన ముథోల్, తానూర్ మండల కేంద్రాల్లోని రెండు వైన్స్ షాపుల్లోని సీసీ పుటేజ్‌లను పరిశీలించారు పోలీసులు. సీసీ పుటేజ్ ఆధారంగా ముథోల్ సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో ఒక టీంగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం తాడ్‌బిలోలికి చెందిన వినోద్ అనే యువకుడు ఈ రెండు వైన్స్ షాపుల్లో చోరీకి పాల్పడి మద్యాన్ని ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు.
ఇది చదవండి: మహిళ స్నానం చేస్తుండగా మెరిసిన ఏదో లైట్.. ఏంటా అని పరిశీలించగా
తాడ్‌బిలోలి గ్రామంలో బెల్టు షాపు నిర్వహిస్తున్న వినోద్.. షాపులో అమ్మేందుకు మద్యం లేకపోవడంతో వైన్స్ షాపునకే కన్నం వేయాలని ఫిక్స్ అయ్యాడు. సొంత జిల్లాలోని మద్యం షాపుల్లో దొంగతనానికి పాల్పడితే ఇట్టే దొరికేస్తానని భావించి పక్క జిల్లా అయిన నిర్మల్‌పై ఫోకస్ చేశాడు. ఈ దొంగతనానికి తన వద్దకు మందుకోసం రెగ్యులర్‌గా వచ్చే నవీన్, దిలీప్, రోహిత్, రోహన్, శ్రవణ్ కుమార్ అనే యువకులను ముఠాగా చేర్చుకున్నాడు. రెండు బృందాలుగా ఏర్పడిన వీరు ముందుగా ముథోల్‌లోని వైన్స్ షాపులో దొంగతనం చేశారు. అక్కడి నుంచి తానూర్‌లోని మరో వైన్స్ షాప్‌లో మద్యం బాటిళ్లను దొంగతనం చేసి బెల్టు షాపునకు తీసుకెళ్లారు. సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించిన పోలీసులు వీరిని అరెస్టు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ముథోల్‌లో రూ. 2.50 లక్షలు, తానూర్‌లో రూ. 80 వేల మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లినట్లు నిర్ధారణ అయ్యిందని అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
ఇది చదవండి: రోడ్డుపై పిండం పెట్టారనుకునేరు.. కాస్త జూమ్ చేసి చూడగా కళ్లు తేలేస్తారు








